Feb 07,2023 22:45

ప్రజాశక్తి - చింతలపూడి
           కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైతాంగ వ్యతిరేకమని, దీనివల్ల చిన్న, సన్నకార రైతులకు ఎలాంటి ప్రయోజనమూ లేదని సిపిఎం మండల కార్యదర్శి ఆర్‌విఎస్‌ నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.వసంతరావు అన్నారు. చింతలపూడిలో మంగళవారం సిపిఐ కార్యాలయంలో రైతు సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం ఎస్‌కె కాలేషా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో రైతులకు ఒరిగింది శూన్యమన్నారు. రైతులకు మోడీ ఇచ్చిన హామీల అమలుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. పంటలకు మద్దతు ధర కల్పనకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు. రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ రాయకుల లక్ష్మణరావు, ఎఐకెఎస్‌ జిల్లా అధ్యక్షులు డి.రంగనాథ్‌ మాట్లాడుతూ రైతుల సమస్యల పట్టని ఈ బడ్జెట్‌ కార్పొరేట్‌ కంపెనీలకు వరంగా ఉందన్నారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి తోర్లపాటి బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బోడ వజ్రం, ఎం.లాజరు, తాడిగడప మాణిక్యాలరావు, అక్కినేని వెంకటేశ్వరరావు, ఆలపాటి రామచంద్రరావు, టి.ప్రసాద్‌ పాల్గొన్నారు.