ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : నీరు నిల్వ చేసే సంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన రొంపిచర్ల మండలం అన్నవరంలో బుధవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుభాని, ఖాజాబి దంపులకు ఇద్దరు కుమారులు కాగా ఒక కుమారుడైన షేక్ సుభాని (4) ప్రతి రోజూ ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వెళ్తాడు. అయితే బుధవారం అంగన్వాడీ కేంద్రానికి కాకుండా స్థానిక ఎస్సీ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల వైపు వెళ్లాడు. కాలనీ వాసులు నీటి అవసరాలకు నీరు నిల్వ చేసే సంపు వద్దకు వెళ్లిన బాలుడు సంపులోపలికి తొంగి చూస్తూ కాలు జారి లోపల పడి మృతి చెందాడు. ఇదేమీ తెలియని తల్లిదండ్రులు రెండు గంటల అనంతరం తన కుమారుడు స్కూల్ నుండి ఇంటికి రాలేదని బాలుడి తల్లిదండ్రులు వెతుకుతుండగా నీటి సంపు వద్ద బాలుని చెప్పులు కనిపించాయి. పరుగున వెళ్లి సంపులో చూడగా అందులో బాలుని మృతదేహం తేలియాడుతోంది. దీంతో మృతుని కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతునికి ఒక సోదరుడు ఉన్నాడు. మృతుని కుటుంబాన్ని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు పరామర్శించారు.










