బెల్ ఇంజినీర్లతో ఈవిఎంలు పరిశీలించిన కలెక్టర్
ప్రజాశక్తి - రేణిగుంట
బెల్ ఇంజినీర్లతో ఈవిఎం ల ఆక్సెప్టేన్స్ టెస్ట్ ప్రొసీజర్ ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. శనివారం రేణిగుంట మండలంలోని రామకష్ణాపురం వద్ద గల సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ కాంపౌండ్ లో గల ఈవిఎం గోడౌన్‌ను బెల్ కంపెనీ ప్రతినిధులు ఈవీఎం లకు ఆక్సెప్టేన్స్ టెస్ట్ ప్రొసీజర్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఎస్డిసి శ్రీనివాసులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోడౌన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గోడౌన్లో భద్రపరచబడిన ప్రతి ఈవిఎంల కంట్రోల్ యూనిట్లను బ్యాలెట్ యూనిట్లను ఆక్సెప్టేన్స్ టెస్ట్ ప్రొసీజర్ ద్వారా బెల్ ఇంజినీర్లు నేటి నుండి పరీక్షించనున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. వివి ప్యాట్ ల పరీక్ష పూర్తి అయిందని, బెల్ కంపెనీ నుండి జిల్లాకు చేరుకుని గోడౌన్ లో భద్రపరచ బడిన 6780 బ్యాలెట్ యూనిట్లు 4270 కంట్రోల్ యూనిట్లకు ఆక్సెప్టేన్స్ టెస్ట్ ప్రొసీజర్ ను బెల్ ఇంజినీర్లు నేటి నుండి చేపట్టి మూడు నుండి నాలుగు రోజుల్లో పూర్తి చేయనున్నారని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ ను తెరిచి వాటిని పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల నుండి వైఎస్‌ఆర్ సీపీ ప్రతినిధి ప్రభాకర్, టీడీపీ ప్రతినిధులు మురళీకష్ణ, రేణిగుంట తాసిల్దార్ ఉదయ సంతోష్ పాల్గొన్నారు.










