ప్రజాశక్తి- కె.కోటపాడు
కేంద్ర బిజెపి ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి చూపించిందని సిపిఎం నాయకులు గండి నాయినబాబు, రొంగలి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయం గురువారం వారు విలేకర్లతో మాట్లాడుతూ విభజన హామీలైన పోలవరం ప్రాజెక్టు, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా వంటి విషయాలను కేంద్రం విస్మరించడం దారుణమన్నారు. ధాన్యం సేకరణకు ఐదు శాతం కోత విధించడం, ఎరువులు సబ్సిడీ రూ.50.400 కోట్లకు కుదించడం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. ప్రజాసంఘాల మండల జిల్లా కన్వీనర్ ఎర్ర దేవుడు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవన్నారు. ఉపాధి హామీకి రూ.30వేల కోట్లు కోత విధించడం దుర్మార్గమన్నారు. ఈ సమావేశంలో రైతు నాయకులు వనము సూర్యనారాయణ, కెవిపిఎస్ జిల్లా నాయకులు గాడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
అనకాపల్లి : రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా, నిధులు, విభజన హామీల అమలు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేంద్రానికి తాకట్టు పెట్టారని టిడిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు విమర్శించారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ అధిక ధరలు, నిరుద్యోగం, ఆర్థిక మందగమనం వంటి అంశాల్లో కేంద్ర బడ్జెట్ సామాన్యులకు ఉపయోగకరంగా లేకపోయినా ముఖ్యమంత్రికి ప్రశ్నించే ధైర్యం లేదన్నారు. అధికార పార్టీకి 31 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి న్యాయం చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సిబిఐ, ఈడి కేసులు, వివేకానందరెడ్డి హత్య కేసు తప్పించుకునేందుకు జగన్‌రెడ్డి మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. గతేడాది కంటే వ్యవసాయ రంగానికి రూ.28 వేల కోట్ల కోత విధించారని, లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలను బడ్జెట్ విస్మరించిందని తెలిపారు. లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చిన కేంద్రం అన్నం పెట్టే రైతన్నకు రుణమాఫీ చేసేందుకు ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. సమావేశంలో టిడిప నాయకులు లాలం కాశీనాయుడు పాల్గొన్నారు.
పేద, బడుగు బలహీన వర్గాలకు ఉపయోగం లేని బడ్జెట్
కేంద్ర బడ్జెట్ పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగకరంగా లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కోన లక్ష్మణ విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధంగాను, పేద మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపేదిగా ఇది ఉందని తెలిపారు. ఉపాధి హామీకి నిధులు కోత విధించడం దారుణమన్నారు.
రైతుల ప్రస్తావన లేని బడ్జెట్
కేంద్ర బడ్జెట్లో రైతులకు రాయితీలు, రైతుల ప్రయోజనకర అంశాలు లేకపోవడం బాధాకరమని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విల్లూరి పైడారావు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు వంటి అంశాలను విస్మరించడం దుర్మార్గమన్నారు.










