'పోలవరం' ఊసే కరువు
నిట్‌కు నిధుల కేటాయింపు నిల్
రైల్వేలైన్లపై కొరవడిన స్పష్టత
వ్యవసాయానికి దక్కని అండ
మద్దతు ధరపై కనీస ప్రస్తావన నిల్
వేతన జీవులకు ఆదాయ పన్నులో ఊరట
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
కేంద్ర బడ్జెట్ జిల్లావాసులను తీవ్ర నిరాశపర్చింది. బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్‌లో జిల్లాలోని కేంద్ర ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుగాని, వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచే చర్యలుగాని కానరాలేదు. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఊసే లేకుండాపోయింది. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ఆమోదంపై సైతం బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. నాబార్డు ద్వారా నిధుల కేటాయింపు జరిగినా బడ్జెట్‌లో పోలవరం గురించి ప్రస్తావించేవారు. అయితే ఈ సారి ఆ ఊసే లేకుండాపోయింది. దీంతో పోలవరం నిర్వాసితుల గురించి కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం లేదని స్పష్టంగా తెలుస్తోంది. జిల్లాలో దాదాపు 126 గ్రామాలకు చెందిన 25 వేల నిర్వాసిత కుటుంబాలను తరలించాల్సి ఉంది. ఇప్పటి వరకూ నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం, పునరావాస ప్యాకేజీ, యువతకు పరిహారం ఏఒక్కటీ ఇవ్వలేదు. కేంద్రం నిధులిస్తే తప్ప 45.75 కాంటూరు వరకూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రూ.30 వేల కోట్లు పనులు, పునరావాసం కోసం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. అయితే ఈ బడ్జెట్‌లో పోలవరానికి సంబంధించి నిధుల ప్రస్తావన లేకపోవడం చూస్తే నిర్వాసితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయనున్నట్లు అర్థమవుతోంది. జిల్లాలోని కేంద్ర విద్యాసంస్థ నిట్‌కు సైతం నిధుల కేటాయింపులు ఎక్కడా కన్పించలేదు.
హైదరాబాద్ ఐఐటి, పెట్రోలియం యూనివర్సిటీ ఇలా కొన్ని సంస్థలకు నిధుల కేటాయింపుపై స్పష్టత ఇచ్చినప్పటికీ ఎపి నిట్‌కు సంబంధించి నిధుల కేటాయింపుపై మాత్రం బడ్జెట్‌లో పేర్కొనలేదు. రెండో ఫేజ్ పనులు సాగాలంటే ఈ ఏడాది దాదాపు రూ.230 కోట్లు వరకూ అవసరమని ఎపి నిట్ యాజమాన్యం కేంద్రానికి నివేదించింది. బడ్జెట్‌లో మాత్రం నిధుల ప్రస్తావన ఎక్కడా కన్పించలేదు.
రైల్వేలైన్లపై కొరవడిన స్పష్టత
జిల్లాలో కొవ్వూరు-భద్రాచలం, కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్లకు సంబంధించి నిధుల కేటాయింపుపై బడ్జెట్ ఎక్కడా స్పష్టత లేదు. కొవ్వూరు-సత్తుపల్లి రైల్వేలైన్ మార్పు గురించి మాట్లాడని పరిస్థితి. రైల్వేకు రూ.రెండు లక్షల కోట్లకుపైగా కేటాయించినట్లు ప్రకటించడం మినహా వివరాలు మాత్రం తెలియని పరిస్థితి. దీంతో జిల్లాలోని రైల్వేలైన్లకు నిధుల కేటాయింపు జరిగాయా లేదా అనే దానిపై అయోమయం నెలకొంది. రైల్వే అధికారులు స్పష్టత ఇస్తే తప్ప నిధులు వేటికి కేటాయించారో తెలియని పరిస్థితి. దీంతో జిల్లావాసుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
వ్యవసాయానికి దక్కని అండ
జిల్లాలో 80 శాతం ప్రజానీకం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, పండిన పంటకు కనీస మద్దతు ధర దక్కకపోవడంతో వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోతుంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి మాటలు చెప్పడం మినహా ఆచరణలో ఏమీ కన్పించలేదు. కనీస మద్దతు ధరకు సంబంధించి చట్టం చేయాలని రైతులు, రైతుసంఘాలు పెద్దఎత్తున పోరాటం చేస్తున్నాయి. ఎక్కడా మద్దతు ధరపై ప్రస్తావన లేకుండాపోయింది. రైతులు ధరలేక నష్టపోతే తీసుకునే చర్యల గురించి మాట్లాడలేదు. పిఎం కిసాన్ సమ్మన్ నిధి కింద ఏడాదికి రైతులకు కేంద్రం రూ.ఆరు వేలు ఇస్తోంది. వ్యవసాయ పెట్టుబడులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కిసాన్ సమ్మన్ నిధి సొమ్ము పెంచాలని రైతులు కోరుతున్నారు. బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. వ్యవసాయ రంగానికి, ఉపాధిహామీకి సైతం నిధులు కోతపెట్టారు. ఆక్వా రంగం అభివృద్ధికి సంబంధించి మత్స్యసంపద యోజన కింద రూ.ఆరు వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆక్వా రైతులకు అది ఏమూలకూ సరిపోని పరిస్థితి.
వేతన జీవులకు ఊరట
ఆదాయపు పన్నుకు సంబంధించి వేతన జీవులకు ఊరట లభించింది. రూ.ఏడు లక్షల్లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు కల్పించారు. రూ.ఏడు లక్షలకు మించి ఆదాయం దాటితే మాత్రం రూ.మూడు లక్షల వరకూ మాత్రమే పన్ను మినహాయింపు ఇచ్చింది. రూ.మూడు నుంచి రూ.ఆరు లక్షల వరకూ ఐదుశాతం పన్ను, రూ.ఆరు నుంచి రూ.తొమ్మిది లక్షల వరకూ పదిశాతం పన్ను, రూ.తొమ్మిది నుంచి రూ.12 లక్షల వరకూ 15 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ 20 శాతం పన్ను, రూ.15 లక్షలపైన 30 శాతం పన్ను ఉండనుంది. ప్రస్తుత మార్పులతో జిల్లాలో పన్ను చెల్లింపుదారులైన సుమారు 90 వేల మందికి కొంత ఊరట లభించే అవకాశం ఉందని అంచనా.
ధరలు పెరిగే వస్తువులు
బంగారం, ప్లాటినంతో తయారు చేసే ఆభరణాలు, సిగరెట్లు, గిల్టు నగలు, వంటగదిలో ఉపయోగించే ఎలక్ట్రిక్ చిమ్నీలు, సైకిళ్లు, ఆట వస్తువులు
ధరలు తగ్గే వస్తువులు
హీట్ కాయిల్స్, మొబైల్ భాగాలు, ల్యాప్‌టాప్, కెమెరా లెన్స్‌లు, టీవీ ప్యానల్ భాగాలు, లిథియం, ఆయాన్ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాలు










