- యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్‌కుమార్
ప్రజాశక్తి- జలుమూరు : ఇటీవల నిర్వహించిన బదిలీల్లో వివిధ పాఠశాలలకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు క్యాడర్ స్ట్రెంత్ అప్‌డేట్ కాలేదన్న నెపతంతో జీతాలు చెల్లించకపోవడం అన్యాయమని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపతిరావు కిషోర్‌కుమార్ అన్నారు. మండలంలోని అల్లాడ, రామకృష్ణాపురం, తిమడాం, అచ్యుతాపురం, శ్రీముఖలింగం, యలమంచిలి, చల్లవానిపేట తదితర ఉన్నత పాఠశాలలను యుటిఎఫ్ బృందం శుక్రవారం పర్యటించింది. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా తీసుకునే నిర్ణయాల వల్ల అటు విద్యారంగానికి, ఇటు ఉపాధ్యాయులకు తీవ్రనష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వ విద్యారంగంలో నూతన విధానాలు ప్రవేశపెడుతున్నట్లు చెబుతున్న ప్రభుత్వం, అందుకు తగినట్లు ఉపాధ్యాయ నియామకాలు గాని, కొత్త పాఠశాలల ఏర్పాట్లు గాని చేయకుండా జిఒ నంబరు 117ను అడ్డుపెట్టి ఉన్న పాఠశాలలను ఉపాధ్యాయ పోస్టులను కుదించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పర్యటనల పేరుతో ఉపాధ్యాయులను భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. జగనన్న విద్యా కానుకలో ఇప్పటికీ కొన్ని టైటిల్స్ లేకపోవడం, పిల్లలకు సరిపడే బూట్ల సైజులు లేకపోవడంలాంటి లోటుపాట్లు ఉన్నాయని అన్నారు. అవి సరిచేయకుండా పిల్లలు వేసుకోలేదనే నేపంతో ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం సరైన పద్ధతి కాదన్నారు. దీన్ని మార్చుకోకపోతే భవిష్యత్‌లో ఆందోళనబాట పడతామని హెచ్చరించారు. సిపిఎస్ రద్దు చేయమని నాలుగేళ్లుగా పోరాటాలు చేస్తుంటే... ప్రభుత్వం మాత్రం సిపిఎస్‌ను రద్దుచేసి జిపిఎస్ అనే వింత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధం కావడానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణే యుటిఎఫ్ లక్ష్యంగా భవిష్యత్‌లో పోరాటాలు చేస్తామన్నారు.
కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.వైకుంఠరావు, జిల్లా నాయకులు డి.రాము, మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.హర్షవర్థన్, ఎం.పురుషోత్తం, మండల కోశాధికారి ఎం.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.










