జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
పార్టీలో పలువురు చేరిక
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కొందరు ఆగంతకులు అనుసరిస్తున్నారని, ఆయన ఇంటి వద్ద కూడా రెక్కీ నిర్వహిస్తున్నారని ఆ పార్టీ పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇలాంటి బెదిరింపులకు జనసేన బెదిరేది లేదని స్పష్టం చేశారు. గురువారం ఏలూరు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. తొలుత పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రాండ్ ఆర్య హోటల్లో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు బివి.రాఘవయ్య చౌదరి, మాజీ మున్సిపల్ మేయర్ సిరిపల్లి ప్రసాద్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి అనేకమంది పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఏలూరు నగరంలో వివిధ సంఘాల నుంచి 200 మంది పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గోపాలపురం నియోజకవర్గం నుంచి వైసిపి నేత దొడ్డిగర్ల సువర్ణ రాజు తన అనుచరులతో పార్టీలో చేరారు. అనంతరం ఇటీవల మరణించిన జనసేన పార్టీ సభ్యులు ఆచంటకు చెందిన సిరిగినీడి వెంకట శ్రీరామ్ కుటుంబ సభ్యులకు, తాడేపల్లిగూడేనికి చెందిన బట్టు గోవిందరాజు కుటుంబ సభ్యులకు రూ.ఐదు లక్షల చెక్కులను అందజేశారు. ప్రమాదంలో గాయపడిన కొవ్వూరుకు చెందిన నాగన్నకు, నరసాపురం నియోజకవర్గం పేరుపాలేనికి చెందిన గల్లా రాంబాబుకు రూ.50 వేల చెక్కులను అందించారు. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కోటికలపూడి. గోవిందరావు, పిఎసి సభ్యులు కనకరాజు సూరి, బొమ్మిడి నాయకర్, చేగొండి సూర్య ప్రకాష్, రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ ఛైర్మన్ కెకె, రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి , జిల్లా కార్యదర్శి సాయి, చంద్ర శేఖర్, ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ పాల్గొన్నారు.
కైకలూరు:జనసేన అధినేత పవన్‌కు ఏదైనా జరిగితే జనసైనికులు అణుబాంబులా మారుతారని, రాష్ట్రం అతలాకుతలం అవుతుందని ఆ పార్టీ నాయకులు హెచ్చరించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ పవన్‌ను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ము లేక జగన్‌రెడ్డి దాడికి కుట్ర చేస్తున్నారని, పొరపాటున పవన్‌కు ఏదైనా జరిగితే ఊరుకునేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం పవన్‌కు జెడ్ కేటగిరి భద్రత కేటాయించాన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోట లక్ష్మీ, కొల్లి వరప్రసాద్, సంజన పాల్గొన్నారు.










