Feb 07,2023 23:44

ఆర్‌ఎఆర్‌ఎస్‌ బెల్లం పొడి తయారీ యూనిట్‌ను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

ప్రజాశక్తి-అనకాపల్లి
బెల్లం, దాని ఉప ఉత్పత్తుల తయారీతో రైతుకు ఎంతో లాభం చేగోడుతుందని మహాత్మ పూలే కృషి విద్య పీఠ్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ విద్యాసాగర్‌, డాక్టర్‌ బాపూరావు గైక్వాడ్‌, డాక్టర్‌ గోవింద, ఐఐటి బొంబే శాస్త్రవేత్తలు డాక్టర్‌ ప్రబోద్‌ గల్లి కం, డాక్టర్‌ విశ్వంభర్‌ అన్నారు. స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పోస్ట్‌ హార్వెస్టింగ్‌ బెల్లం ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను మంగళవారం వారు సందర్శించారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌లో చెరకు వంగడాలను పరిశీలించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌ సూపర్‌ కెన్‌ హార్వెస్టర్‌ మిషన్‌ సహాయంతో రోజుకు 25 నుంచి 30 టన్నుల చెరకు క్రషింగ్‌ ద్వారా బెల్లం ఉత్పత్తులు తయారు అవుతున్నాయని తెలిపారు. ఈ మిషన్‌ సహాయం వల్ల ఎకరాకు రైతుకు రూ.20వేలు ఆదా అవుతుందన్నారు. ఈ యంత్రాన్ని రాజీవ్‌ గాంధీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రెండు కోట్ల 16 లక్షల రూపాయలతో రూపొందించిందన్నారు. మహారాష్ట్రలో చెరుకు ఉత్పత్తి ఎకరాకు 50 టన్నుల వరకు పండుతుందన్నారు. ఈ ప్లాంట్‌ను ఇంప్రూవ్‌ చేసేందుకు ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఉన్న యాంత్రీకరణ, అనుభవాలు, టెక్నాలజీను పరిశీలించేందుకు సందర్శించామని చెప్పారు. బెల్లంలో పౌడర్‌, లిక్విడ్‌, చిన్న చిన్న ముక్కల తయారీ వల్ల వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందన్నారు. బెల్లం ఉత్పత్తిపై ఒక పాఠశాల కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. రైతులు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆర్థికంగా ప్రయోజనం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎఆర్‌ఎస్‌ పరిశోధన సహ సంచాలకులు డాక్టర్‌ పివికె.జగన్నాథరావు, చెరకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ చిత్కల దేవి, పోస్ట్‌ హార్వెస్టింగ్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీదేవి పాల్గొన్నారు.