ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కూరగాయల ధరలు కాస్తంత తగ్గినా బియ్యం, పప్పుదినుసులు ధరల పెరుగుదల కొనసాగుతోంది. రెండు నెలల నుంచి ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. సాదారణ బియ్యం ధరలు కిలో రూ.50 వరకు ఉన్నాయి. మూడు నెలల క్రితం రూ.40 పలికిన బియ్యం రూ.50 నుంచి క్రమంగా రూ.60 వరకు పెరిగింది. అంతేగాక సోనా మసూరి బియ్యంలో పలువురు వ్యాపారులు నేరుగా రేషన్ బియ్యం కలిపి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నా రైసు మిల్లర్లు, బియ్యం వ్యాపారుల అక్రమాలపై అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కందిపప్పు కిలో రూ.160 నుంచి రూ.170కి పెరిగింది. 3 క్రితం కిలో కందిపప్పురూ.100 ఉండగా గత నెలలో రూ.140కు పెరిగింది. ఈనెలలో రూ.30 మరో పెరిగింది. మినపగుళ్లు రూ.100 నుంచి రూ.130కి పెరిగాయి. వేరుశనగ గుళ్లు రూ.130 నుంచిరూ.160 పలుకుతుండగా పచ్చి పప్పు మాత్రం రూ.80కి పెరింది. పుట్నాల పప్పు రూ.90 నుంచి రూ.120కి పెరిగింది. కందిపప్పు విదేశాలనుంచి ఎక్కువగా దిగుమతి అవుతున్నట్టు వ్యాపారులు తెలిపారు. దేశీయంగా కందిపప్పు నిల్వలు లేకపోవడం వల్ల బర్మా, సౌత్ ఆఫ్రికా దేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నారని వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం కందులు క్వింటాళ్ ఏకంగా రూ.12 వేలకు పెరిగాయి. రైతుల వద్ద గరిష్టంగా రూ.8 వేలు కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుతం కందిపప్పు మాత్రం రూ.160కు అమ్మడం విశేషం. ప్రభుత్వం రేషన్‌కార్డులపై కందిపప్పు సరిగా సరఫరా చేయడం లేదు.
ఇదిలా ఎండగా కూరగాయల ధరలు తాత్కాలికంగా తగ్గాయి. గత మే, జూన్‌లో కురిసిన వర్షాలతో సాగు చేసిన ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్నాయి. దీంతో ధరలు కొంత మేరకు తగ్గాయి. అయితే ప్రస్తుతం పంటలు ఎదుగుదల దశలో ఉన్న కూరగాయాల తోటలకు వర్షాభావం వెంటాడుతోంది. దీంతో రానున్న కాలంలో ఉత్పత్తులు తగ్గి మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉందని రైతులు తెలిపారు. గతనెలలో టమోటా కిలో గరిష్టంగా రూ.150 నుంచి 180 వరకు పలికింది. రైతు బజార్లలో ప్రభుత్వం కిలో రూ.50కి అందిస్తున్నట్టు ప్రకటించినా అవి వినియోగదారులకు పరిమితంగానే దక్కాయి.
గత నెలలో అన్ని రకాల కూరగాయల ధరలు కిలో రూ.30కి తగ్గలేదు. ప్రస్తుతం బెండకాయలు, టమోటా, దొండకాయలు, క్యాబేజి, పొట్లకాయలు ధరలు కొంత మేరకు తగ్గాయి. పచ్చిమిర్చి ధర కూడా గతనెలలో రూ.100 వరకు పలికింది. ప్రసుత్తం రూ.34కు తగ్గింది. బంగాళదుంపల ధరలు తప్ప మిగతా అన్ని రకాల కూరగాయల ధరలు గతనెలలో దాదాపు రూ.40-50 వరకు చేరాయి. ప్రస్తుతం అన్ని రకాల కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. గురువారం రైతు బజార్లలో టమాట రూ.26, వంకాయ రూ.23, బెండరూ.14, మిర్చి రూ.34, కాకరరూ.35, బీర 28, క్యాలీఫ్లవర్ రూ.30, క్యాబేజి రూ.20,క్యారెట్ రూ.36, దొండ రూ.19, బంగాళదుంప రూ.24, ఉల్లిపాయలు రూ.32, గోరుచిక్కుడు 28, దోస రూ.19, సొర రూ.10, పొట్ల రూ.16, పెద్దచిక్కుడు రూ.45, చామదుంప రూ.33, బీట్‌రూట్ రూ.27, క్యాప్సికమ్ రూ.40, బీన్స్ రూ.84, ఆకు కూరలు కట్ట రూ.10 పలుకుతున్నాయి. మరో వైపు ఉల్లిపాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. రైతు బజార్లలో జూన్‌లో రూ.17, జులైలో రూ.22 పలికిన ఉల్లిపాయల ధరలు ఆగస్టులో రూ.32కు పెరిగాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.40కి చేరుతున్నాయి.










