ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు డిప్యూటీ కలెక్టర్లు ఆదివారం బదిలీ అయ్యారు. జిల్లాలో వివిధ శాఖలకు జిల్లా స్థాయి అధికారులుగా పలువురు డిప్యూటీ కలెక్లర్లు రానున్నారు. సార్వత్రిక ఎన్నికలకు కొంత సమయం ఉన్నా ప్రస్తుతం ఓటర్ల జాబితాలల్లో సవరణలు, మార్పులు, చేర్పుల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో బదిలీలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ప్రతిపాదించిన వారే ఎక్కువగా బదిలీ అయ్యారు.
అంతేగాక ప్రస్తుతం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న వారూ బదిలీ అయ్యారు. త్వరలో ముసాయిదా జాబితాలను ప్రచురించనున్న నేపథ్యంలో ఎక్కువ మంది అధికారులను బదిలీ చేశారు. ఇతర జిల్లాల వారిని జిల్లాకు పంపారు. వీరంతా రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్లుగా వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తూ ఇక్కడకు రానున్నారు. ఇక్కడ పనిచేస్తున్న వారు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ విభాగంలో ఉన్న బి.పెంచల ప్రభాకర్ జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీగా నియమించారు. అమలాపురం ఆర్‌డివో ఎన్‌విబిఎస్ వసంతరాయుడును జిల్లా పరిషత్ సిఈవోగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు డిప్యూటీ సిఈవో మోహనరావు ఇన్‌ఛార్జి సిఈవోగా వ్యవహరిస్తున్నారు. మునిసిపల్ పరిపాలన శాఖలో పనిచేస్తున్న కె.వెంకటేశ్వర్లును మెప్మా పీడీగా, గుంటూరు ఆర్‌డివో ప్రభాకర్‌రెడ్డిని గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా గుంటూరుకు బదిలీ చేశారు. కనిగిరి ఆర్‌డివో టి.అజరుకుమార్‌ను పల్నాడు జిల్లా కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల అమలు విభాగానికి బదిలీ చేశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ వల్లభనేని శ్రీనివాస్ పులిచింతల స్పెషల్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఉన్న ఎ.లక్ష్మీకుమారి చిన్ననీటి పారుదల ప్రాజెక్టు అధికారిగా నియమితులయ్యారు. రేపల్లె ఆర్‌డివో జె.పార్ధసారధి కృష్ణా జిల్లాలో కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల అమలు విభాగానికి బదిలీ అయ్యారు. గురజాల ఆర్‌డివో అద్దయ్యను జంగారెడ్డిగూడెం ఆర్‌డివోగా బదిలీ చేశారు.
నాలుగు రోజుల క్రితం గురటూరు, గురజాల ఆర్‌డివోలుగా ఎం.శ్రీకర్‌ను కె.వి.రమాకాంత్ రెడ్డిని నియమించారు. ఆ రోజున గుంటూరు ఆర్‌డివో ప్రభాకర్ రెడ్డి, గురజాల ఆర్‌డివో అద్దయ్యకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వారికి తాజా బదిలీల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇటీవల మున్పిపల్ కార్పొరేషన్‌లో అదనపు కమిషనర్ పెద్ది రోజా కృష్ణా జిల్లా డిఆర్‌వోగా నియమితులయ్యారు. ఓటర్ల జాబి తాలకు సంబంధించిన బాధ్యతల్లో ఉన్న వారిని ఇప్పటికే ఎక్కువ మందిని బదిలీ చేశారు.










