Jul 25,2021 11:25

మార్కెట్లో బేబీ కార్న్‌ కనిపించగానే ఆసక్తిగా వాటి దగ్గరికెళ్తాం. కానీ వాటిని ఎలా వండాలో తెలియక చివరికి కొనకుండానే ఇంటికొచ్చేస్తూ ఉంటాం. ఇకముందు అలా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. బేబీకార్న్‌తో నోరూరించే రకరకాల వంటలు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

                                                                                 మసాలా

మసాలా

కావాల్సిన పదార్థాలు : బేబీకార్న్‌ ముక్కలు- 200గ్రా., ఉప్పు- సరిపడా, నెయ్యి, నూనె- రెండు స్పూన్లు, జీలకర్ర- స్పూన్‌, ఎండుమిర్చి- రెండు, పెద్ద ఉల్లిపాయ- ఒకటి (తరుక్కోవాలి), అల్లంవెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి- స్పూన్‌, గరంమసాలా- అర స్పూన్‌, కారం- స్పూన్‌, జీలకర్ర- పావు టీస్పూన్‌ (వేగించిన), పచ్చిమిర్చి- రెండు(సన్నగా తరుక్కోవాలి), టమోటాలు- రెండు(పెద్దవి), పసుపు- పావు స్పూన్‌, జీడిపప్పు పేస్టు- రెండు స్పూన్లు, నీళ్లు- తగినంత, కొత్తిమీర -కొద్దిగా, ప్రెస్‌ క్రీమ్‌- పావు కప్పు.

తయారుచేసే విధానం : 

బేబీకార్న్‌ ముక్కల్లో కొన్నినీళ్లు, ఉప్పు వేసి 80 శాతం ఉడికించుకోవాలి. టమోటాల్ని మిక్సీ చేసుకోవాలి. పాన్‌లో నెయ్యి, నూనె, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయముక్కలు వేసి, బంగారు వర్ణం వచ్చే వరకూ వేగనివ్వాలి.
అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, టమోటా పేస్టు, పసుపు వేసి నూనె తేలే వరకూ వేగించుకోవాలి. అందులోనే జీడిపప్పు పేస్టు వేసి, కొద్దిగా నీళ్లు పోసి బాగా తెర్లనివ్వాలి.
సగంపైన ఉడికించిన బేబీకార్న్‌ను వేయాలి. కొత్తిమీర, ప్రెష్‌ క్రీమ్‌, నెయ్యి వేసి కూర బాగా దగ్గరపడేలా ఉడికించాలి.

                                                                            కొత్తిమీర బుల్లెట్స్‌

  కొత్తిమీర బుల్లెట్స్‌

కావాల్సిన పదార్థాలు : పసుపు- 1/4 స్పూన్‌, బేబీకార్న్‌- 300 గ్రా, మొక్కజొన్నపిండి, మైదా- 2 స్పూన్స్‌, ఉప్పు- తగినంత, కొత్తిమీర - తగినంత, ధనియాలు- స్పూన్‌ (దంచినవి), వెల్లుల్లి తరుగు (సన్నగా)- 2 స్పూన్స్‌, పచ్చిమిర్చి - రెండు (సన్న ముక్కలు) టమోటా కెచప్‌- 2 స్పూన్స్‌, ఉప్పు- తగినంత, కారం- స్పూన్‌, చాట్‌ మసాలా- 1/2 స్పూన్‌, నీళ్లు- 1/4 కప్పు, గరంమసాలా- 1/2 స్పూన్‌, కొత్తిమీర - కట్ట, నిమ్మకాయ- అరచెక్క.
తయారుచేసే విధానం :
మరిగిన నీళ్లలో పసుపు, బేబీకార్న్‌ను వేసి 60 శాతం ఉడికించి, చల్లార్చుకోవాలి. వాటిని ఇంచె సైజ్‌ క్రాస్‌గా కట్‌ చేసుకోవాలి.
బౌల్లో మొక్కజొన్న పిండి, మైదా, ఉప్పు, కొత్తిమీర తరుగు, బేబీకార్న్‌ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. వాటిని నూనెలో వేసి, బంగారు వర్ణం వచ్చే వరకు వేగించాలి.
మరో పాన్‌లో రెండు స్పూన్లు నూనె వేసి, కాగాక.. ధనియాలు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి, వేగించాలి.
టమోటా కెచప్‌, ఉప్పు, కారం, చాట్‌ మసాలా వేయాలి. తర్వాత నీళ్లు పోసి, బాగా మరగనివ్వాలి. నీళ్లు ఇగిరిపోక ముందే బేబీకార్న్‌ వేసి, బాగా కలపాలి.
చివరిలో గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి, నిమ్మకాయరసం పిండి కలపాలి. అంతే కొత్తిమీర బుల్లెట్స్‌ రెడీ.

