
జెర్రిపోతులపాలెంలోని డిపో ముందు ధర్నా చేస్తున్న కళాశీలు
ప్రజాశక్తి-వేపగుంట : దిగుమతి కూలిరేట్లు ఒప్పందంపై డిస్టలరీల యాజమాన్యాలు సంతకాలు చేయాలని, ఒప్పందం ప్రకారం ఈ ఏడాది మే 2 నుంచి జూన్ 5వ తేదీ వరకు ఎరియర్స్ చెల్లించాలని, కళాశీలందరికీ ప్రమాద బీమా చేయించాలని డిమాండ్‌చేస్తూ జెర్రిపోతులపాలెంలోని ఆంధ్రప్రదేశ్ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపిఎస్‌బిసిఎల్) డిపో ముందు ఆ కళాశీలు మంగళవారం ధర్నా నిర్వహించారు. ధర్నాను డిపో అధ్యక్షులు బి.వెంకటరావు ప్రారంభించి మాట్లాడారు. డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 20వ తేదీ నుంచి దిగుమతులు ఆపేస్తామని హెచ్చరించారు. ఒప్పందంలో అంగీకరించిన కాపీలు ఇవ్వకపోవడం సరైన చర్యకాదని విమర్శించారు. ఈ ధర్నాలో లోడింగ్, అన్‌లోడింగ్ కళాశీల నాయకులు ఎం.శ్రీనివాసరావు, వై.వెంకటరమణ, ఎం.వరహాలు, టి.వెంకటరావు పాల్గొన్నారు.