Oct 12,2023 21:15

బేస్మెంట్‌ స్థాయి నిర్మాణాలు జరగని ఇండ్లు రద్దు
రెవెన్యూ రికవరీకి చర్యలు
అర్హులకు ఈ ఇళ్ల కేటాయింపు : కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

గత 4 నెలలుగా బేస్మెంట్‌ స్థాయిలో నిర్మాణాలు జరగని ఇండ్లు రద్దుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎంపిడిఓలను, హౌసింగ్‌ అధికారులను జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జేసి పి.శ్రీనివాసులు, హౌసింగ్‌ పిడి పద్మనాభంతో కలసి గహ నిర్మాణ పురోగతిపై మండలాల ఎంపిడిఓలు, మున్సిపల్‌ కమీషనర్లు, హౌసింగ్‌ డీఈ, ఈఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు కార్యక్రమంను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో వైఎస్‌ఆర్‌ హౌసింగ్‌ లేఅవుట్‌లో ఇండ్లు మంజూరు కాబడి బేస్‌మెంట్‌ స్థాయి వరకు నిర్మించి గత 4 నెలలుగా పనులు చేపట్టని లబ్ధిదారుల వివరాలను సేకరించి ఇంటి పట్టా రద్దుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీనితో పాటు ఇళ్ల పురోగతిలో స్టేజి కన్వెర్షన్‌లలో పనులు చేయని లబ్ధిదారులతో మాట్లాడి పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారులు ఆసక్తి చూపని ఎడల ఇంటి పట్టా రద్దు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. దీనితో పాటు ఇది వరకు వారు ఇంటి నిర్మాణం కొరకు ప్రభుత్వం నుండి పొందిన ఆర్థికసాయం రికవరీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఆ ఇంటిని అర్హులైన లబ్ధిదారులలో ఇంటి నిర్మాణానికి ఆసక్తి ఉన్న వారికి కేటాయించి పనులు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గహ నిర్మాణ పురోగతికి స్టేజి కన్వెర్షన్‌ స్థాయిలలో అడ్వాన్స్‌ రుణం మంజూరు ద్వారా ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని, ఈ దిశగా అధికారులు కషి చేయాలన్నారు. మండలాల వారీగా నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ప్రతివారం రాష్ట్రప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సమీక్షలు నిర్వహించడం జరుగుతున్నదని, ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమానికి జిల్లాస్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు గల సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేయడం ద్వారా లక్ష్యాలను పూర్తి చేయగలమని అన్నారు.