
ప్రజాశక్తి -గిద్దలూరు రూరల్ : లౌకికవాదం,ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివద్ధి కోసం ఈ నెల 15న విజయవాడలో నిర్వహిస్తున్న ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం గిద్దలూరు డివిజన్ కమిటీ పిలుపునిచ్చింది. ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ గిద్దలూరు, రాచర్ల, కంభం, బేస్తవారిపేట, కొమరోలు మండలాల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు తోట తిరుపతిరావు, టి.ఆవులయ్య మాట్లాడుతూ బిజెపి ప్రజల మధ్య మతద్వేషాలు రెచ్చగొడుతుందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో మైనార్టీలకు భద్రత లేకుండా పోతుందన్నారు. మహిళలను నగంగా నడిరోడ్డు మీద ఊరేగిస్తున్నారని విమర్శించారు. కోట్లాది మంది కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులను యజమానులకు బానిసలుగా చేయడం దుర్మార్గమని తెలిపారు. ఆహార భద్రతకు ముప్పు తెచ్చే నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చినట్లు తెలిపారు. అదేమని ప్రశ్నించిన వారిపై అర్బన్ నక్సల్స్ పేరుతో దేశద్రోహం నేరం మోపి కేసులు బనాయించి విచారణ లేకుండా ఏళ్ల తరబడి జైళ్లలో నిర్భందిస్తున్నట్లు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదల నడ్డివిరుస్తున్నట్లు తెలిపారు. కష్ణపట్నం, గంగవరం, మేజర్ పోర్టులు, రాష్ట్ర ప్రజల సంపదను ఒక్కొక్కటిగా ఆదానికి నైవేథ్యంగా పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంపద దోచుకుంటున్న కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాలే ధైర్యం లేనపుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసిపి ప్రభుత్వం వల్ల ప్రజలకు, రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపి రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం గురించి ఏమీ మాట్లాడం లేదన్నారు. పార్లమెంట్‌లో బిజెపిని బలపరుస్తోందని విమర్శించారు. అసమానతలు లేని అభివద్ధిని సాధించేందుకు ఈనెల 15న విజయవాడలో నిర్వహిస్తున్న ప్రజా రక్షణభేరి బహిరంగ సభలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం కొమరోలు మండల నాయకురాలు పి.అంజమ్మ, రామయ్య ,వై. సింగరయ్య, రాచర్ల మండల నాయకుడు డి.తామస్, గిద్దలూరు మండల నాయకులు డి.శ్రీనివాసులు,బి.పూర్ణ ,ఎస్‌కె. అన్వర్, బి. నర్సింహులు, ఎంఎస్. బేగ్ తదితరులు పాల్గొన్నారు.