Jun 20,2023 19:31

రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తున్న బాలిక కుటుంబ సభ్యులు

ప్రజాశక్తి - గోనెగండ్ల
ఓ మహిళ బాలికను నమ్మించి బహిర్భూమికని తీసుకెళ్లి తన భర్తకు అప్పగించి అత్యాచారయత్నానికి పాల్పడేలా చేసిన సంఘటన సోమవారం రాత్రి గోనెగండ్ల మండలం గంజిహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. నిందితులైన భార్యాభర్తలు తెలుగు చిన్న బడే సాహెబ్‌ అలియాస్‌ కొప్పోడు, బోడెమ్మ అలియాస్‌ బడెమ్మను అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు గోనెగండ్ల ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధిత బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంగళవారం ఎమ్మిగనూరు, కర్నూలు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. గంజిహల్లి గ్రామానికి చెందిన తెలుగు చిన్న బడేసాబ్‌, అతని భార్య బడెమ్మ ఎస్వీ.నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరు హైదరాబాద్‌కు వలస వెళ్లి రెండు, మూడు రోజుల క్రితమే గ్రామానికి వచ్చారు. సోమవారం రాత్రి భార్యను తీసుకొని అదే గ్రామంలోని తమ దాయాదుల ఇంటికి చిన్నబడేసాబ్‌ వెళ్లాడు. రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో బడెమ్మ తమ పక్కింటి వారితో మాట్లాడుతూ... తాను బహిర్భూమికి వెళ్లాలని, తోడుగా మీ కూతురును పంపమని అడిగారు. బాలికను తీసుకొని సమీపంలోని పొలంలోకి వెళ్లారు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె భర్త చిన్న బడేసాబ్‌కు బాధిత బాలికను అప్పగించి బడెమ్మ వెళ్లిపోయారు. అతడు బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించడంతో బాలిక కేకలు వేసింది. బాలిక అరుపులు విన్న చుట్టుపక్కన ఇళ్ల వారు కేకలు వేస్తూ బాలిక వద్దకు వెళ్లడంతో అది గమనించిన నిందితుడు బాలికను వదిలి పరారయ్యాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులైన భార్యాభర్తలు ఇద్దరినీ అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.