Mar 14,2021 06:49

ప్రస్తుతం ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల్లోనూ అత్యంత క్లిష్టమైన రాష్ట్రం, అందరూ అమితాసక్తిగా ఎదురు చూస్తున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌. అక్కడ గెలిచిపోయినట్టే బిజెపి నాయకత్వం చేస్తున్న హడావుడి ఒకవైపు, వారిని ఎదుర్కొనే పేరిట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆడుతున్న రాజకీయ క్రీడ మరోవైపు, ముందస్తు అవగాహనతో లెఫ్ట్‌, కాంగ్రెస్‌ ఐఎస్‌ఎఫ్‌ల సంయుక్త వేదిక మూడో వైపు... ఇదీ బెంగాల్‌ ఎన్నికల దృశ్యం. తమాషా ఏమంటే మన మీడియాలో ఇది కేవలం ద్విముఖ పోరాటంగానే చిత్రించబడుతూ వున్నది. గత నెలాఖరు నాడు కోల్‌కతా బ్రిగేడ్‌ పెరేడ్‌ మైదానంలో పది లక్షల మందితో బ్రహ్మాండమైన సమీకరణ జరిపి సత్తా చూపిన తర్వాత కూడా ఈ పరిస్థితిలో మార్పు రాలేదంటే కావాలనే మూడవ కూటమిని విస్మరిస్తున్నారని అర్థమవుతుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజెపి లు బలమైన అధికార పార్టీలుగా ప్రచారార్భాటం చేయడమే గాక పరస్పరం తిట్టిపోసుకోవడం, చవకబారు సంచలన పోకడలకు పాల్పడ్డం ద్వారా ఇరువురికీ తేడా లేదని నిరూపించుకుంటూ సామూహిక ఫిరాయింపులతో జుగుప్సాకర ప్రచార యుద్ధం సాగిస్తున్నాయి. టిఎంసి నుంచి ఫిరాయించిన వారితోనే బిజెపి జాబితా నిండిపోయింది. మమతా బెనర్జీ నందిగ్రామ్‌ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో నిన్నటి దాకా ఆమె కుడి భుజంగా పని చేసిన సువేందు అధికారిని బిజెపి పోటీ పెట్టడం చూస్తుంటే సిద్ధాంత ప్రధానమైన బెంగాల్‌ రాజకీయాలను ఎంత క్షుద్ర స్థాయికి దిగజార్చారో తెలుస్తుంది. అయితే అందులోనూ సైద్ధాంతిక అంశం లేకపోలేదు. సింగూరులో నానో కార్ల ఫ్యాక్టరీని అడ్డుకోవడం తర్వాత నందిగ్రామ్‌లో సెజ్‌ను జాతీయ వివాదంగా మార్చడంలో వామపక్ష వ్యతిరేక శక్తులన్నీ ఒకటయ్యాయి. అప్పట్లో కాల్పులు, మరణాలు, ఆ ప్రభుత్వ తప్పిదాలు కూడా కొన్ని తోడై పరిణామాలు మారిపోయాయి. దేశంలో ప్రతిచోటా సెజ్‌లు, ప్రైవేటీకరణలు మహా జోరుగా సాగించే బిజెపి, తృణమూల్‌ (అప్పట్లో కాంగ్రెస్‌ కూడా), వాటిపై పోరాడే వామపక్ష శక్తులపై దాడికి దాన్ని ఉపయోగించుకోవడం ఆసక్తికరమైన విషయం. ఇప్పుడు మమత నందిగ్రామ్‌ నుంచే పోటీ చేయడమంటే మళ్లీ వామపక్ష వ్యతిరేక భావాలను రగుల్కొల్పడానికి తప్ప బిజెపి మతతత్వం ప్రతీక ఏముంటుంది? సువేందు అధికారి 'జై శ్రీరాం' అంటూ నామినేషన్‌ వేశారు. అంటే వారి ఉమ్మడి శత్రువు ఇప్పటికీ సిపిఎం, వామపక్షాలే అనడానికి ఈ ఉదాహరణ చాలు. కొంతమందికి ఈ లాలూచీ కుస్తీ, బూటకపు బాక్సింగ్‌ అర్థం కాకపోవడమే విచారకరం. వాటిని పరిశీలించే ముందు బెంగాల్‌ ఎన్నికల రంగాన్ని ఒకసారి తేరిపారచూడాలి.
