Sep 24,2021 06:17

    క్యరాజ్య సమితి సెప్టెంబర్‌ 23ను అంతర్జాతీయ సైన్‌ లాంగ్వేజ్‌ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి సంకేత భాషల ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 23-29 వరకు సంకేత భాషల వారోత్సవాలను జరుపుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 72 మిలియన్ల బధిరులు ఉన్నారు. 80 శాతం మంది అభివృద్ధి చెందిన దేశాల్లోనే నివస్తున్నారు. అంతర్జాతీయంగా 300 కంటే ఎక్కువ సైన్‌ లాంగ్వేజ్‌లు ఉన్నాయి. కానీ కేవలం 2శాతం మందే సైన్‌ లాంగ్వేజ్‌ ఉపయోగిస్తున్నారు. రష్యాలో మొదటగా 1802లో అలెగ్జాండర్‌ చెవిటి, మూగ వారి కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించారు. ఫ్రాన్స్‌, రష్యా, ఐరోపా లాంటి దేశాలు ఈ ప్రత్యేక విద్యను ఒక వ్యవస్థగా అభివృద్ధి చేశాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సోవియట్‌ రష్యాలో బధిరుల విద్యాభివృద్ధి కోసం కృషి జరిగింది.
    చెవిటి పిల్లల కోసం సాధారణ విద్యాసంస్థల్లో ప్రత్యేక సామర్థ్యం కల్గిన ఉపాధ్యాయులను నియమించడం, వీరి ద్వారా పిల్లల సామర్థ్యానికి అనుగుణంగా చదవడం, రాయడం, వేలిముద్రలు వినియోగించి అక్షరాలు నేర్పించడం చేస్తున్నారు. సైగల భాష అభివృద్ధి కావడం ద్వారా బధిరులు ప్రస్తుతం అన్ని రంగాల్లో రానిస్తున్నారు. మన దేశంలో ప్రత్యేక పాఠశాలాల ఏర్పాటు పట్ల నిర్లక్ష్యం ఉంది. ఇప్పటికీ అమెరికన్‌ సైన్‌ లాంగ్వేజ్‌నే మన దేశంలో వినియోగిస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు స్వతహాగా వారి వారి దేశాల్లో జాతీయ స్థాయిలో సైన్‌ లాంగ్వేజ్‌ని అభివృద్ధి చేస్తే 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత దేశంలో మాత్రం ఇతర దేశాల సైన్‌లాంగ్వేజ్‌ పైనే ఆధారపడటం బధిరుల విద్య పట్ల మన పాలకులకున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. 2021 ఆగష్టులో మన దేశంలో సైన్‌ లాంగ్వేజ్‌ను అధికారికంగా గుర్తిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికైనా మన సైన్‌ లాంగ్వేజ్‌ను అభివృద్ధి చేయడంపై పాలాకులు శ్రద్ధపెట్టాలి. ప్రపంచంలో అనేకదేశాలలో బధిరుల కోసం ప్రాథమిక విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు సైన్‌ లాంగ్వేజ్‌లో బోధిస్తున్నారు. మన దేశంలో ప్రభుత్వ రంగంలో బధిరులు చదువుకునేందుకు విద్యా సంస్థలు తగినన్ని లేవు. సాధారణ పాఠశాలల్లో ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించాలని విద్యాహక్కు చట్టంలో వున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.
     ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మన దేశంలో 10-20 శాతం మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. 50 ఏళ్లు పైబడిన వారిలో 40 శాతం, 70 ఏళ్లు పైబడిన వారిలో 70 శాతం మందికి వినికిడి సమస్య ఉన్నది. జనాభాలో సగటున ప్రతి 6 మందిలో ఒకరికి వినికిడి లోపం ఉంది. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒక్కరికి వినికిడి సమస్య ఉండొచ్చని 2021 డబ్ల్యుహెచ్‌ఓ అధ్యయనం ప్రకటించింది.
    2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్సెసిబుల్‌ ఇండియా క్యాంపెయిన్‌ ద్వారా 2020 నాటికి ప్రధాన నగరాల్లో 50 శాతం అందుబాటు లోకి రావాలి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రభుత్వ కార్యాలయాలన్నిట్లో సైగల భాష సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. కానీ, ఇవేవి అమలులో లేవు. బధిరులు వినియోగించే పరికరాలు అందుబాటులో లేకపోవడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వినికిడి పరికరాలను ఉచితంగానే సరఫరా చేయాలి. శాస్త్రీయ పద్ధతిలో చికిత్స అందించాలి. దీని కోసం ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో ఆడియాలజిస్టు, స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథలాజిస్టులను నియమించాలి. ఆడియాలజిస్టు శిక్షణ కోసం ప్రత్యేకంగా కళాశాలను ఏర్పాటు చేసి, పుట్టిన బిడ్డలకు వినికిడి పరీక్షలు చేయాలి. వినికిడి పరికరాలు కొనుగొలు కోసం రీయంబర్స్‌మెంట్‌ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పరికరాలు వాడేందుకు దోహదపడుతుంది. వినికిడి సమస్య ఉన్న వారిలో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ చికిత్స చేయాల్సిన వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించాలి. వినికిడి తీవ్రతను బట్టి ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందుకోసం ప్రభుత్వాలపై పోరాడి హక్కులు సాధించుకుకోవాల్సిన అవసరం ఉంది.
 

- యం. అడివయ్య,
సెల్‌: 9490098713