భవన నిర్మాణ పనులు, వ్యవసాయ పనుల కోసం లక్షలాది మంది వలసలు పోవడం సర్వసాధారణమైన విషయం. తల్లిదండ్రులు పిల్లలను నాయనమ్మ, అమ్మమ్మల దగ్గర వదలి వెళతారు. ఊరిలో బడి ఉంది కనుక చదువుకోగలిగే అవకాశం ఉంది. మూడు కిలోమీటర్ల దూరం పంపాలంటే సహజంగానే అనేక సమస్యలు వస్తాయి. అవి ఆడపిల్లలను వెంటాడుతాయి. అంత దూరం వెళ్లలేరనే ... నాలుగు దశాబ్దాల క్రితం అన్ని గ్రామాల్లో బడులు పెట్టారు. ఆడపిల్లల నమోదు శాతం పెరిగింది. ఇప్పుడు మరలా దూరంగా బడులంటే పూర్వ పరిస్థితులు దాపురిస్తాయి. డ్రాపౌట్ రేటు పెరుగుతుంది. దీంతో బడి మానడానికి ఎక్కువ అవకాశాలున్నాయి.
ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా జాతి నిర్మాణానికి విలువలు కలిగిన విద్యా వ్యవస్థ ఉండాలి. అటువంటి విద్యార్థులను తయారు చేయాలంటే విద్య అందుబాటులో ఉండాలి. అది తెలిసికూడా గ్రామాల్లోని పాఠశాలలను మూసివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటున్నది. ఇప్పటికే అధికారికంగా సర్వేలు, గణాంకాలు పూర్తి చేశారు. మూడు కిలోమీటర్ల దూరంలోగల పాఠశాలలు మూసేసి...అన్నింటిని ఒక చోట కేంద్రీకరించి ఒక పాఠశాలగా...అన్ని రకాల హంగులతో ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో 39,140 ప్రాథమిక పాఠశాలలు, 9,213 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటినీ మూడు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకరణ చేస్తారు.
భౌగోళిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులు
విద్య అభివృద్ధి చెందాలంటే జిల్లాలోని పారిశ్రామిక, వ్యవసాయ, ఉపాధి రంగాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే పిల్లలు రకరకాల పనులు చేయనిదే ఇల్లు గడవని పరిస్థితులను చూస్తున్నాము. చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా అననుకూల పరిస్థితుల కారణంగానే మహిళల్లో నిరక్షరాస్యత ఉంది. ఇది గుర్తించిన అనేక విద్యా కమిషన్లు, కేంద్ర ప్రభుత్వం (1968 తరువాత) గ్రామ గ్రామాన బడి ఉండాలని, ఒక కిలోమీటర్ దూరంలో బడి ఉండాలని పెద్ద ఎత్తున పాఠశాలలు పెట్టాక చదువుకొనే వారి సంఖ్య పెరిగింది. విద్యాహక్కు చట్టం కూడా గ్రామ గ్రామాన బడులు ఉండాలని 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్య అందివ్వాలని చెప్పింది. భవన నిర్మాణ పనులు, వ్యవసాయ పనుల కోసం లక్షలాది మంది వలసలు పోవడం సర్వసాధారణమైన విషయం. తల్లిదండ్రులు పిల్లలను నాయనమ్మలు, అమ్మమ్మల దగ్గర వదలి వెళతారు. ఊరిలో బడి ఉంది కనుక చదువుకోగలిగే అవకాశం ఉంది. మూడు కిలోమీటర్ల దూరం పంపాలంటే సహజంగానే అనేక సమస్యలు వస్తాయి. అవి ఆడపిల్లలను వెంటాడుతాయి. అంత దూరం వెళ్లలేరనే...నాలుగు దశాబ్దాల క్రితం అన్ని గ్రామాల్లో బడులు పెట్టారు. ఆడపిల్లల నమోదు శాతం పెరిగింది. ఇప్పుడు మరలా దూరంగా బడులంటే పూర్వ పరిస్థితులు దాపురిస్తాయి. డ్రాపౌట్ రేటు పెరుగుతుంది. దీంతో బడి మానడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో తెల్లవారుజాము నుంచే పొలం పనులలో నిమగమయ్యే పరిస్థితుల్లో పిల్లలను సకాలంలో తయారు చేసి పంపించే పరిస్థితులు ఉండవు. విద్యపై ఆసక్తి తగ్గడం, మానెయ్యడం వంటివి జరుగుతాయి. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా గల గ్రామసీమలు నీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, భారీ పరిశ్రమలు లేకపోవడం, ఉన్న జ్యూట్ మిల్లులు మూతపడడం వంటి పరిస్థితులు ఉన్నప్పుడు పాఠశాలను మూసేస్తే ఈ విధానాలు మరింత వెనుకబాటుకు తోడ్పడతాయి.
