May 17,2023 22:17

ఒకేచోట రెండేళ్లు పూర్తయిన వారికి బదిలీ అవకాశం
రెండు జిల్లాల్లో 48 వేల మంది ఉద్యోగులు
బదిలీల్లో 20 శాతం ఉద్యోగులు కదిలే పరిస్థితి
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకూ బదిలీల ప్రక్రియ జరగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకే స్థానంంలో ఐదేళ్లు పని చేసేవారికి తప్పనిసరిగా బదిలీలు ఉండగా, రెండేళ్ల కాలం పూర్తి చేసుకున్న వారు వారి ఇష్టం మేరకు బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో రెవెన్యూ, ఎన్‌జిఒలతోపాటు వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు 48 వేల మంది వరకూ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. బదిలీల్లో భాగంగా 15 నుంచి 20 శాతం మంది ఉద్యోగులకు స్థాన చలనం కలగనుందని చెబుతున్నారు. గత ఎన్నికల తర్వాత తహశీల్దార్లు వివిధ జిల్లాల నుంచి జిల్లాకు వచ్చారు. వీరికి ఐదేళ్ల కాలం పూర్తి కాలేదు. ఇటువంటి వారికి వారు కోరుకుంటేనే బదిలీ ఉంటుంది. బదిలీల ప్రక్రియకు గ్రీన్‌ సిగల్‌ రావడంతో ఎప్పటినుంచో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల్లో హడావుడి మొదలైంది. తాము కోరుకున్న స్థానాలకు, సొంతూరుకు దగ్గర్లోకి వెళ్లేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.