Jun 19,2023 01:06

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : కాంగ్రెస్‌ పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని డిసిసిబి చైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు ఆరోపించారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 45 గజాల ఇంటి స్థలంతో రాజకీయం ప్రారంభించిన కన్నా ఇప్పుడు ఎన్ని వేల కోట్లు అర్జించారని ప్రశ్నించారు. సహకార సంఘాల్లో అవినీతి అటూ ఆరోపణ చేసిన లక్ష్మీనారాయణ అందుకు తగిన ఆధారాలు చూపాలన్నారు. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాల్‌ చేశారు. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో రూ.500 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సీబీఐకి లేఖ రాయడంపై మండిపడ్డారు. పూటకో పార్టీ మారే కన్నా లక్ష్మీనారాయణకు బట్ట కాల్చి మొహాన వేయడం మొదటి నుంచి అలవాటే అని అన్నారు. తమ బ్యాంకు పరిధిలో నకిలీ పాస్‌ పుస్తకాలతో రూ.13 కోట్ల సొమ్ము స్వాహా జరిగిన మాట నిజమేననీ, టిడిపి హయాంలోనే కాక తమ హయాంలో జరిగిన వాటిపైనా విచారణకు సిద్ధమనీ చెప్పారు. తమ బ్యాంకులో జరిగిన అవినీతి గుట్టును తామే స్వయంగా వెలికి తీసి అందుకు బాధ్యులైన వారిపై నిజాయితీగా చర్యలు చేపట్టిన ప్రభుత్వం మాది అని అన్నారు.