పెరిగిన బాలికల నమోదు
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడంతో గణనీయంగా నమోదు పెరిగింది. బాలికల నమోదు కూడా బాగా పెరిగింది. అంటే గ్రామాలలో కుటుంబ ఆర్థిక పరిస్థితుల వెనుకబాటుతనానికిది అద్దం పడుతున్నది. ఉదయం చద్ది అన్నం తినకుండా వచ్చే పిల్లలు, స్నానం చేయకుండా వచ్చే పిల్లలను ఇప్పటికీ చూస్తున్నాము. ఊరిలోనే బడి ఉండటం వల్ల అటువంటి పిల్లల పరిశుభ్రత, ఆలనా పాలనా చూసే ఉపాధ్యాయులు, బాధ్యతతో సరిచేసే సంస్కృతి ఇంకా ప్రభుత్వ పాఠశాలలో ఉంది. మధ్యాహ్నం విరామ సమయంలో ఇళ్లకు వెళ్లి చద్దన్నం తిని వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ అవకాశం ప్రస్తుత పాఠశాల వ్యవస్థలో ఉంది. ఉన్న బడిని మూసేస్తే బాలికల ప్రత్యేక అవసరాలకు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి.
మన ముందున్న అనుభవాలు...
ఇటువంటి విధానాల వలన సంభవించిన దుష్పరిణామాలను తెలిపే అనుభవాలు అనేకం మన ముందున్నాయి. ఇప్పటికే రాజస్థాన్‌లో 17,000 మహారాష్ట్రలో 14,000 పాఠశాలలు మూతపడ్డాయి. మన రాష్ట్రంలో కూడా సక్సెస్ పాఠశాల పేరుతో యు.పి పాఠశాలలను మూసేశారు. ఇప్పటికే మన రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాలలో రూపాంతరం అనే పథకం కింద గిరిజన ప్రాథమిక పాఠశాల నుండి 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఆశ్రమ పాఠశాలలకు పంపించారు. వాటిని గ్రేడ్ ఏ పాఠశాల అంటారు. అంటే ఎనిమిది వందల నుండి వెయ్యి మంది విద్యార్థులను ఒకేచోట చేర్చాలి. పిల్లలు రావాలంటే ప్రతి గ్రామంలో గల జిపిఎస్ పాఠశాలలను మూసివేస్తే తప్ప అంత సంఖ్యకు చేరదు. కనుక మూసేశారు. దీనితో చిన్న తరగతుల ఆడపిల్లలు హాస్టళ్లలో ఇమడలేక వెనక్కి వచ్చారు. ఆ పిల్లలంతా గ్రామాలలో డ్రాపౌట్లుగా తిరుగుతున్నారు. ఈ అనుభవాలు ఇప్పటికే విద్యారంగంలో ఉండగా...బాలికలు, మహిళల విద్యాభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధి మా లక్ష్యం అని ప్రభుత్వం చెప్తుంది.
