Nov 08,2023 21:34

సభలో మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి-సాలూరు : రాష్ట్రంలోని బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వం తమదేనని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్ర బుధవారం సాలూరు పట్టణానికి చేరుకుంది. అందులో భాగంగా బుధవారం పట్టణంలోని ప్రధాన రహదారిపై డిప్యూటీ సిఎం రాజన్నదొర అద్యక్షతన నిర్వహించిన సభలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పేదలు సంక్షేమ పథకాల కోసం అనేక అవమానాలు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. టిడిపి కార్యకర్తలు, సానుభూతి పరులైతే గాని సంక్షేమ పథకాలు అందని పరిస్థితి ఉండేదన్నారు. అలాంటి పరిస్థితి నుంచి గడిచిన నాలుగున్నర ఏళ్లలో రాష్ట్ర ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు వచ్చిందని చెప్పారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సంక్షేమ పథకాల గురించి హేళన చేస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడారని చెప్పారు. పేదలకు పప్పు బెల్లం డబ్బులు పెంచుతున్నారని చంద్రబాబు విమర్శించారని చెప్పారు. తర్వాత మాట మార్చి వైసిపి కంటే మెరుగైన పథకాలు తాను అధికారంలోకి వస్తే ఇస్తానని చెప్పారని గుర్తుచేశారు. 14 ఏళ్లపాటు సిఎంగా పనిచేసిన చంద్రబాబు ఈ పథకాలను అమలు చేస్తే టిడిపిని ప్రజలు ఎందుకు ఓడిస్తారని చెప్పారు. మోసపూరిత హామీలిచ్చి మూడుసార్లు టిడిపి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి చేతులెత్తేసిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. అలాంటి చంద్రబాబుకి మరో ఛాన్స్‌ ఇస్తే మేలు చేస్తారని గ్యారెంటీ ఏముందని ప్రశ్నించారు.
స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఎస్‌సిలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని ఎగతాళి చేసిన చంద్రబాబు.. గిరిజన, దళిత వ్యతిరేకి అన్నారు. టిడిపి, జనసేనతోపాటు ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారని చెప్పారు. డిప్యూటీ సిఎం రాజన్నదొర మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు రూ.1060 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. టిడిపి హయాంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పారు. దళిత, గిరిజనులంటే చంద్రబాబుకి చిన్నచూపు అన్నారు.
అనంతరం ఎమ్‌పి జి.మాధవి, రాజాం ఎమ్మెల్యే జోగులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసిపి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జోగారావు, శంబంగి వెంకట చినప్పలనాయుడు, పుష్పశ్రీవాణి, కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, వైసిపి మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌ రాజు, జిసిసి చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌, వైసిపి నాయకులు పాల్గొన్నారు.