మమత మార్కు రాజకీయ మాయ
ముప్పై రేండేళ్ల పాటు అప్రతిహతంగా ప్రజా రంజకంగా పాలించిన వామపక్ష ఫ్రంట్‌ (ప్రజారంజకం కాని ఏ ప్రభుత్వం అంతకాలం కొనసాగదని చెప్పక్కర్లేదు) స్థానంలో 2011లో మొదటిసారి మమతా బెనర్జీ విజయం సాధించారు. స్వతహాగా కాంగ్రెస్‌ వాది అయిన మమత 1997లో టిఎంసిని స్థాపించి దానికి ముందు ఎన్‌డిఎ లోనూ బిజెపితో కలసి పని చేశారు. బెంగాల్‌లో ఆ పార్టీకి చోటు కల్పించడానికి కారకులైనారు. 2009లో యుపిఎ లో చేరి 2011లో ఆమె కాంగ్రెస్‌తో కలసి పోటీ చేశారు. వామపక్ష పాలనను ఎదుర్కోవడంలో పదే పదే విఫలమైన కాంగ్రెస్‌, ఎలాగైనా అక్కడ పాగా వేయాలని పొంచికూచున్న బిజెపి రెండూ అఘాయిత్య రాజకీయాలకు మారుపేరైన మమతా బెనర్జీని శిఖండిలా ఉపయోగించుకున్నాయి. ఈ క్రమంలో ఆమె ప్రాంతీయ విభేదాలనూ అవసరాన్ని బట్టి హిందూ ముస్లిం మతతత్వాలనూ వాడుకున్నారు. వీధి గూండాయిజం తరహాలో విశృంఖల రాజకీయాలు సాగిస్తూ అధికారపీఠం ఎక్కారు. ఆఖరుకు మావోయిస్టులు కూడా ఈ ఘనకార్యంలో అప్పట్లో ఆమెతో చేతులు కలిపారు. తర్వాత ఆ కిషన్‌జీనే ఆమె ప్రభుత్వం హతమార్చింది..
రాష్ట్రంలో భయానక పాలన
టిఎంసి అధికారం లోకి వచ్చాక 220 మంది సిపిఎం కార్యకర్తలు హత్య చేయబడ్డారు. లక్ష తప్పుడు కేసులు మోపబడ్డాయి. వేల కుటుంబాలను ఇళ్లలోంచి తరిమివేశారు. ఇదంతా మమత మార్కు ఆటవిక పాలన. ఈ క్రమంలోనే ప్రజలలో అసంతృప్తి పెరిగింది. అది ఓటింగులోనూ సీట్లలోనూ కూడా వ్యక్తమైంది. కాంగ్రెస్‌ కూడా ప్రభుత్వం నుంచి, కూటమి నుంచి వైదొలగింది. 2014 ఎన్నికల నాటికి మమతా బెనర్జీ ప్రధాని మోడీకి అనుకూలంగానే వున్నారు. కాంగ్రెస్‌ 2016 ఎన్నికల్లోనే వామపక్షాలతో పరిమితమైన అవగాహనతో పోటీ చేసింది. అప్పుడు ఈ రెండు పార్టీలకు దాదాపు 47 శాతం ఓట్లు వచ్చాయంటే ప్రజల్లో అసంతృప్తి ఏ స్థాయిలో వుందో తెలుస్తుంది. తదుపరి పరిణామాలలో కాంగ్రెస్‌ బలహీనమై పోవడంతో 2019 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి 18 స్థానాలు తెచ్చుకోగలిగింది. వామపక్షాల ఓట్లు ఏడు శాతానికి పడిపోవడమే గాక ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి. టిఎంసి పాలనపై ప్రజల్లో ఆగ్రహం ఒకవైపు, దేశవ్యాపితంగా మోడీ అనుకూలత మరోవైపు ఇందుకు దారి తీశాయి. దాన్ని అవకాశంగా తీసుకుని బిజెపి బెంగాల్‌లో చొరబడటానికి ప్రయత్నాలు తీవ్రం చేసింది. స్వయంగా అమిత్‌షా అందుకు బాధ్యత తీసుకున్నారు. మోడీ కూడా రవీంద్రనాథ్‌ టాగూర్‌లా వేషం కట్టి మరీ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండవసారి విజయం తర్వాత మోడీ ప్రభుత్వ పోకడలు ప్రజల్లో వ్యతిరేకత పెంచడం, పలు చోట్ల ఎదురుదెబ్బలు తినడం వంటి నేపథ్యంలో ఇప్పుడు అయిదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చాయి.