                                                                             కొత్తిమీర రైస్‌

 కొత్తిమీర రైస్‌

కావాల్సిన పదార్థాలు : బేబీకార్న్‌ ముక్కలు- పావు కిలో, మొక్కజొన్న, మైదా / బియ్యంపిండి- రెండు స్పూన్లు, ఉప్పు- తగినంత, నూనె- సరిపడా, జీలకర్ర, ధనియాలు- స్పూన్‌, పచ్చిమిర్చి-రెండు (సన్నగా తరుక్కోవాలి), వెల్లుల్లి- కొన్నిరెబ్బలు, ఉల్లిపాయ- ఒకటి (సన్న ముక్కలు), టమోటా పేస్ట్‌ - రెండు స్పూన్లు, కారం- స్పూన్‌, జీలకర్ర పొడి- స్పూన్‌ (వేగించినది), ధనియాల పొడి- టీ స్పూన్‌, చాట్‌ మసాలా- స్పూన్‌, బాస్మతి రైస్‌, కొత్తిమీర తరుగు- కప్పు, నిమ్మరసం- 1/2 కప్పు.
 

తయారుచేసే విధానం :
బేబీకార్న్‌ ముక్కల్ని 80 శాతం ఉడికించుకోవాలి. పాన్‌లో మొక్కజొన్న పిండి, మైదా, ఉప్పు, రెండు టీస్పూన్ల నీళ్లుపోసి, బాగా కలపాలి.
పాన్‌లో నూనె వేడెక్కాక పిండితో కలిపి పెట్టుకున్న బేబీకార్న్‌ను బంగారు వర్ణం వచ్చేవరకూ వేగించాలి.
మరో పాన్‌లో రెండు స్పూన్లు నూనె వేసి, కాగాక.. జీలకర్ర, ధనియాలను చేతితో బాగా నలిపి వేయాలి. పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి, ఉల్లిపాయ వేసి బాగా వేగించాలి. అందులోనే టమోటా పేస్ట్‌, కారం, వేగించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్‌ మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. దీనిలోనే రెండు స్పూన్ల నీళ్లు పోసి, నూనె పైకి తేలే వరకూ ఉడికించాలి.
బేబీకార్న్‌ను వేసి కలిపి, భాస్మతి రైస్‌, కొత్తిమీర వేయాలి. చివరగా నిమ్మరసం వేసి, బాగా కలిపి దింపెయ్యాలి.

                                                                             క్రిస్పీ బేబీకార్న్‌

క్రిస్పీ బేబీకార్న్‌

కావాల్సిన పదార్థాలు :  బేబీ కార్న్‌ - 200 గ్రా, నీళ్లు- సరిపడా, మైదా - 3 స్పూన్లు, బియ్యంపిండి - 3 స్పూన్లు, మొక్కజొన్న పిండి - 3 స్పూన్లు, ఉప్పు - తగినంత, తెల్ల మిరియాల పొడి- 1/2 స్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- 1/2 స్పూన్‌, పసుపు- 1/4 స్పూన్‌, నూనె- తగినంత, ఉల్లిపాయ, ఆకుకూర ముక్కలు - 2 స్పూన్లు, వెల్లుల్లి - 1/4 కప్పు, పచ్చిమిర్చి - 2 స్పూన్లు, నల్లమిరియాల పొడి - 1/2 స్పూన్‌, చక్కెర - చిటికెడు, కారం - స్పూన్‌, డార్క్‌ సోయాసాస్‌ - 1/2 స్పూన్‌, వెనిగర్‌ - 1/2 స్పూన్‌, మొక్కజొన్న పిండి - 1/2 స్పూన్‌.
 

తయారుచేసే విధానం :
పాన్‌లో నీళ్లల్లో కొద్దిగా ఉప్పువేసి, బేబీకార్న్‌ 3 నిమిషాలు ఉడికించాలి.
బౌల్‌లో మైదా, బియ్యం పిండి, మొక్కజొన్న పిండి, తెల్లమిరియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, పసుపు, ఉప్పు వేసి, కలపాలి. బేబీకార్న్‌ ముక్కల్ని, కొంచెం నీళ్లు పోసి, బాగా కలపాలి.
బజ్జీలు వేసినట్లు నూనెలో వేసి, బంగారు వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి.
పాన్‌లో రెండు స్పూన్ల నూనె పోసి, అందులో ఉల్లిపాయ, ఆకుకూరలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. వేగాక ఉప్పు, నల్ల మిరియాలు, తెల్ల మిరియాల పొడి, చక్కెర, కారం వేసి కొద్దిసేపు వేగనివ్వాలి.
డార్క్‌ సోయాసాస్‌, వెనిగర్‌ వేసి, కొంచెం వేగనివ్వాలి. మొక్కజొన్న పిండి కలిపిన నీళ్లను పాన్‌లో పోసి, బాగా కలపాలి. ఇప్పుడు బేబీకార్న్‌ను వేసి కలపాలి.