Apr 23,2023 00:43
బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న రేణింగవరం ఎస్‌ఐ తిరుపతిరావు

ప్రజాశక్తి-పంగులూరు: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేణింగవరం ఎస్‌ఐ కేకే తిరుపతిరావు అన్నారు. శుక్రవారం రాత్రి మండల కేంద్రమైన పంగులూరు గ్రామంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న కొంతమందిని తిరుపతిరావు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల వెంబడి బహిరంగ ప్రదేశాల్లో కొంతమంది మద్యం సేవిస్తూ ప్రజలకు ఆటంకం కలిగిస్తున్నారని, కొంతమంది విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ నిబంధనలను అతిక్రమిస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇందుకోసం తాను ప్రతిరోజూ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఆటోలో అత్యధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకొని ప్రయాణం చేస్తున్నారని, అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. లైసెన్సు లేకుండా ప్రయాణించే వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.