Aug 02,2023 00:12

సమావేశంలో మాట్లాడుతున్న విజయసారధి

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాలు వెంటనే చెల్లించాలని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ సారథి డిమాండ్‌ చేశారు. పట్టణంలోని జెడ్‌పి పాఠశాలలో యుటిఎఫ్‌ ప్రాంతీయ శాఖల సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశానికి పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు సాంబశివరావు అధ్యక్షత వహించారు. విజయ సారథి మాట్లాడుతూ బదిలీలు జరిగి రెండు నెలలు కావస్తున్నా వారి వివరాలను జిల్లా అధికారులు సవరించి తదుపరి రాష్ట్ర స్థాయి అధికారులకు ఉత్తరాలు ఇవ్వడం ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని చెప్పారు. రెండు నెలలుగా వేతనాలు లేక ఉపాధ్యాయులు ఇబ్బందులు గురవుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కోశాధికారి జెవిబి నాయక్‌ మాట్లాడుతూ పల్నాడు ప్రాంతాల నుండి జరుగుతున్న అక్రమ డిప్యూటేషన్లు ఉపసంహరించుకోవాలని కోరారు. సిపిఎస్‌ రద్దుపై దశల వారి పోరాటంలో భాగంగా ఈనెల 12వ తేదీన జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగే నిరాహార దీక్షను ఉపాధ్యాయులు జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి బి.నాగేశ్వరరావు, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ జమాల్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ కాసిం పీరా, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, సుందర్రావు, ఆనంద్‌, భిక్షమయ్య, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు.