Oct 27,2023 16:54

విశాఖపట్నం : భగవంత్ కేసరి సినిమా యూనిట్ శుక్రవారం విశాఖ లో సందడి చేసింది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్, శ్రీ లీల హీరోయిన్ల గా నటించిన భగవంత్ కేసరి మూవీ షేర్ కా టూర్ లో భాగంగా విశాఖ సూర్యా బాగ్ లో గల మెలోడీ థియేటర్లో ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపేందుకు విశాఖ వచ్చారు. అనంతరం శ్రీ మెలోడీ థియేటర్లో మీడియా సమావేశం జరిగింది. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, పెద్ద హిట్ చేసినందుకు ధన్యవాదములు చెప్పారు. ఇది తనకు ఏడో సినిమా అని తెలిపారు. తన రెగ్యులర్ జోనర్ దాటి బాలయ్యతో తీసిన ఈ సినిమాకి పెద్ద పేరు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కథ విన్న వెంటనే ఇద్దరు అమ్మాయిలు తండ్రి అయిన బాలకృష్ణ ఓకే చేశారన్నారు. కొద్ది రోజులలోనే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇది బాలయ్యకు 108వ చిత్రం, ఇందులో బాలయ్య జీవించారని కొనియాడారు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు బాగా వచ్చాయి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తీసిన సన్నివేశాలు పోలీసులు, ఉపాధ్యాయులు తదితరులు బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ సబ్జెక్ట్ ఆడ పిల్లలు తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అయ్యింది అన్నారు. హీరోయిన్ శ్రీ లీలకు మంచి సూపర్ హిట్ పడింది అన్నారు. తనకు విశాఖతో ఎంతో మంచి అనుబంధం వుంది, విశాఖలోనే అన్ని సినిమా కథలు రాసుకుంటానని గుర్తు చేశారు. హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ తాను పెళ్లి సందడి తరువాత విజయ యాత్రలు టూర్ లో భాగంగా విశాఖ వచ్చాము అన్నారు. ఇది కంటెంట్ ఓరియంట్ సినిమా అన్నారు. ఇంకా చాలా మంది ఈ సినిమా చూడాలి, కుటుంబ సమేతంగా చూసే సినిమా అన్నారు. వరుసగా మూడు సినిమాలు హిట్ కావడం చాలా ఆనందంగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిర్మాత సాహు గరపాటి మాట్లాడుతూ ఈ సినిమాతో ప్రేక్షకుల నమ్మకం నిలబెట్టుకుంది అన్నారు. నటుడు సత్య సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు కూడా పురుషులతో సమానం అన్నారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ధీర వనిత సునీత కృష్ణన్ ప్రజ్వల సంస్థ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఆమె సామూహిక లైంగిక దాడికి గురయిన కుంగిపోలేదన్నారు. శ్రీ లీల పాత్ర మహిళలకు స్ఫూర్తిదాయకం అన్నారు. తాను సినీ పరిశ్రమలో స్థిర పడేందుకు సహకరించిన దర్శకుడు అనిల్ కు ధన్యవాదాలు తెలిపారు. నటుడు మురళీ మాట్లాడుతూ ఈ సినిమాకు ప్రేక్షకులు అఖండ విజయం చేకూర్చారు. ఇందులో మంచి పాత్ర చేశాను అన్నారు. తనకు కూడా ఇది ఏడో సినిమా అన్నారు. నటుడు జీవన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో  పోలీసు అధికారి పాత్ర ద్వారా మంచి గుర్తింపు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో నిర్మాత  హరీష్ పెద్ది, శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్ ప్రతినిధి శ్రీనివాస్, మెలోడి థియేటర్ ప్రతినిధులు రమణ, గౌరీ శంకర్ , బాల కృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షుడు కాళ్ల శంకర్, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం చిత్ర యూనిట్ సభ్యులు మార్నింగ్ షో కి వచ్చిన ప్రేక్షకులతో ముచ్చటించి సినిమా సూపర్ హిట్ చేసినందుకు ధన్యవాదములు చెప్పారు.