మాజీ, ప్రస్తుత ప్రాంతీయ పాలక పార్టీలకు మాత్రం వాటి మధ్య వివాదాలే ముఖ్యం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మడిగా పోరాడటమనే ప్రసక్తి లేకుండా పోయింది. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన, రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ, పోలవరం నిధులు ఒకటంటే ఒక్కటైనా ముందుకు నడిచింది లేకపోగా మరింత కోత కోయడం పరిపాటిగా మారింది. వీరిద్దరి మధ్యన బిజెపి తాడూ బొంగరం లేని బడాయి కబుర్లతో మాయ చేస్తుంటే జనసేన నేతలు పక్క తాళం వేస్తుంటారు. ఇరు పార్టీల నేతలు పార్లమెంటులో చేసిన ప్రసంగాలు చూస్తే సవినయ వినతులు రాష్ట్రానికి జరిగిన, జరుగుతున్న అన్యాయాల ముందు నిలిచేవి కావు.
తెలుగు పజల పోరాట ఫలం, భారత దేశానికే గర్వకారణమైన విశాఖ ఉక్కు కర్మాగారం వంద శాతం ప్రైవేటుపరం చేయాలని కేంద్రం లోని మోడీ ప్రభుత్వం చేసిన నిర్ణయంపై రాష్ట్రమంతటా రాజకీయ అలజడి మొదలైంది. కాని రాష్ట్రాన్ని పాలించే పార్టీకి, అందులోనూ నేరుగా రాష్ట్రాధినేత వై.ఎస్ జగన్ కుటుంబానికి సంబంధించిన ప్రముఖ పత్రికలో నిన్న ఆ ఊసే లేదు. పైగా విజయవాడలో సిపిఎం చొరవతో జరిగిన అఖిలపక్ష సమావేశం వార్త సింగిల్ కాలమ్‌లో లోపలి పేజీల్లో దర్శనమిస్తోంది. టిడిపి ని బలపర్చేదిగా పేరున్న మరో పత్రికలో ఈ వార్త ఇస్తూనే రాష్ట్రంలో పాలక పార్టీ పైనే దాడి కేంద్రీకరించడం వారి ఇరకాటాన్ని చెప్పడం ముఖ్యంగా గోచరిస్తుంది. ఇక ఇటీవల రోజూ వివాదాస్పద వ్యాఖ్యలతో విరుద్ధ సంకేతాలిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బృందం షరా మామూలుగా ఈ విషయంలోనూ సన్నాయి నొక్కులతో సంతృప్తిపర్చే ప్రయత్నం చేసింది. గతంలో తెలుగుదేశం తరపున కేంద్ర మంత్రివర్గంలో వుండి ప్రత్యేక ప్యాకేజీ మిథ్యను మింగించడంలో తలమునకలైన ఎం.పి సుజనా చౌదరి వంటి వారు ఇప్పుడు బిజెపి ప్రతినిధిగా బేషరతుగా విశాఖ ఉక్కు అమ్మకాన్ని సమర్థిస్తున్నారు. గతంలో కమ్యూనిస్టుల సాహచర్యంలో ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకించిన జనసేన నేతలు ఇప్పుడు లాంచనంగా వ్యతిరేకిస్తున్నా బిజెపి తో బంధం నోరు నొక్కుతున్నది. విశాఖను పాలనా రాజధాని చేయడం ద్వారా ఏదో ఒరగబెడతామని ఊదరగొట్టిన వైసిపి ప్రభుత్వం, దాని నెత్తిపై కూచుని స్వారీ చేస్తున్న కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీకే ఎసరుపెట్టడం పట్ల ఆగ్రహావేశాలు ప్రజ్వరిల్లుతున్నాయి.
