Mar 10,2022 06:55

సంక్షేమ కార్యక్రమాలకు నవరత్నాలు పేరుతో అనేక కొత్త స్కీములు ప్రకటించింది. కొన్ని పాత స్కీములకు కొత్త పేర్లు పెట్టింది. పాత స్కీములనేకం నిధుల్లేక ఆచరణలో నిష్ప్రయోజనంగా మారాయి. ముఖ్యంగా విద్య, ఉపాధి, సంక్షేమ రంగాలపై ఈ కోత పడింది. వీటికి నిధుల కేటాయింపు భారమయ్యేకొద్దీ స్కీముల అమలుకు పరిమితి విధిస్తున్నది. రకరకాల షరతులు విధించి లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తున్నది. అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బిసి సబ్‌ప్లాన్‌ నిధులకు కోత పడింది. ఉన్న నిధులు కూడా దారి మళ్ళుతున్నాయి. వివిధ కులాల కార్పొరేషన్లకు పదవులు తప్ప నిధులు లేవు. ఈ స్కీములన్నింటినీ పరిమితి విధించకుండా విస్తృతంగా అమలు చేస్తూనే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిధులు సమకూర్చాలి.

రాష్ట్ర అసెంబ్లీలో రేపు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 15 రోజులపాటు జరగనున్న బడ్జెట్‌ సమావేశాలు క్రమంగా ప్రాధాన్యతను కోల్పోతున్నాయి. కేంద్ర బడ్జెట్‌ విషయంలోనూ ఇది స్పష్టంగా కనిపించింది. రాష్ట్రం కూడా అదే బాటలో నడుస్తున్నది. బడ్జెట్‌ అంటే కేవలం జమాఖర్చుల చిట్టా మాత్రమే కాదు. ప్రభుత్వ విధానాలు, ప్రజాసంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతలు ఇందులో ప్రతిబింబిస్తాయి. అభివృద్ధి బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నది. ఈ రంగాన్ని బడా కార్పొరేట్‌ సంస్థలకు వదిలేసింది. వారికి కావలసిన సదుపాయాలు, ప్రోత్సాహం ఇవ్వడం ప్రభుత్వం తన బాధ్యతగా స్వీకరించింది. దానికే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అని పేరు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో పోటీ పడడానికి ప్రోత్సాహకాలను ఇస్తున్నది. మరోవైపు అభివృద్ధికి మూలాధారంగా ఉన్న ప్రణాళికా సంఘాన్ని కేంద్రం రద్దు చేసింది. కార్పొరేట్‌ బోర్డుల తరహాలో నీతి అయోగ్‌ను నియమించింది. గతంలో ప్రభుత్వ రంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్‌, విశాఖ, బెంగుళూరు లాంటి నగరాలు ప్రభుత్వ రంగం పునాదిగా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు నగరాల నిర్మాణాన్ని కూడా ప్రైవేటు రంగానికి వదిలేశారు. రియల్‌ ఎస్టేటే పట్టణాల అభివృద్ధిని శాసిస్తోంది. అందువల్ల బడ్జెట్‌లో అభివృద్ధి నిధులు క్రమంగా తగ్గిపోయి నిర్వహణా వ్యయాలు మాత్రమే మిగులుతున్నాయి. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు చివరిదాకా అలాగే ఉంటాయని గ్యారెంటీ కూడా లేదు. రివైజ్డ్‌ బడ్జెట్‌ పేరుతో అన్నీ తలక్రిందులవుతుంటాయి. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా నిధుల కేటాయింపులు అధికారంలో ఉన్న పార్టీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి జరుగుతున్నాయి. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే పరిణామం. ఈ బడ్జెట్‌తోనైనా ఈ ఒరవడికి స్వస్తి చెప్పాలి.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున గవర్నర్‌ ప్రసంగం పాలక పార్టీ ఆలోచనలకు అద్దం పడుతున్నది. ప్రభుత్వ పథకాల చిట్టాను ఆయన చదివేశారు. సంక్షేమ పథకాలతో ప్రజలు బ్రహ్మాండంగా జీవిస్తున్నారని, సంతృప్తికరంగా ఉన్నారని పాలక పార్టీ భ్రమల్లో ఉంది. అందువల్లే ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను గాలికి వదిలేసింది. సంక్షేమ పథకాల నిర్వహణకు అదనపు ఆదాయాలను సమకూర్చుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ ప్రభుత్వ శాఖలకు ఆదాయ కోటాలను ఇచ్చింది. డబ్బులు రాబట్టడానికి వారు ప్రజల మెడపై కత్తి పెట్టి వసూలు చేయాలని చెబుతోంది. ఈ మధ్యకాలంలో సంక్షేమ పథకాలతోపాటు ప్రజల నుండి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ''ప్రభుత్వ ధనార్జన స్కీము''లను కూడా ప్రవేశపెట్టింది. ఉదాహరణకు ఇసుక, మద్యం ధరలు పెంచడం, పాత ఇళ్ళకు ఓటిఎస్‌ వసూళ్ళు, విద్యుత్‌ ఛార్జీలు పెంచడం వగైరా. ప్రజలపై పడుతున్న అదనపు భారాల ప్రభావాన్ని ప్రభుత్వం తక్కువ అంచనా వేస్తున్నది.
ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి
     2021-22 బడ్జెట్‌ దాదాపు 2లక్షల 30 కోట్లు. అందులో 50 వేల కోట్లు అప్పులతో వచ్చే ఆదాయమే. కాగ్‌ ప్రకటించిన లెక్కల ప్రకారం 2022 జనవరి చివరి నాటికి 37 వేల కోట్లు అప్పులు తేవాల్సి ఉండగా, పరిమితిని మించి 59 వేల కోట్లు తెచ్చింది. బడ్జెట్‌లో 18 వేల కోట్లు ఈ అప్పులపై వడ్డీలకే పోతోంది. ప్రభుత్వ నిర్వహణలో అప్పులు తేవడం అనివార్యమైనప్పటికీ ఆ అప్పుల భారం ఎవరిపై పడుతుందన్నది కీలకమైన అంశం. వివిధ రకాల పేర్లతో ప్రజలపై ఈ భారాన్ని నెడుతున్నారు. కేంద్రం ద్రవ్యలోటు పరిమితిని మించి అప్పులు చేస్తున్నది. బడ్జెట్‌ లోటును పూడ్చుకోవడానికి కరెన్సీ ముద్రిస్తున్నది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగి ధరలు కొండెక్కుతున్నాయి. అదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ మార్కెట్‌ నుండి అధికవడ్డీలకు అప్పు తెచ్చుకోవాలన్నా షరతులు విధిస్తున్నది. గతంలో ప్రపంచబ్యాంకు షరతులకు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ షరతులకు తేడా ఏమీ లేదు. విద్యుత్‌ డిస్కాములు ప్రైవేట్‌ పరం చేయడం, ఆస్తిపన్ను పెంచడం, చెత్తపన్ను వేయడం, బడా కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడం వంటివి ఈ షరతుల్లో కొన్ని. ఇవన్నీ ప్రజలపై అదనపు భారాలు మోపేవే. కరోనా అనంతర కాలంలో కష్టాల్లో ఉన్న ప్రజలపై ఈ పన్ను పోటు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా అయ్యింది. తెలంగాణతో సహా బెంగాల్‌, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఫెడరల్‌ హక్కులకు విఘాతం కలిగించే ఈ షరతులను వ్యతిరేకిస్తుండగా మన రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఆమోదించడమే కాకుండా అందరికన్నా ముందు అమలు చేయడానికి పూనుకుంటున్నది.
       ప్రజలపై భారాలు వేయకుండా అదనపు ఆదాయం సమకూర్చుకునే మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇందులో ఒకటి కేంద్రం నుండి మనకు రావాల్సిన నిధులను రాబట్టుకోవడం. రెండు బడా కార్పొరేట్‌ సంస్థల నుండి అదనపు ఆదాయం రాబట్టుకోవడం. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండూ చేయడంలేదు. కేంద్రాన్ని బతిమాలుకోవడం, నిధులివ్వకపోయినా కేంద్రం షరతులకు తలొగ్గడం రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నది. బడా కార్పొరేట్‌ సంస్థల పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నది. రాయితీలిస్తున్నది. దీనివల్ల ప్రజల ఆదాయాలు పడిపోయి సంక్షేమ పథకాల ప్రభావం కూడా నామమాత్రంగా మారుతున్నది. ఆర్ధిక అసమానతలు పెరుగుతున్నాయి. తత్ఫలితంగా ప్రజల్లో అసంతృప్తి కూడా తీవ్రతరమవుతున్నది.
      ఉద్యోగుల జీతభత్యాలు పెంచడానికి డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం గవర్నర్‌ ప్రసంగంలో మాత్రం ఆర్ధిక పరిస్థితి బాగుందని పేర్కొన్నది. కాగ్‌ నివేదికలో కూడా ప్రభుత్వ ఆదాయం పెరిగినట్లు చూపించింది. ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రభుత్వ నిర్వహణలో ఎక్కడా పొదుపు చర్యలు పాటించడం లేదు.
సంక్షేమం విస్తరించాలి
      బడ్జెట్‌లో 72 వేల కోట్లు సంక్షేమ పథకాలకు అవసరమవుతున్నాయి. మిగతావి ప్రభుత్వ నిర్వహణకి సరిపోతుంది. రెవెన్యూ లోటు పూడ్చుకోవడానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హౌదా ఇవ్వకపోగా ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజి కూడా అమలు కాలేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్‌ ఖండ్‌ తరహా ప్యాకేజి ఇస్తామన్న మాట హామీలకే మిగిలిపోయింది. రాజధాని నిర్మాణానికి 8 వేల కోట్లకుగాను 5 లక్షలు మాత్రమే కేటాయించి తెలుగువారిని అవమానించింది. అయినా జగన్‌ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతి రాజధానికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించడం ద్వారా వివాదానికి స్వస్తి చెప్పాలి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదే అయినా పునరావాసానికి నిధులివ్వకుండా రాష్ట్రంపై భారం వేస్తున్నది.
       సంక్షేమ కార్యక్రమాలకు నవరత్నాలు పేరుతో అనేక కొత్త స్కీములు ప్రకటించింది. కొన్ని పాత స్కీములకు కొత్త పేర్లు పెట్టింది. పాత స్కీములనేకం నిధుల్లేక ఆచరణలో నిష్ప్రయోజనంగా మారాయి. ముఖ్యంగా విద్య, ఉపాధి, సంక్షేమ రంగాలపై ఈ కోత పడింది. వీటికి నిధుల కేటాయింపు భారమయ్యేకొద్దీ స్కీముల అమలుకు పరిమితి విధిస్తున్నది. రకరకాల షరతులు విధించి లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తున్నది. అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బిసి సబ్‌ప్లాన్‌ నిధులకు కోత పడింది. ఉన్న నిధులు కూడా దారి మళ్ళుతున్నాయి. వివిధ కులాల కార్పొరేషన్లకు పదవులు తప్ప నిధులు లేవు. ఈ స్కీములన్నింటినీ పరిమితి విధించకుండా విస్తృతంగా అమలు చేస్తూనే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిధులు సమకూర్చాలి. 54 ప్రాజెక్టులకుగాను 14 మాత్రమే పూర్తయ్యాయి. ఇవి కూడా కాలువల పని పెండింగులోనే ఉన్నాయి. ఇప్పటికే పోలవరం నిధుల్లేక నత్తనడక నడుస్తున్నది. వెలుగొండ ఒక సొరంగం పూర్తయినా నీరు విడుదల కాలేదు. హంద్రీనీవా క్రింద నీళ్ళు లేక వేరుశనగ ఎండిపోతున్నది. ఆలస్యం అయ్యేకొద్దీ ప్రాజెక్టుల నిర్మాణ ఖర్చు పెరగడమే కాకుండా రావలసిన ఉత్పత్తులను కూడా కోల్పోతాము. అందువల్ల నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేకించి వెనుకబడిన ప్రాంతాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
విద్య, వైద్యానికి ప్రాధాన్యత
       అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు - నేడు లాంటి అనేక స్కీములు ప్రకటించినా విద్యా రంగంలో వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉంది. ఈ స్కీముల పేరుతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆగిపోయింది. ఒకరింట్లో ఇద్దరు పిల్లలున్నా ఒకరికే నగదు బదిలీ అవుతోంది. విదేశీ విద్యకు ప్రోత్సాహం ఆగిపోయింది. ఎస్సీ, ఎస్టీలకు బెస్ట్‌ అవైలబుల్‌ స్కీము నిలిచిపోయింది. ఆంగ్ల మాధ్యమం ద్వారా విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భ్రమల్లో ఉంది. నూతన విద్యా విధానం పేరుతో పాఠశాలల విలీనం విద్యావకాశాలను తగ్గించి డ్రాపౌట్స్‌ను పెంచుతుంది. అంగన్‌వాడీ, ప్రాధమిక, మాధ్యమిక (0 - 8) విద్య రాజ్యాంగ హక్కు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన విద్యా విధానం ఈ హక్కుకు విఘాతం కలిగిస్తున్నది. ఈ బడ్జెట్‌లో విద్యకు కనీసం 30 శాతం కేటాయించాలి.