ఉభయత్రా ఉపద్రవం
బీహార్‌లో మహాఘట్‌బంధన్‌ ఎన్‌డిఎను బలంగా సవాలు చేసిన రీతిలోనే బెంగాల్‌లోనూ దానికి వ్యతిరేకంగా టిఎంసితో సహా కూటమి కట్టాలనే వైఖరిని...అక్కడ ఒక ప్రధాన వామపక్షశక్తిగా వున్న సిపిఐఎంఎల్‌ తీసుకుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఈ చర్చ వస్తే సిపిఎం, సిపిఐ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చాయి. అయితే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య 'హిందూ' పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలోనూ బిజెపిని ఓడించడం గురించి నొక్కి చెబుతున్నారే తప్ప టిఎంసిని కూడా ఓడించడం కీలకమని ఒప్పుకోలేదు, పైగా సిపిఎంకే సంకుచితత్వం అంటగట్టారు. దీనిపై దీపాంకర్‌ వైఖరి ఎంత తప్పుగా వుందో 'పీపుల్స్‌ డెమోక్రసీ' ఒక వ్యాఖ్య ప్రచురించింది. ఇంకో వైపున మీడియా బిజెపి వచ్చేసినట్టే మోత మోగిస్తూ మూడో శక్తిని పూర్తిగా కప్పిపుచ్చుతున్నది. చాలా సర్వేలు ఆమె తిరిగి గెలుస్తారని చెబుతున్నాయి. బెంగాల్‌ ఎన్నికల సంక్లిష్టత ఇక్కడే ఉత్పన్నమవుతుంది. రాష్ట్రంలో మమతా బెనర్జీ అమానుష పాలనను ప్రతిపక్షాలు వ్యతిరేకించకపోతే ఆ వ్యతిరేకతను బిజెపి సొమ్ము చేసుకోగలుగుతుందనేది ఎవరికైనా అర్థమయ్యే విషయం. ఈ పరిస్థితులలోనే రాష్ట్రంలో టిఎంసి, కేంద్రంలో బిజెపిల అప్రజాస్వామిక పాలనను ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌తో అవగాహన అవసరమని సిపిఎం భావించింది. ఆ మేరకు వామపక్షాలు ముందుగానే ఒప్పందానికి వచ్చాయి. పైగా బిజెపి పట్ల మమత వ్యతిరేకత నికరమైందేమీ కాదు. రేపు గనక ఎవరికీ మెజార్టీ రాకపోతే అధికారం కోసం ఆమె బిజెపితో చేతులు కలుపుతుందని సీతారాం ఏచూరి చాలా ముందుగానే చెప్పారు. బ్రిగేడ్‌ మైదానం సభలోనూ ప్రకటించారు. ఈ సభలో అదనంగా అబూ సిద్దిక్‌ నాయకత్వం లోని ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎప్‌) కూడా కలిసింది. ఇది ముస్లిం మతాధిపతి స్థాపించిన పార్టీ అయినా మతం ప్రాతిపదిక గాక లౌకిక కూటమిగా పేరు పెట్టుకోవడం ఇక్కడ గమనించదగింది. బెంగాల్‌లో దాదాపు 27 శాతం ముస్లింలున్నారు. మమత ప్రచారానికి లోనై వీరిలో చాలా మంది వామపక్షాలపై దురభిప్రాయం పెంచుకున్నారు. ఇలాంటి తరుణంలో ఐఎస్‌ఎఫ్‌ పాత్ర ఉపయోగకరంగా వుంటుందనే భావం పరిశీలకులలో వ్యక్తమైంది. కేరళలో నేరుగా ముస్లిం లీగ్‌తో శాశ్వత మైత్రి సాగిస్తున్న కాంగ్రెస్‌ నేతలు కొందరు దీనిపై రభస చేయడం నిజంగా విచిత్రమే. వాస్తవం ఏమంటే కాంగ్రెస్‌లోనూ కొందరికి బిజెపిపై పోరాటం పట్ల తీవ్రత లేదు. కేరళలో అనేక వికృత విన్యాసాలను ప్రోత్సహిస్తున్న రాహుల్‌గాంధీ బెంగాల్‌పై శ్రద్ధ చూపకపోవడం