నిజమైన హెచ్చరికలు, అవకాశవాద పాలకులు
వామపక్షాలకు, కార్మిక సంఘాలకు సంబంధించినంత వరకూ ఇది ఊహించని పరిణామం ఎంత మాత్రం కాదు. అయితే 90వ దశకం తర్వాత వచ్చిన సరళీకరణ విధానాలు ఇందుకు మూలం కాగా గతంలో పాలించిన టిడిపి ప్రభుత్వం గాని ఇప్పటి వైసిపి గాని ఇందుకు సహకరించకపోగా కార్పొరేట్లకే అంటకాగడం కేంద్రానికి కొమ్ములు తెచ్చింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అధికారికంగా గుర్తింపు పొందిన సిఐటియు సంఘం ఎప్పటి నుంచో ఈ ప్రమాదం ముంచుకొస్తుందని హెచ్చరిస్తూనే వుంది. నిరసన కార్యక్రమాలు, ఉద్యమాలు సాగించింది. ప్రచురణలు చేసింది. మొదటి నుంచి సంస్థతో సంబంధం వున్న సిహెచ్ నరసింగరావు, గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు అయోధ్యరామ్ వంటి వారు వివిధ రూపాలలో పోరాడుతూనే వున్నారు. వామపక్ష ఎం.పి లు జాతీయ నాయకులు కూడా విశాఖ సందర్శించి మొత్తంగా ప్రభుత్వ రంగ రక్షణ కోసం అనేక విధాలుగా పాలుపంచుకున్నారు. యుపిఎ 1 హయాంలో కొన్ని కోర్కెలు సాధించి ఇప్పటి దాకా నడిపించేందుకు ప్రాతిపదిక వేశారు. కాని ప్రభుత్వ సంస్థలను ప్రజా వనరులను శరవేగంగా కార్పొరేట్లకు కట్టబెట్టడమే కర్తవ్యంగా పెట్టుకున్న మోడీ సర్కారు విశాఖ ఉక్కును లక్ష్యంగా చేసుకోవడంలో ఆశ్చర్యం లేదు. అందులోనూ మోడీకి సన్నిహితుడైన అదానీతో సహా అనేక జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజాలు దీనిపై కన్నేసి వున్నాయి. గతంలోనే దక్షిణ కొరియాకు చెందిన 'పోస్కో' రంగం లోకి దిగిపోయింది. కార్మికుల నిరసన కారణంగా పోసుకోలు కబుర్లతో భూమిని మాత్రం తీసుకుని అదే ప్రాంగణంలో కార్యాలయం కూడా ఏర్పాటు చేయడంతో విషయం విదితమైంది. 'పోస్కో'తో వైసిపి ఎం.పి విజయసాయి రెడ్డి మంతనాలు జరపడమే గాక వారి ప్రతినిధి వర్గం ముఖ్యమంత్రిని కూడా కలుసుకుంది. కడపలో ఉక్కు ప్యాక్టరీ ఏర్పాటు చేయవలసిందిగా ఆయన కోరినా వారి చూపంతా బంగారు బాతు లాంటి విశాఖ ఉక్కు పైనే వుందని ప్రభుత్వ పెద్దలే అప్పట్లో చెప్పారు. అప్పట్లో వున్నది వాటాల ఉపసంహరణ కాగా ఇప్పుడు నూరు శాతం అమ్మకం అంటే విశాఖ కర్మాగారం ఎ.పి చేతుల్లోంచి జారిపోతుందన్నమాట. విశాఖ రైల్వే జోన్, మెట్రోకు సహకారం వంటి అనేక వాగ్దానాలు భంగం చేయడం ఒకటైతే వున్న ఉక్కు ఫ్యాక్టరీని కూడా హుళక్కి చేయడంలో కేంద్ర దురహంకారం మాటలకందేది కాదు. అయినా మాజీ, ప్రస్తుత ప్రాంతీయ పాలక పార్టీలకు మాత్రం వాటి మధ్య వివాదాలే ముఖ్యం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మడిగా పోరాడటమనే ప్రసక్తి లేకుండా పోయింది. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన, రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ, పోలవరం నిధులు ఒకటంటే ఒక్కటైనా ముందుకు నడిచింది లేకపోగా మరింత కోత కోయడం పరిపాటిగా మారింది. ఇప్పుడు కూడా వైసిపి నేతలే విశాఖను తీసుకుంటారని టిడిపి ఆరోపిస్తుంటే... వారి హయాంలోనే ఇందుకు సన్నాహం జరిగిందని వీరు తిట్టిపోస్తారు. వీరిద్దరి మధ్యన బిజెపి తాడూ బొంగరం లేని బడాయి కబుర్లతో మాయ చేస్తుంటే జనసేన నేతలు పక్క తాళం వేస్తుంటారు. ఇరు పార్టీల నేతలు పార్లమెంటులో చేసిన ప్రసంగాలు చూస్తే సవినయ వినతులు రాష్ట్రానికి జరిగిన, జరుగుతున్న అన్యాయాల ముందు నిలిచేవి కావు. రైతు వ్యతిరేక శాసనాల వంటి వాటిని మూకుమ్మడిగా బలపరుస్తున్నారు.