ఇటువంటి విధానాలను అమలు చేస్తే అభివృద్ధి ఎక్కడ నుంచి వస్తుంది? మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలను ప్రైవేట్, కార్పొరేట్లకు అప్పగించే పనిలో వున్నారు. ఎక్కడైనాసరే లింగ వివక్షత లేని సమాజం ఉందంటే ఆ దేశ విద్యా వ్యవస్థ కారణమని ఆ దేశాల అనుభవాలు చెబుతున్నాయి. ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత చదువుల వరకూ విద్య అందుబాటులో ఉండడంతోనే సాధ్యం అయ్యింది. రాష్ట్రంలో చేతలు దానికి భిన్నంగా ఉన్నాయి. రాష్ట్ర నేతలు ఆడపిల్లల పథకాలను వరుసపెట్టి చదువుతారు కానీ విద్య మాత్రం వద్దంటారు. బ్రిటిష్ కాలం నుండి మన దేశంలో సంఘసంస్కర్తలు బాలికా విద్య కోసం చేసిన కృషి, త్యాగాలను కూడా ఒకసారి పాలకులు గుర్తు చేసుకోవాలి. బలహీన వర్గాల ఆడపిల్లలు చదువుకోవడానికి వీలు లేదనే సంస్కృతిని బద్దలు కొట్టి...బాలికా విద్య ఆవశ్యకతను ప్రభుత్వాలు గుర్తించి చట్టాలు చేయడమనేది ఉద్యమాలతోనే సాధ్యమైంది. ఈ సమాజం మహిళా అక్షరాస్యత వల్లనే అభివృద్ధి చెందిందని మైకుల్లో ఉపన్యాసాలు చెప్పి ఓట్లు దండుకుని ఇప్పుడేమో ఎన్.ఇ.పి తో చదువుకు దూరం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది ఆర్థికంగా వెనుకబడిన వారే.
బలహీన వర్గాల పిల్లలను చదువుకు దూరం చేసి బాలికలకు విద్య అందుబాటులో వుంచనట్లయితే ఇప్పటివరకు మౌలిక వసతుల కోసం ఖర్చుపెట్టిన ప్రజాధనం వధా అయినట్లే! మధ్యాహ్న భోజన కార్మికులకు ఉపాధి లేకుండా చేసి, నిరక్షరాస్యతను పెంచే ఈ విధానం ప్రైవేటు కార్పొరేట్ సంస్థల కోసం. ఇన్ని నష్టాలకు దారితీసే ఎన్.ఇ.పి విధానాన్ని అమలు చేసి తీరుతామని ఏలికలు అంటున్నారు. ప్రజల పక్షాన నిలబడవలసిన సమయం ఆసన్నమైనది. దీనికి సమాధానం ప్రజా ఉద్యమాలు, పోరాటాలు మాత్రమే. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో బడి ఒక చైతన్య కేంద్రం. గ్రామంలో గుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో బడికి అంతే ప్రాధాన్యతనిస్తారు.
ఎన్.ఇ.పి లో భాగంగా గ్రామాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా కనుమరుగవుతుంది. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ప్రపంచ బ్యాంకు నుండి అప్పు పొందేందుకు షరతులు అంగీకరిస్తున్నారు. దీని వలన వచ్చే అనర్థాలను లెక్కచేయకుండా వాటి అమలుకు పూనుకుంటున్నారు. ఇప్పటికే సాంఘిక దురాచారాలు, ఆర్థిక అసమానతలు, లింగ వివక్షత, వెనుకబాటుతనం పెరుగుతున్నది. ఐక్యరాజ్యసమితి రూపొందించిన లైంగిక అసమానతల సూచీలో భారత్ 134వ స్థానంలో ఉంది. కార్మిక శక్తి, వారి ఆదాయాలు, అక్షరాస్యత, జననాల నిష్పత్తిలో అడుగున ఉన్న 20 దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ విద్యా నివేదిక ప్రకారం ఇండియాలోని నిరక్షరాస్యులలో మహిళలు 68 శాతం ఉన్నారు. 18 సంవత్సరాలు నిండక ముందే 41 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. 70 శాతం బాలికలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇన్ని వ్యత్యాసాలున్న సమాజంలో 3, 4, 5 తరగతుల విలీనం వల్ల బాలికలు వెనుకబడే ప్రమాదం వుంది. విద్యకు దూరం అవుతారు. కనుక ఈ విధానాలను ప్రతిఘటించి విద్యాహక్కును బాలికల హక్కుగా చెప్పి...విద్యా రంగ పరిరక్షణలో భాగస్వాములు కావడం ఎంతైనా అవసరం.
/ వ్యాసకర్త : యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు /
కె. విజయగౌరి










