Apr 07,2023 23:33

సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ గోపాలం

ప్రజాశక్తి-గుంటూరు : ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రజారోగ్య వేదిక నాయకులు ఎల్‌ఎస్‌ భారవి అన్నారు. శుక్రవారం బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటివ్స్‌ యూనియన్‌, ప్రజారోగ్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఎల్‌ఎస్‌ భారవి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు డాక్టర్ల అందుబాటు విషయంలో 18 శాతం కొరత ఉందన్నారు. దేశంలో మూడింట రెండు వంతుల జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే, కేవలం 33 శాతం హెల్త్‌ వర్కర్లు, 27 శాతమే డాక్టర్లు ఉండటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందన్నారు. వైద్యరంగంలో ప్రభుత్వాల వైఫల్యాలను కరోనా సమయంలో కళ్లకు కట్టినట్లు కనిపించిందన్నారు. కేవలం బెడ్లు, ఆక్సిజన్‌ సదుపాయాల్లేక లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం చూశామన్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాలతో ప్రజలందరికీ వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావన్న విషయం అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ పథకాలు కార్పొరేట్‌ సంస్థలు ఆసుపత్రులు ఆర్థికంగా బలపడటానికి ఉపయోగపడతాయి తప్ప ప్రజలకు ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. డాక్టర్‌ గోపాలం మాట్లాడుతూ ప్రజలందరికీ ఆరోగ్యం హక్కుగా ఉండాలన్నా, వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావాలన్నా కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లో కనీసం 5 శాతం ఆరోగ్య రంగానికి నిధులు కేటాయించాలని, నిత్యావసర, అత్యవసర మందులు, వైద్య పరికరాలపై జీఎస్టీనీ పూర్తిగా ఎత్తివేయాలని అన్నారు. ప్రభుత్వ రంగంలో ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలను పునరుద్ధరించాలని కోరారు. ప్రతి 1000 మందికి కనీసం ఒక డాక్టర్‌ ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తుండగా దేశంలో 1665 మందికి ఒక డాక్టరు అందుబాటులో ఉన్నారని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య శిబిరాల్లో 26 శాతం డాక్టర్లు కొరత ఉందని చెప్పారు. ఆరోగ్యాన్ని వైద్యాన్ని ప్రజలందరికీ హక్కుగా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య వేదిక నాయకులు పిఎస్‌.శేఖర్‌ రెడ్డి, జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య పరిరక్షణ జిల్లా కార్యదర్శి హనుమంతురావు, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు అన్నమ్మ, ఇన్సూరెన్స్‌ రంగం నాయకులు వి.వి.కె.సురేష్‌ పాల్గొన్నారు.