ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతనెల రోజుల్లో కూరగాయలు అన్ని రకాలు కిలోకి రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. టమాట అందని ద్రాక్షగా మారింది. రైతుబజార్లలో కిలో రూ.130 ఉండగా మార్కెట్‌లో రూ.160 వరకు పెరిగింది. దొండ కాయలు తప్ప మిగిలిన అన్ని రకాల కూరగాయాలు మార్కెట్‌లో కిలో రూ.40కుపైనే ఉంటున్నాయి. దొండకాయలు కిలో రూ.20 పలుకుతున్నాయి. రైతు బజార్లలో ఉన్న ధరలకు మార్కెట్‌లో ఉన్న ధరలకు కిలో రూ.10 నుంచి 20 వరకు తేడా ఉంటోంది. దీంతో ఎక్కువ మంది రైతు బజార్లను ఆశ్రయిస్తున్నారు. అయితే రైతు బజార్లకు నాణ్యమైన సరుకు రావడంలేదు. కొన్ని రకాల కూరగాయాలు రైతు బజార్లలో కన్పించడం లేదు. సరఫరా తగ్గిందంటున్నారు.
జిల్లాలోని వివిధ రైతు బజార్లలో టమోటా కిలో రూ.130కు చేరింది. క్యారెట్ రూ.49,పచ్చిమిర్చి రూ.70, కాకర రూ.36,బీర రూ.40, క్యాబేజి రూ.24, దొండ రూ.12, బంగాళదుంపలు రూ.22, గోరుచిక్కుడు రూ.38, ఉల్లిపాయలు రూ.24, బెండకాయలు రూ.38, వంకాయలు రూ.40, దోసకాయ రూ.35, పొట్ల రూ.30, సొర రూ.24, బీట్ రూట్ రూ.34కు విక్రయించారు. ఆకుకూరల కట్ట రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతున్నాయి. రైతు బజార్లలో రైతుల సంఖ్య క్రమంగా తగ్గిపోయి వ్యాపారులసంఖ్య పెరుగుతోంది. బహిరంగ మార్కెట్‌లో కిలోరూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా విక్రయిస్తున్నారు.
మే నెలలో కురిసిన అకాల వర్షాల వల్ల కూరగాయాల తోటలు దెబ్బతిన్నాయి. జూన్‌లో చాలినంత వర్షాలు లేకపోవడం, జులై తిరిగి అధిక వర్షాల వల్ల ఆకుకూరల తోటలకు నష్టం జరిగింది. జూన్‌లో మొదటి పక్షం వర్షాలు లేకపోవడం, ఎండల తీవ్రతకు నష్టం జరిగింది. అతివృష్టి, అనావృష్టితో కూరగాయల తోటలకు అపార నష్టం వాటిల్లింది. కూరగాయల ఉత్పత్తి తగ్గడం వల్ల గ్రామాల్లోనే అధిక ధరలు పలుకుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ధరలను తెలుసుకుని గ్రామాల్లో ధరలు పెంచుతున్నారు. వివిధ గ్రామాల్లో జరిగే సంతల్లో ధరలు కూడా భారీగానే ఉంటున్నాయి.
భారీగా పెరిగిన పప్పుదినుసులు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రధానంగా పప్పుల ధరలు పెరుగుదల సామాన్యలకు ఇబ్బందికరంగా మారింది. కందిపప్పు కిలో రూ.160, మినపగుళ్లు రూ.120 నుంచి రూ.130, పెసర పప్పురూ.120, పుట్నాలుపప్పు రూ.110, వేరుశనగపప్పు రూ.140 ధరలో ఉన్నాయి. కందిపప్పు గతరెండు నెలల కాలంలో కిలో రూ.40 నుంచి రూ.60 వరకు పెరిగింది. మిగతావీ కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయి. స్లన్ ఫ్లవర్ ఆయిల్స్ లీటరు ప్యాకెట్స్ మాత్రం రూ.114-120 మధ్య ఉన్నాయి. గత ఆరునెలల నుంచి నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే పోపుల డబ్బాలో అధికంగా వినియోగించే ఆవాలు, జీలకర్ర ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని కంపెనీల పేరుతో ఆకర్షనీయ ప్యాకెట్స్ తయారు చేసి పప్పు దినుసులు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచి అధిక ఎంఆర్‌పి ముద్రించి రిటైలర్లకు బాగా లాభాలు సమకూర్చి వినియోగదారులపై మోయలేని భారం మోపుతున్నారు. ఆవాలు 100 గ్రాములు రూ.30, జీలకర్ర 100 గ్రాములు రూ.80 అమ్ముతున్నారు. రెండునెలల క్రితం ఆవాలు రూ.17, జీలకర్ర రూ.30 మాత్రమే ఉండేది. ఎండుమిర్చి ధర కిలో రూ.300 నుంచి రూ.400 వరకు పలుకుతోంది.










