Nov 02,2023 22:34

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి ఐసిసి వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ జోరు జిల్లాలో జోరుగా నడుస్తోంది. గత నెల ఐదో తేదీ నుంచి ప్రపంచ వన్డే కప్‌ ప్రారంభమైన విషయం విధితమే. ఈ ఏడాది ఇండియాలోనే జరగటంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఇండియా - శ్రీలంక దేశాల మధ్య గురువారం మ్యాచ్‌ జరిగిన విషయం విధితమే. ఈ మ్యాచ్‌ నేపథ్యంలో పెద్ద మొత్తంలో బెట్టింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. సెమీ ఫైనల్‌కు వెళ్లేందుకు ఈ మ్యాచ్‌ కీలకం కావటంతో ఉదయం నుంచే హడావుడి మొదలైంది. ఈ ఐసిసి వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో బెట్టింగ్‌ జిల్లాలో బుకీలు పుట్టగొడుగులులా తిష్టవేసినట్లు తెలుస్తోంది. వారంతా ఈజీ మనీ వేటలో ముఖ్యంగా యువత ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ మ్యాచ్‌ల నేపథ్యంలో టాస్‌ మొదలుకుని బంతి బంతికి.. వికెట్‌ నుంచి ప్రతి మ్యాచ్‌కు బెట్టింగ్‌లకు ప్రోత్సాహిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ బెట్టింగ్‌లకు ఉపయోగించుకుంటున్నారు. మొత్తం ఈ వ్యవహారంలో ఈ బెట్టింగ్‌ బ్రోకర్‌లుగా అవతారమెత్తిన వారంతా లాభ పడుతుండగా, బెట్టింగ్‌లు కాసిన వారి జేబులకు చిల్లు పడక తప్పడం లేదు.
పుట్టగొడుగులులా బుకీలు
ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బుకీలు పుట్టగొడుగుల్లా పుట్టికొస్తున్నాయి. గతంలో ఉన్న పరిచయాల ద్వారా యువతను బెట్టింగ్‌లకు ప్రోత్సహిస్తున్నారు. తొలుత అడ్వాన్స్‌ అమౌంట్‌ తీసుకున్న అనంతరం సీక్రెట్‌ నంబరు కేటాయించి కొన్ని షరతులను విధిస్తున్నారు. దాంతో బెట్టింగ్‌ కాసే వ్యక్తి టీవీ చూస్తూనే బెట్టింగ్‌ కాస్తాడు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాల వద్ద, గ్రామానికి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో బెట్టింగ్‌లకు తెరలేపినట్లు సమాచారం. తాజా మ్యాచ్‌ల నేపథ్యంలో ప్రత్యేక యాప్‌లు సైతం అందుబాటులో ఉండటంతో వాటిని వినియోగిస్తున్నారు. తొలుత భారత్‌ తలపడుతున్న మ్యాచ్‌ల్లో జయపజయాలపై సరదాగా మొదలైన చిన్నపాటి పందేలు ఇప్పుడు వరల్డ్‌ కప్‌ పుణ్యమాని విషవృక్షంలా విస్తరించాయి. ప్రపంచంలో ఏ మూల క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్నా బెట్టింగ్‌ పరిపాటిలా మారింది. యువతను ఆకర్షించే యాప్‌లు స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. నగదు లావాదేవీల కోసం ఫోన్‌పే, గూగుల్‌పే వంటివి వినియోగిస్తున్నారు. విద్యార్ధులకు సంపాదన లేకపోయినా అప్పుచేసి బెట్టింగ్‌ వేస్తున్నారు.
అప్పుల పాలవుతున్న యువత
ప్రధాన పట్టణాల్లోని బెట్టింగ్‌ నిర్వాహకులు హైదరాబాద్‌, ముంబరుల నుంచి లింకులు ఏర్పాటు చేసుకుంటే, గ్రామీణ స్థాయి, ద్వితీయ శ్రేణి పట్టణాల వారంతా ప్రధాన పట్టణాల్లోని నిర్వాహకులతో లింక్‌ ఏర్పాటు చేసుకుని బెట్టింగ్‌లు నిర్వహించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రతి మ్యాచ్‌ ప్రారంభానికి ముందే నాలుగు గంటల ముందు బుకీలు నగదు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం బంతి, బంతికి బెట్టింగ్‌, ఫలానా జట్టు గెలుస్తుందని కొందరు బెట్టింగ్‌కు పాల్పడితే, గెలిచిన జట్టు తరఫున బెట్టింగ్‌ కాసిన వ్యక్తికి రెండింతలు ఇచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. కొందరు టాస్‌ అనంతరం బ్యాటింగ్‌ ఎవరు తీసుకుంటారు, ఫీల్డింగ్‌ ఎవరు ఎంచుకుంటారు, ఓపెనర్‌లుగా ఎవరు వస్తారు, మొదటి ఓవర్‌లోనే వికెట్‌ పడుతుందా..? లేదా సిక్సర్‌ కొడతారా..?, మొదటగా బ్యాటింగ్‌ చేసిన జట్టు గరిష్టంగా ఇంత స్కోర్‌ చేస్తుంది వంటి వాటిపై బెట్టింగ్‌లకు పాల్పడ్డట్లు తెలిసింది. అదేవిధంగా ఆట సందర్భాన్ని బట్టి వెయ్యికి 5 నుంచి 10 రెట్ల వరకు బెట్టింగ్‌లకు ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బాధిత యువత అప్పుల పాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.