ప్రజాశక్తి- బొబ్బిలి : చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. బొబ్బిలి నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేసి సింహాద్రప్పన్నను దర్శించుకునేందుకు బేబినాయన పాదయాత్రగా శుక్రవారం ఉదయం 8.30 గంటలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని శుక్రవారం తెల్లవారు జామున కోటలోకి డిఎస్‌పి శ్రీధర్, పట్టణ సిఐ ఎం.నాగేశ్వరరావు, పోలీసులు చేరుకుని బేబినాయన పాదయాత్రకు వెళ్లకుండా అదుపులోకి తీసుకుని బుదరాయవలస పోలీసు స్టేషన్‌కు తరలించారు. టిడిపి ముఖ్య నేతలను, కార్యకర్తలను గృహ నిర్బంధం చేశారు. శాంతియుతంగా పాదయాత్ర చేసి సింహాద్రప్పన్న దర్శనం చేసుకునేందుకు వెళ్తే అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని బేబీనాయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుదరాయవలస పోలీసు స్టేషన్‌లో బేబినాయనను టిడిపి చీపురపల్లి నియోజకవర్గం ఇంఛార్జి కిమిడి నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు తెంటు రాజా, బొబ్బిలి చిరంజీవులు, జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి, జనసేన నియోజకవర్గ ఇంచార్జి గిరడ అప్పలస్వామి, లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జి, తదితరులు పరామర్శించి అక్రమ అరెస్టును ఖండించారు.
అరెస్టు దుర్మార్గం: సిపిఎం
బొబ్బిలి: టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి బేబినాయన అరెస్టు దుర్మార్గమని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు, మండల కార్యదర్శి ఎస్.గోపాలం అన్నారు. సిఐటియు కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించినప్పటికి పాదయాత్రకు సిద్ధమైన బేబినాయనను అడ్డుకుని అన్యాయంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.న్యాయవాధుల ఖండన : బేబీనాయన పాదయాత్రను అడ్డుకోవడం దుర్మార్గమని టిడిపి జిల్లా న్యాయ విభాగ ఉపాధ్యక్షులు చెల్లారపు సత్యనారాయణ, న్యాయవాది తుమరాడ గంగాధర్ అన్నారు. పోలీసులు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మాత్తుగా బేబీనాయనను ఇంటిని చుట్టిముట్టి ఆయనను నిర్భంధంలోకి తీసుకువడాన్ని ఖండిస్తున్నామని విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. షాపులు మూసివేత: బేబినాయన అరెస్టుకు వ్యతిరేకంగా కోట చుట్టూ, శ్వేతాచలపతి సంస్థానం ఇంగ్లీషు మీడియం పాఠశాల చుట్టూ ఉన్న షాపులను వ్యాపారులు మూసివేసి నిరసన తెలిపారు. బేబినాయన అరెస్టును వ్యాపారులు ఖండించారు. మాజీ మంత్రి ఖండన: తన సోదరుడు బేబినాయన చేెపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి సుజరుకృష్ణరంగారావు శుక్రవారం ఒక ప్రకటనల విడుదల చేశారు. తన సోదరుడికి ఏమి జరిగినా జగన్ ప్రభుత్వం బాధ్యత వహించాల న్నారు.రాస్తారోకో: బేబినాయన అక్రమ అరెస్టుకు నిరసనగా ఆర్‌టిసి కాంప్లెక్స్ కూడలిలో టిడిపి నాయకులు రాస్తారోకో చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిపిఐ ఖండన : బేబీ నాయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ అన్నారు. శాంతియుతంగా మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరుతున్న సమయంలో పోలీసులు బొబ్బిలి కోటలోకి ప్రవేశించి అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శ మునకాల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, పట్టణ నాయకులు కృష్ణ ఉన్నారు. తెర్లాం: బేబినాయన అరెస్టును ఖండిస్తూ టిడిపి మండల అధ్యక్షులు ఎన్ వెంకట్ నాయుడు, ఎన్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా పోలీసులు పలువురు టిడిపి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.బాడంగి: బేబీ నాయన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని జిల్లా కొప్పుల వెలమ బిసి సాధికారిత చైర్మన్ కొల్లి అప్పలనాయుడు ,టిడిపి రాష్ట్ర ఎస్‌టి జనరల్ సెక్రటరీ పాలవలస గౌరు, వైస్ ఎంపిపి సింగిరెడ్డి భాస్కర్ రావు అన్నారు. బేబినాయన అరెస్టును ఖండిస్తూ మండల కేంద్రంలో నిరసన తెలిపారు. టిడిపి నాయకులు తెంటు రవిబాబు, బొంతు త్రినాధ్, ఉయ్యాలా సత్యనారాయణలతో పాటు పలువురుని బాడంగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వేపాడ: బేబీనాయన అరెస్ట్ దుర్మార్గమని టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఒక ప్రకటనలో ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించినప్పటికి అడ్డుకోవడం దారుణమన్నారు.
విజయనగరంకోట: బేబినాయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌గజపతిరాజు అన్నారు. శుక్రవారం ఆయన బంగ్లాలో మాట్లాడారు. శాంతియుతంగా పాదయాత్రకు సిద్ధమైన ఆయన్ను అరెస్టు సిగ్గుచేటన్నారు. టిడిపిని చూసి ప్రభుత్వం భయపడుతుందన్నారు.