కేంద్రానికి వంత, ఊబిలో రాష్ట్రం
గతంలో ప్రత్యేక హోదా కోసం రౌండ్ టేబుల్ నిర్వహించిన పవన్ కళ్యాణ్‌గాని, రాష్ట్రమంతటా పర్యటించి నిరాహార దీక్షలు చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గాని, ఎన్నికల ముంగిట్లో ధర్మపోరాట ప్రహసనం నడిపిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని సూటిగా కేంద్రంపై పోట్లాడటం సంగతి అటుంచి సూటిగా మాట్లాడటం కూడా ఇంతవరకూ జరగలేదు. వారిని నేరుగా కలుసుకోవాలని విజయవాడ సమావేశం తీసుకున్న నిర్ణయం ప్రజలు నిజాలు తెలుసుకోవడానికి దోహదం చేస్తుందని ఆశించాలి. ఎవరు ఏమైనా ప్రజలు, కార్మిక ఉద్యోగులు, యువత మాత్రం కేంద్రం నిరంకుశ నిర్లక్ష్యాన్ని చిరకాలం సహించబోరని మాత్రం చెప్పొచ్చు. కర్నూలుకు హైకోర్టు తరలింపుపై తాము 2018 లోనే తీర్మానం చేశామంటూనే బాధ్యత రాష్ట్రం పైకి, హైకోర్టు పైకి నెట్టి అది కూడా కోర్టు పరిధిలో వుందని కేంద్రం తప్పుకోవడం ప్రాంతీయ వైరుధ్యాలు పెంచే పాచిక మాత్రమే. ఇప్పటి వరకూ అమరావతిపై ఆడుతున్న దాగుడుమూతలే బిజెపి హైకోర్టు మార్పు లోనూ ప్రయోగిస్తుందన్న మాట.
వాస్తవానికి విభజిత ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు సవాళ్ల వలయంలో, సమస్యల ఊబిలో వుందనేది నిస్సందేహం. అప్పులు మూడు లక్షల కోట్లు దాటిపోగా కేంద్రం నుంచి వస్తున్నది శూన్యం. వాటిని ప్రజలకు చెప్పి అప్రమత్తం చేయకపోగా అంతా అయిపోయినట్టు అవాస్తవ కథనాల కాలక్షేపం పరిపాటిగా మారింది. అన్నిటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల జపం మాత్రమే సమాధానం తప్ప విధనాల పరంగా లేదా వనరుల పరంగా ఎలాంటి సమగ్ర సమాధానం లభించడం లేదు.పైగా కేంద్రం బాటలో ప్రజలపై భారాలు (విద్యుత్, పట్టణ పన్నులు వంటివి) పెంచడం నిత్యకృత్యమైంది. రాష్ట్ర రాజధానితో సహా ప్రతిదీ ప్రతిష్టంభనలో, న్యాయ వివాదాలలో కూరుకుపోయింది. వాటిని ప్రజాస్వామికంగా పరిష్కరించుకునే బదులు కొత్త సమస్యలు సృష్టించడం అపరిపక్వతో అతి వ్యూహమో అర్ధం కాదు.
