Nov 07,2023 23:19

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* మహిళలతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలి
* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పలు కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ఆదేశించారు. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమంపై జిల్లా కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ కేంద్రాల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షిని ఆదేశించారు. ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ సమయంలో ఆడ, మగ వ్యత్యాసాన్ని నిర్ధారించకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. సెక్స్‌రేషియాతో పాటు మాతృ మరణాలు తగ్గించడంపై ప్రత్యే శ్రద్ధ చూపాలని చెప్పారు. జిల్లా నుంచి ఐఎఎస్‌కు ఎంపికైన మహిళా అధికారులు, కరణం మల్లీశ్వరి వంటి మహిళలతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతిశ్రీని ఆదేశించారు. ఎక్కువ సంఖ్యలో మహిళలే సభ్యులుగా ఉన్న గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మాలో సఖి గ్రూపులను చైతన్యపరచాలన్నారు. మహిళల్లో అవగాహన కల్పిచడానికి విజయనగరం జిల్లా కలెక్టర్‌, ఎస్‌పి వంటి ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారి అనుభవాలను తెలియజెప్పేందుకు ఆహ్వానించి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు, పిల్లలు డ్రాప్స్‌ లేకుండా వారిలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చిన్న చిన్న వీడియోలు తీసి విడుదల చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. రోజుకో శాఖ చొప్పున ఒక కార్యక్రమం చేపట్టి 15 రోజుల వరకు కొనసాగించి, చివరలో ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఐదు రోజుల్లో ఆయా శాఖలు ప్రణాళికలను ఐసిడిఎస్‌ పీడీకి పంపాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, అదనపు ఎస్‌పి జె.తిప్పేస్వామి, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌, బాలల రక్షణ అధికారి కె.వి రమణ, గ్రామ, వార్డు సచివాలయాల అధికారి వాసుదేవరావు, ఐటిడిఎ ఎపిఒ రోసిరెడ్డి, సెట్‌శ్రీ సిఇఒ ప్రసాదరావు, ఎల్‌డిఎం సూర్యకిరణ్‌, వికలాంగుల శాఖ ఎడి కవిత తదితరులు పాల్గొన్నారు.