Feb 24,2023 23:01

సిపిఎం ఆధ్వర్యాన నిరసనలు
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం

               కేంద్ర బడ్జెట్‌ వల్ల పేదలకు ఒరిగింది శూన్యమని, అలాగే ఆదానీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బ్యాంకుల నుండి తీసుకున్న లక్షల కోట్ల రూపాయలు తిరిగి కట్టించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్‌ తెలిపారు. శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో ఆదానీ కుంభకోణాలపై సమగ్ర విచారణ కోరుతూ స్థానిక ఏలూరు రోడ్‌లోని సిపిఎం కార్యాలయం ఎదురుగా ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి.రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ భారతదేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ సంస్థలకు దాసోహమై దేశ సంపదను దోచి పెడుతున్నారన్నారు. అదే కోవకు చెందిన ఆదానీ భారతదేశంలోని అత్యంత సంపన్నుడిగా ఎదిగిన వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 2002లో మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆదానీ మోడీ మధ్య సంబంధాలు మొదలయ్యాయని, ఆ సంబంధాలతో దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థలను, దేశ సంపదను దాసోహం చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఆదాని గుప్పెట్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.వేలకోట్ల రుణాలను తిరిగి కట్టించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నిరంతరం దేశభక్తితో మాట్లాడుతున్న మోడీషా ఈ దేశ ప్రజలపై పెనుభారాలు మోపుతూ దేశ సంపదను కొంతమందికి దోచిపెట్టడం, దేశభక్తా అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి, రైతులకు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల ఊసే లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు టి.దుర్గారావు, టి.నాగమణి, జి.వెంకట్రావు, టి.సత్యనారాయణ, ఎం.జీవరత్నం, బి.రాంబాబు, పసల సూర్యారావు, ఎస్‌కె.సుభాషిని, కె.భాస్కర్‌, జి.సూర్యకిరణ్‌ పాల్గొన్నారు.
ఏలూరు:కేంద్ర బడ్జెట్‌ ప్రజావ్యతిరేక బడ్జెట్‌ అని, అలాగే కేంద్ర ప్రభుత్వం అదానీ కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఆయన చేతిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను వెనక్కి తీసుకుని ఆస్తులు జప్తు చేయాలని సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పళ్లెం కిషోర్‌ డిమాండ్‌ చేశారు. సిపిఎం రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌లో పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి.కిషోర్‌ మాట్లాడుతూ హిండెన్‌ బర్గ్‌ సంస్థ అదానీ అవినీతి, అక్రమాల కుంభకోణం వెలుగులోకి తీసుకొచ్చింన్నారు. అదానీ కుంభకోణం వల్ల షేర్‌ మార్కెట్‌లో రూ.5.60 లక్షల కోట్లు ఆవిరైపోయాయన్నారు. మధ్యతరగతి మదుపరులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. గుజరాత్‌ రాష్ట్రంలో వజ్రాలవ్యాపారిగా అదానీ ఉండేవాడని, గుజరాత్‌ గోద్రా అల్లర్లతో అప్పటి ముఖ్యమంత్రి మోడీకి ఇబ్బందులు వస్తున్న తరుణంలో అదానీ పెట్టుబడిదారులను కూడగట్టి ఎన్నికల్లో మోడీకి మద్దతుగా నిలిచారన్నారు. దానికి మోడీ కృతజ్ఞతగా అదానీ డొల్ల కంపెనీలకు ప్రభుత్వాల నుండి రాయితీలు ఇప్పించడం మొదలు పెట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి నుండి నేడు ప్రధాని అయిన వరకూ మోడీ గౌతమ్‌ అదానీకి చెందిన కంపెనీలకు ప్రభుత్వ రాయితీలు అందిస్తూనే ఉన్నారన్నారు. అదానీ సంస్థలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయించడం, అదానీకి ప్రభుత్వ రంగసంస్థలు కట్టబెట్టడం వల్ల ఆయన నేడు ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో ఎగ బకారూ అన్నారు. మోడీ ప్రధాని కాక ముందు గౌతమ్‌ అదానీ ఆస్తుల విలువ రూ.50 వేల కోట్లు ఉంటే, నేడు రూ.10.60 లక్షల కోట్లకు పెరిగిందంటే మోడీ ప్రభుత్వం ప్రజాసంపదను ఎలా దోచిపెట్టిందో ఆలోచించవచ్చన్నారు. దేశంలో విమానాశ్రయాలు మొదలుకొని విద్యుత్‌ సంస్థలు, బొగ్గు గనులు, పోర్టులు, ఓడ రేవుల వరకూ ప్రభుత్వ సంస్థలను అదానీకి కట్టబెడుతున్నారని విమర్శించారు. అదానీ లేని కంపెనీలు ఉన్నట్లు చూపించి, షేర్‌ మార్కెట్లో ఎలా మాయాజాలం చేశారో హిండేన్‌ బర్గ్‌ నివేదిక స్పష్టం చేసింన్నారు. అదానీ సంస్థలకు బ్యాంకు రుణాలు ఇవ్వడం వల్ల మొండి బాకీలు పెరిగి, బ్యాంకులు దివాళా తీస్తున్నాయన్నారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పివి.రామకృష్ణ, నగర నాయకులు వి.సాయిబాబు, బి.జగన్నాధరావు, వివివిఎన్‌.ప్రసాద్‌, జె.గోపి, మావూరి శ్రీనివాసరావు, జి.యేసుబాబు, కోటేశ్వరరావు, ఎస్‌.సత్యనారాయణ, ఎం.సత్యనారాయణ, చల్లా పైడియ్య, నరసింహమూర్తి, బ్రహ్మం, సీతయ్య పాల్గొన్నారు.
నూజివీడు : కేంద్ర బడ్జెట్‌కి వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో నూజివీడు చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎన్‌ఆర్‌.హనుమాన్‌, నాయకులు మరియదాస్‌, పద్మాంజలి, రామకృష్ణ, వసంతరావు, శ్రీనివాసరావు, ఏసుదాస్‌, మనోహర్‌ పాల్గొన్నారు.