స్థానిక ఎన్నికల నిత్య వివాదం
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం, ఇప్పుడు తొలి దశ సమీపిస్తున్నా ఆయనకూ సర్కారుకూ సాగుతున్న వివాదాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. అధికార వికేంద్రీకరణ స్థానిక సమస్యల కన్నా ఈ తగాదాలే ప్రజల దృష్టిని దారి మళ్లిస్తున్నాయి. పాలక పార్టీల పాచికలు పంతాల మధ్య ప్రజల ఆకాంక్షలు, అవసరాలు మరుగునపడి పోవడం ఒకటైతే అధికార యంత్రాంగం కూడా అయోమయంలో కూరుకుపోవలసిన పరిస్థితి. మరీ ముఖ్యంగా పక్షపాతం, బలప్రయోగం అరోపణలకు గురవుతున్న పోలీసులు వివాదాలకు కేంద్రాలవుతున్న స్థితి. ఎన్నికల కమిషనర్ ఒకవైపు మంత్రులు నేతలు మరోవైపు చేసుకుంటున్న విమర్శలు ప్రకటనలు సుప్రీం కోర్టు తీర్పు స్ఫూర్తిని కూడా వమ్ము చేస్తున్నాయి. ఇంకా కొన్ని కోర్టు వాజ్యాలు కూడా నడుస్తున్నాయి. అధికార పరిధులు రాజ్యాంగ నిబంధనల గురించి కూడా అస్పష్టతను సృష్టించాయి. తమ అధ్యక్షుని అరెస్టుతో సహా కొన్ని దాడుల గురించి టిడిపి మాట్లాడుతుంటే...చంద్రబాబు ఆదేశాలతో ఎన్నికల కమిషనర్ పని చేస్తున్నట్టు పాలకపక్షం ఆరోపిస్తున్నది. ఇంత అవాంఛనీయమైన వాతావరణం గతంలో ఎన్నడూ చూసి వుండం. ఆఖరుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎన్నికలు పూర్తయ్యేవరకూ గృహనిర్బంధంలో వుంచాలని ఎస్‌ఇసి ఆదేశించడం ఈ వివాదాలకు పరాకాష్ట. మంత్రి ఈ ఆదేశాలు పాటించనక్కరలేదని అధికారులకు చెప్పడం వారికి ఇరకాటం. ఇన్నిటి మధ్యనా శాంతియుతంగా సజావుగా ఎన్నికలు పూర్తి చేసుకోవడం పెద్ద సవాలే.
ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి శల్య సారథ్యం
ఆర్‌ఎస్‌ఎస్ ప్రత్యక్ష పాత్రతో, కంచి స్వాముల ఆశీస్సులతో బుధవారం పీఠాధిపతుల సమావేశం, రాష్ట్రంలో హిందూ ధర్మం మనుగడకే ప్రమాదం ఏర్పడిందంటూ వారు తిరుపతిలో మీడియాతో మాట్లాడటం ఈ క్రమంలో మరో ఆందోళనకర పరిణామం. ఆలయాలపై దాడులు, దేవాదాయ నిధులను ఇతర మతాల కోసం వాడుతున్నారనే ఆరోపణలు, మతాంతీకరణపై అతిశయాలు ఇందులో భాగమే. ఏ మత ఛాందసమైనా కుట్రలైనా లౌకికతత్వానికి విరుద్ధమే. అయితే ఆ సాకుతో మత సామరస్యానికి పెట్టింది పేరైన ఎ.పి లో మంటలు పెట్టడమే అనుమతించరానిది. బిజెపి జనసేన తెలుగుదేశం ఈ విధమైన రాజకీయ వ్యూహాలను చేపట్టడంతో ఉద్రిక్తత పెరిగింది. ముఖ్యమంత్రితో సహా వైసిపి నేతలు టిడిపినే దీనంతటికీ కారణమని ఎదురుదాడి చేయడంతో పాటు ఆలయాల, ఆవుల ప్రదక్షిణలు పెంచడం గతంలో చెప్పుకున్నాం. ఈ వ్యూహాలకు ప్రజల నుంచి పెద్ద స్పందన లేకపోవడం, పోలీసులు కొంతమందిని అరెస్టు చేసి కొన్ని కుట్రలు వెల్లడించడం కొంత మెరుగే. ఈ సమయంలో మరోసారి ఢిల్లీ స్థాయిలో బిజెపి నేతలు వీటిని ఆయుధాలుగా చేసుకున్నారు. టిడిపి నేతలు కూడా వెళ్లి ఫిర్యాదులు చేసి వచ్చారు. స్థానిక ఎన్నికలు దగ్గర పడ్డాక స్వాములే రంగం లోకి దిగారు. దీనంతటి వెనక దాగిన రాజకీయ కౌటిల్యం రాష్ట్రానికి చేటు అన్న మెళకువ ఇంకా పెంచవలసిన అవసరముంది. అనర్థదాయకమైన ఈ వివాదాల లోనే మనం మునిగి తేలుతున్నందునే కేంద్రం ఒకవైపు, రాష్ట్ర బిజెపి మరోవైపు శల్య సారథ్యం చేస్తున్నాయి. రాష్ట్ర పాలక పార్టీలు స్వప్రయోజనాల కోసం, అస్తిత్వం కోసం బిజెపి ని ప్రశ్నించలేని ప్రస్తుత స్థితిలో ప్రజలే చొరవగా ముందుకొచ్చి విశాఖ ఉక్కుతో సహా రాష్ట్రాన్ని కాపాడుకోవలసి వుంటుంది.
తెలకపల్లి రవి











