ప్రజాశక్తి - భీమడోలు
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న తనకు అండగా నిలవాలని, ఈ నేపథ్యంలో విమర్శలను స్వీకరిస్తానని ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు తెలిపారు. ఏలూరు కాలువపై గుండుగొలను వద్ద రూ.46.70 లక్షల వ్యయంతో నిర్మించిన బెయిలీ వంతెనను ఆయన జిల్లా కలెక్టర్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు గ్రామ ఉపసర్పంచి ముందుండి సూర్యనారాయణరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ బెయిలీ వంతెన ప్రారంభోత్సవం చేసిన సమయంలోనే గతంలో శిథిలమైన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మాణానికి రూ.3.35 కోట్లు మంజూరు కావటం అభినందనీయమన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రిగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన వంతెన మీదుగా గరిష్టంగా పది టన్నుల వరకు సామర్థ్యం ఉన్న వాహనాలు మాత్రమే వెళ్లాల్సి ఉందన్నారు. వంతెన మీదుగా రాకపోకలు క్రమబద్ధీకరించినందుకు ఆర్‌అండ్‌బి శాఖ సహకారంతో రెండు నెలలపాటు కాపలా ఏర్పాట్లు చేయనున్నామన్నారు. ఈ మేరకు నియమితులైన సిబ్బంది ప్రయాణికులకు సహకరించడం ఎక్కువ బరువు గల వాహనాలు వెళ్లకుండా అడ్డగిస్తారని తెలిపారు. నిర్మాణం సమయంలో గ్రామస్తులు అందించిన సహాయ సహకారాలు అభినందనీయమన్నారు. ఆగడాల లంక వద్ద గోదావరి జలాలను తాగునీటిగా అందించేందుకు సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో తాగునీటి రిజర్వాయర్ నిర్మించేందుకు కలెక్టర్ రూ.20 కోట్లు మంజూరు చేశారన్నారు. ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో రవాణా వ్యవస్థకు నూతనంగా పరిచయమైన జర్మన్ టెక్నాలజీతో రోడ్డు నిర్మాణం చేపట్టే కార్యక్రమాన్ని భీమడోలు మండలంలో ప్రారంభించామన్నారు. రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ అప్పారావు మాట్లాడుతూ 30 మీటర్ల పొడవు ఆరు మీటర్ల వెడల్పు 71 టన్నుల బరువు గల బెయిలీ వంతెన జీవితకాలం రెండు సంవత్సరాల వరకు ఉంటుందన్నారు. ఈలోగా నూతన వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు జాతీయ రహదారుల శాఖకు తమ శాఖ తరపున సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.