        కరోనా అనంతరం వైద్య రంగానికి ప్రాధాన్యత పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యులు ప్రజలను ఆదుకోవడంలో ముఖ్య పాత్ర వహిస్తాయని రుజువైంది. అనుభవం నేర్పిన పాఠాలతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలపర్చుకోవాలి. ఈ బడ్జెట్‌లో వైద్య రంగానికి నిధులు హెచ్చించాలి. జిల్లాకొక మెడికల్‌ కాలేజి ఆచరణకు రాలేదు. దాని కన్నా ఎయిర్‌ పోర్టులకు ప్రాధాన్యతనివ్వడం కార్పొరేట్ల కోసమే.
పారిశ్రామికాభివృద్ధి - ప్రభుత్వ రంగం
       ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో ప్రైవేటు రంగం ఏ మాత్రం అభివృద్ధిని సాధించడం లేదు. పైగా అభివృద్ధికి ఆటంకంగా మారి సంక్షోభానికి ప్రైవేటు రంగమే కారణం అవుతున్నది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలువరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తన శక్తిని, పలుకుబడిని ఉపయోగించాలి. అదే సమయంలో కృష్ణపట్నం, జెన్‌కో ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలి. రాష్ట్ర వనరులపై అదానీ లాంటి ప్రైవేటు కంపెనీల అదుపు పెరిగేకొద్దీ రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుంది. ఎస్‌ఈజెడ్‌, పారిశ్రామిక కారిడార్ల పేరుతో రైతుల నుండి బలవంతంగా గుంజుకున్న లక్షలాది ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని వెంటనే వినియోగంలోకి తేవడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి బడ్జెట్‌లో ప్రకటించాలి.
గ్రామీణాభివృద్ధి - సహకార రంగం
        వ్యవసాయంలో ఉచిత విద్యుత్‌కు ఎసరొచ్చింది. వెంటనే భారం పడకపోయినా మోటార్లకు మీటర్లు బిగింపు రైతుల మెడపై కత్తి వేలాడదీయడమే. ఇందుకోసం వేలకోట్లు ఖర్చు పెట్టడం మీటర్ల తయారీ కంపెనీలకు ఆదుకోవడానికే పనికి వస్తుంది. వెనుకబడిన ప్రాంతాలలో తుంపర, బిందు సేద్యానికిచ్చే సబ్సిడీలు, ఇన్‌పుట్‌ సబ్సిడీలు ఆగిపోయాయి. వీటిని పునరుద్ధరించాలి. రైతు భరోసా కేంద్రాలు అలంకార ప్రాయం కాకుండా గిట్టుబాటు ధర, ఆధునిక సేద్య పద్ధతులకు సహాయ పడే కేంద్రాలుగా ఉండాలి. సహకార డైరీలు, చక్కెర పరిశ్రమ సంక్షోభంలో ఉన్నాయి. అమూల్‌ లాంటి వాటిని రాష్ట్రంపై రుద్దడం నష్టదాయకం. దానికి బదులుగా సహకార రంగాన్ని బలపరిచేందుకు నిధులు కేటాయించాలి.
    జగనన్న గృహ నిర్మాణ ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. పేదలపై ఆ భారం వేయడం సబబు కాదు. ఈ బడ్జెట్‌లో గృహ నిర్మాణ వ్యయం పెంచి ఓటిఎస్‌ లాంటి పేదలపై భారాలు వేసే స్కీముల్ని రద్దు చేయాలి. గ్రామీణాభివృద్ధి నిధులు పెరగాలి. గ్రామీణ రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. వాటిని తక్షణం మరమ్మత్తులు చేయడానికి నిధులు కేటాయించాలి.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాస్వామ్య స్పూర్తి
      ఈ బడ్జెట్‌ సమావేశాలు నామమాత్రం కాకూడదు. అసెంబ్లీ, శాసనమండలిలో చర్చలు సమగ్రంగా జరగాలి. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం చట్ట సభల్ని వాడుకోవడాన్ని ప్రజలు తిరస్కరించాలి. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రతిపక్షాల గొంతు నొక్కేసే పద్ధతులకు అధికార పార్టీ స్వస్తి చెప్పాలి. ప్రతి అధికార పార్టీ మరోసారి ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాల్సి వుంటుందన్న స్పృహతో వ్యవహరించాలి. ఈ బడ్జెట్‌లో ప్రజాసంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత నివ్వాలని ప్రజలు ఆశిస్తున్నారు.

                             భారత్‌- చైనా సంబంధాలు,           వి. శ్రీనివాసరావు - సిపిఎం రాష్ర్ట కార్యదర్శి