* ప్రేక్షకాదరణతోనే గుర్తింపు
* అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు గర్వకారణం
* హీరో కార్తికేయ
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: తెలుగు చిత్రపరిశ్రమలో నటీనటులు పోటీపడి సినిమాలు చేస్తున్నారని సినీ హీరో కార్తికేయ అన్నారు. మంచి సినిమాలుగా ప్రేక్షకాదరణ పొందితే సినీ పరిశ్రమలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. నగరంలోని సూర్యమహల్‌లో 'బెదురులంక 2012' చిత్ర బృందం మంగళవారం సందడి చేసింది. థియేటర్‌లో చిత్ర ప్రదర్శన సమయంలో ఆయన హాజరై ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఆర్‌ఎక్స్ 100 సినిమాను శ్రీకాకుళం ప్రజలు ఎంతగానో ఆదరించారని, ఆ సమయంలోనూ తాను శ్రీకాకుళం ప్రేక్షకులను కలుసుకునేందుకు వచ్చానన్నారు. తాను హీరోగా నటించిన బెదురులంక సినిమా ప్రేక్షకాదరణ పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగు చిత్రసీమకు జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గుర్తింపు తీసుకొచ్చారని, ఈ అవార్డు రావడం టాలీవుడ్‌కే గర్వకారణమన్నారు. యువ హీరోలందరూ అర్జున్‌ను ఆదర్శంగా తీసుకొని మరింత కష్టపడతామన్నారు. సోషల్ మీడియాలో జిల్లావాసులు తనను ఎంతగానో అభిమానిస్తుంటారని, తన సినిమా కోసం ప్రమోషన్ చేయడం ఆనందంగా ఉందన్నారు. త్వరలో యువి క్రియేషన్ బ్యానర్‌లో కొత్త సినిమా ప్రారంభం రాబోతోందని తెలిపారు.










