బెట్టింగ్ జోరు
- ఐపిఎల్‌తో మొదలైన పందేల పర్వం
- ఆర్థికంగా నష్టపోతున్న యువత
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
'నా కొడుకు ఇంటర్ వరకూ బుద్ధిగా ఉండేవాడు. ఆ తర్వాత ఇంట్లో మెల్లగా డబ్బు తీసుకెళ్లడం ప్రారంభించాడు. బయట కూడా దాదాపు రూ.లక్ష వరకూ అప్పు చేశాడు. మేం ఆర్థికంగా క్షీణించి వీధిన పడాల్సి వచ్చింది. చివరికి తెలిసింది క్రికెట్ బెట్టింగ్‌లో మొత్తం పోగొట్టుకున్నాడని' ఇదీ ఓ తల్లి ఆవేదన. ఆ తల్లి మాత్రమే కాదు. క్రికెట్ బెట్టింగ్‌కు బానిసలై అప్పుల పాలవుతున్న యువకుల తల్లిదండ్రులందరి ఆవేదనా ఇదే....
ఐపిఎల్ సీజన్ వచ్చిందంటే యువతలో జోరు అంతా.. ఇంతా కాదు. ఆ జోరును బెట్టింగ్ బుకీలు క్యాష్ చేసుకుంటున్నారు. మ్యాచ్‌లో సాగే బంతిబంతికీ పందేలు కాస్తున్నారు. ప్రస్తుతం ఐపిఎల్ ప్రారంభం రోజున కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మొదలైన క్రికెట్ బెట్టింగ్ ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ ఊపందుకుంది. తొలుత క్రికెట్ అంటే మానసికోల్లాసం కోసం, క్రీడా స్ఫూర్తి కోసమే ఆడేవారు. నేడు అది జూద క్రీడగానూ మారిపోయింది. గతంలో పట్టణాలకే పరిమితమైన 'బెట్టింగ్ ఫీవర్' నేడు మండల కేంద్రాలతో పాటు మారుమూల గ్రామాలకూ విస్తరించింది. వ్యవహారమంతా సెల్‌ఫోన్లలోనూ, ఆన్‌లైన్లలోనే సాగుతోంది. ప్రత్యేకంగా సెల్‌ఫోన్లు కొనుగోలు చేసుకుని తమ పేర్లతో లేని సిమ్ కార్డులను యువత బెట్టింగ్ కోసం వినియోగిస్తున్నారు. రూ.100 కాస్తే రూ.150, రూ.200 ఇస్తామంటూ బుకీలు ఆశ చూపి యువతను బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. దాంతో యువత బెట్టింగ్‌లో బిజీబిజీ అయిపోయారు. మ్యాచ్ మొదలవడానికి రెండు, మూడు గంటల ముందే వాట్సప్, మెసేజ్, ఫోన్ కాల్స్, ఇంటర్నెట్‌లో యువత బెట్టింగ్‌ను హోరెత్తిస్తున్నారు. చివరికి సర్వం కోల్పోయి వీధిన పడుతున్నారు. మ్యాచ్ ముగిశాక నగదు పంపిణీలో తేడాలు వస్తుండడంతో విద్యార్థుల్లోనూ, యువతలోనూ గొడవలు తలెత్తి పోలీసు స్టేషన్లలో పంచాయితీల వరకూ వెళ్తుండడం గమనార్హం. బెట్టింగ్ ద్వారా రాష్ట్రంలో రోజుకు రూ.కోట్లు చేతులు మారుతోంది. సాయంత్రమైతే చాలు గ్రామాల్లో ఇదే చర్చ జరుగుతోంది. 'ఈ రోజు ఏ జట్ల మధ్య మ్యాచ్ ఉంది. ఎవరెవరు ఆడుతున్నారు. ఏ జట్టుపై పందెం కాయాలి. ఎంత కాస్తే మనకెంత వస్తుంది' అంటూ యువత ఫోన్లలో సంభాషణలు సాగిస్తున్నారు. పాఠశాల విద్యార్థుల మొదలు వృద్ధుల వరకూ అందరూ ఈ బెట్టింగ్ వ్యవహారంలో పాలుపంచుకుంటున్నారు. మ్యాచ్ ఎవరు గెలుస్తారనే పందెంతో పాటు టాస్ ఎవరు గెలుస్తారన్నదీ నేడు పందెంగా మారిపోయింది. ఈ బంతికి ఎంత స్కోర్ కొడతారనే పందెమూ నేడు అధికంగా సాగుతోంది. తెలియని అమాయక యువత అదృష్టం ఉంటే రూ.లక్షలు సంపాదించుకోవచ్చనే క్షణికావేశంతో బెట్టింగ్ వేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రధాన ప్రాంతాల్లో ఉండే బెట్టింగ్ బుకీలు ఆయా ప్రాంతాల వారీగా మధ్యవర్తులను నియమించుకుని వారి ద్వారా బెట్టింగ్ తతంగాన్ని నడిపిస్తున్నారు. స్ట్రైట్, రైసింగ్, 30, 50, ఎస్, ఓకే, డన్ వంటి కోడ్‌లను ఉపయోగిస్తూనే ఈ బెట్టింగ్ అంతా సాగుతోంది. కర్నూలు, ఆదోని, నంద్యాల పట్టణాల్లో లాడ్జీలలో ఈ బెట్టింగ్ తంతు సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ల మైదానాల్లో సాయంత్రం పూట యువత చేరి బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పోలీసులు బెట్టింగ్‌కు పాల్పడుతున్న యువతకు కౌన్సెలింగ్ ఇవ్వడం కూడా ఎక్కడా కనిపించడం లేదు. బెట్టింగ్ ద్వారా ఓ వైపు బుకీలు రూ.లక్షలు, రూ.కోట్లలో సంపాదిస్తుంటే యువత మాత్రం అప్పు చేసి మరీ బెట్టింగ్ కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.
cartoon










