Dec 02,2022 00:15

ఆందోళన చేస్తున్న బేవరేజెస్‌ హమాలీలు

ప్రజాశక్తి- అనకాపల్లి
ఆంధ్రప్రదేశ్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అనకాపల్లి డిపో హమాలీలు తమకు కూలి రేట్లు పెంచాలని కోరుతూ చేపట్టిన ఆందోళన రెండో రోజు కొనసాగింది. ఇందులో భాగంగా గురువారం డిపో వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం డిపో కమిటీ గౌరవ అధ్యక్షులు గంట శ్రీరామ్‌, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ మాట్లాడుతూ ఎగుమతి కూలిరేట్లు రూ.7 నుంచి రూ.10కు పెంచాలని, ఏరియర్స్‌ సహా పాత బకాయిలు చెల్లించాలని, పిఎఫ్‌, ఈఎస్‌ఐ, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని, ప్రమాద బీమా రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇంటి అద్దెలు, నిత్యవసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులు, పిల్లల చదువుల భారం పెరిగిన నేపథ్యంలో ఆ మేరకు కూలి రేట్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. అగ్రిమెంట్‌ పూర్తయి ఏడాది కావస్తున్నా కొత్త అగ్రిమెంట్‌ చేయకపోవడం అన్యాయమన్నారు. దీనిపై పలు పర్యాయాలు కంపెనీ ఎమ్‌డి, సిగ్మా కంపెనీ కాంట్రాక్టర్‌, రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, సంబంధిత మంత్రికి తెలియజేసినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. సమస్య పరిష్కరించుకుంటే ఈనెల 10 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు జీరు కనక రమణ, కరణం కొండారావు, బిసి నాయుడు, లక్ష్మణ, ఐ.రాఘవరావు, హమాలీలు పాల్గొన్నారు.