యాదృచ్ఛికం కాదు. లోక్‌సభలో ఆ పార్టీ నాయకుడైన అధీర్‌ రంజన్‌ చౌదరి బెంగాల్‌ పిసిసి అధ్యక్షుడుగా వామపక్షాలతో అవగాహనను ముందుకు తీసుకుపోతున్నారు. ఏతావాతా బెంగాల్‌ ఎన్నికలు ఈ మూడు శక్తుల మధ్య త్రిముఖ పోటీగా జరుగుతాయనేది కాదనలేని వాస్తవం. రాష్ట్ర వ్యాపితంగా విస్తరించి వున్న సిపిఎం, వామపక్షాలు ఎంత బలహీనపడిపోయాయని చెప్పేవారైనా వాటి ప్రభావాన్ని తోసిపుచ్చడం అసంబద్ధమే. టిఎంసి నుంచి ఫిరాయించిన చాలామందికి బిజెపి అవకాశమిచ్చినట్టే... వామపక్షాల నుంచి ఫిరాయించిన కొందరు అవకాశవాదులకు టిఎంసి టికెట్లిచ్చి నిలబెట్టింది. కాని మౌలికంగా తమ స్థానాలలో వారు గట్టి పోటీ ఇవ్వడం తప్పక జరుగుతుంది. జెఎన్‌యు పోరాటంలో ముందు నిలిచిన యూనియన్‌ అధ్యక్షురాలు ఐషీ ఘోష్‌తో సహా చాలా స్థానాల్లో సిపిఎం యువతను నిలబెట్టడం ఈ ఎన్నికలలో మరో విశేషం. ఇతరత్రానూ అభ్యర్థులలో 30-40 ఏళ్ల వారు చాలా మంది వున్నారు. మమతపై పోరాటంలో యువత గట్టి పాత్ర పోషించింది గనకనే వారిని ముందు నిలిపినట్టు బిమన్‌ బసు, సూర్యకాంత్‌ మిశ్రా తెలిపారు.
సుదీర్ఘ షెడ్యూలు మతలబు?
బెంగాల్‌లో టిఎంసి బిజెపి ల పోటా పోటీ నాటకాలు, ఘాతుకాలు పరిస్థితిని దారుణంగా మార్చేశాయి, నేతాజీ జయంతి కూడా నేతల కుమ్ములాటల వేదిక అవుతున్నది. ముఖ్యమంత్రి పైనే దాడి జరిగిందనే దుమారం మరోవైపు నడుస్తున్నది. తర్వాత దాడి కాదు తొక్కిసలాట అని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ కూడా సర్దుకున్నాయి. కేంద్రంలో బిజెపి తమ నాయక గణాన్ని ఇష్టానుసారం దింపేందుకు వీలుగా ఎన్నికల సంఘం ఎక్కడా ఎప్పుడూ లేనట్టు 32 రోజుల పాటు...ఎనిమిది దఫాలుగా ఎన్నికల ప్రక్రియ నిర్ణయించడంపై టిఎంసి వామపక్షాలు కూడా విమర్శించాయి. టిఎంసి నాయకులపై అవినీతి ఆరోపణలను ఇంతకాలం పక్కనపెట్టిన కేంద్ర ఏజెన్సీలు ఇప్పుడు దాడులు చేస్తున్నాయి. ఇది కూడా బెంగాల్‌కే ప్రత్యేకం. మే 2న మేము మళ్లీ గెలిచేస్తామని టిఎంసి చెబుతుంటే మేమే గెలుస్తామని బిజెపి ఊదరగొడుతున్నది. బెంగాల్‌లో బిజెపి గెలవకపోతే బీహార్‌లో ఎన్‌డిఎ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందని కూడా అంచనా వేస్తున్నారు. మరో విధంగా జరిగి కేరళలో సిపిఎం, ఎల్‌డిఎఫ్‌ మళ్లీ గెలిచి బెంగాల్‌లో కొంత పుంజుకోగలిగితే అప్పుడు దేశ రాజకీయాలే కొత్త మలుపు తిరిగే అవకాశముంటుంది. ఏది ఏమైనా ఇది అత్యంత క్లిష్టమైన పోరాటమనడంలో సందేహం లేదు. చైతన్యవంతులైన బెంగాలీ ఓటర్లే సముచితమైన ముగింపునిస్తారని ఆశించవచ్చు.

                                                       బెంగాల్‌ త్రిముఖ పోరాటంలో కీలక సవాళ్లు            - తెలకపల్లి రవి