ప్రజాశక్తి -గాజువాక : 'పోర్టు వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ, మూకుమ్మడిగా విధులు బహిష్కరించిన మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం' అని రిజిష్టర్ పోస్టు ద్వారా నోటీసులు పంపిస్తున్న యాజమాన్యంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. యాజమాన్యం బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. కనీస వేతనం రూ.36 వేలు చేయాలని, బేసిక్ రూ.22 వేలుగా ప్రకటించాలని డిమాండ్‌చేస్తూ అదాని గంగవరం పోర్టు కార్మికులు చేపట్టిన దీక్షలు శనివారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలనుద్దేశించి స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ, సంప్రదింపుల ద్వారా కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం ఈ రకంగా కార్మికులను భయభ్రాంతులకు గురి చేయటం సమంజసం కాదన్నారు. 200 మందికి పైగా యాజమాన్యం నోటీసులు పంపించిందని, వాటిని కార్మికులు తిరస్కరించి వెనక్కి పంపించేశారని తెలిపారు. కార్మికులకు వ్యక్తిగతంగా ఇస్తున్న నోటీసులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
హెచ్‌ఎంఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.గణపతి రెడ్డి, అధ్యక్షులు డి.అప్పారావు, ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షులు కె.ఎల్లయ్య శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. గంగవరం అదాని పోర్టు నిర్వాసిత కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, పోర్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసిత కార్మికులకు అత్యంత తక్కువ వేతనాలు ఇస్తూ వారి శ్రమను దోచుకోవడం తగదని పేర్కొన్నారు. అదాని గంగవరం పోర్టులో కార్మిక చట్టాలు అమలు కావడం లేదని, ఎవరైనా హక్కుల కోసం మాట్లాడితే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని తెలిపారు. కనీసం రూ.36 వేలు జీతం, బేసిక్ రూ.22 వేలుగా ప్రకటించాలని, అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సఫలం కాని చర్చలు
యాజమాన్యం పిలుపుమేరకు యూనియన్ ప్రధాన కార్యదర్శి నొల్లి తాతారావుతో పాటు మరో 29 మంది కార్మికులు యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. ఈ సంప్రదింపుల్లో బేసిక్ రూ.22 వేలుగా ప్రకటించి కనీస జీతం రూ.36 వేలు ఇవ్వాలని, అక్రమంగా విధుల నుంచి తొలగించిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, మెడికల్ పాలసీ ప్రకటించాలని, ప్రమాదంలో మరణించిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని, బోనస్ తదితర డిమాండ్లను యాజమాన్యం ముందు కార్మిక నాయకులు ఉంచారు. యాజమాన్యం దేనికీ ఒక స్పష్టత ఇవ్వలేదు. కలెక్టర్‌తో జరిగిన సంప్రదింపుల్లో ఆయన చేసిన సూచనలను కూడా పరిగణలోకి తీసుకునేలా మాట్లాడలేదు. జీతం 2024లో పెంచుతామని చెప్పారు తప్ప ఎంత అనేది స్పష్టత ఇవ్వలేదు. ఐడి కార్డులలో అదాని పేరు చేరుస్తామని చెప్పారు కానీ మెడికల్ పాలసీ, ఇతర సమస్యలపై స్పష్టత లేదు.
ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగించండి : ఎమ్మెల్యే
ఈ విషయంపై కార్మికులు స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలిశారు. ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగించాలని ఆయన కార్మికులకు సూచించారు.
అనంతరం యూనియన్ ప్రధాన కార్యదర్శి నొల్లి తాతారావు మాట్లాడుతూ, యాజమాన్యంతో జరిగిన చర్చలు కార్మికులను మరింత నిరాశకు గురిచేశాయని, ఈ ఉద్యమాన్ని అంచలంచలుగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంటిపల్లి అమ్మోరు, వాసుపిల్లి ఎల్లయ్య, మాద అప్పారావు, కదిరి సత్యానందం, పేర్ల నూకరాజు, గంటిపిల్లి లక్ష్మయ్య, కదిరి భూలోకరావు, కొవిరి అమ్మోరు, నొల్లి స్వామి పాల్గొన్నారు.










