గుర్రంకొండ :బడి ఈడు పిల్లల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ గిరీష విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్‌ను తనిఖీ చేశారు. చైల్డ్ ఇన్ఫో అడ్మిషన్ ప్రోగ్రాం పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ సర్వేకి సంబంధించి ఇంటర్మీడియట్‌లో విద్యార్థులు ఎంతమంది అడ్మిషన్ పొందారు, ఇంటర్ ఫెయిలైన తిరిగి కళాశాలలో చేరిన విద్యార్థులు ఎంతమంది తదితర వివరాలపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి కళాశాలలో చైల్డ్ ఇన్ఫో అడ్మిషన్ పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి చైల్డ్ ఇన్ఫోలో నమోదు కావాలన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వేలో వాలంటీర్ ఏవిధంగా లాగిన్ అయి నమోదు చేస్తున్నాడన్న అంశాలపై కలెక్టర్ ఆరా తీస్తూ కొంత మంది విద్యార్థుల డేటాను ఓపెన్ చేసి పరిశీలించారు. 5 నుండి 18 సంవత్సరాల్లోపు బడి బయట ఉన్న పిల్లలందరూ గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వేలో కచ్చితంగా నమోదై పాఠశాలల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ చేసి చైల్డ్ ఇన్ఫో డాట్ కాంలో ఎన్‌రోల్ చేయాలన్నారు. ప్రభుత్వం పది పాసైన ప్రతి విద్యార్థి ఇంటర్‌లో ప్రవేశం పొందేల చర్యలు తీసుకుంటుందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణతులై ఇంటర్ మొదటి సంవత్సరానికి చాలా మంది విద్యార్థులు జాయిన్ కావడం లేదని కళాశాల ప్రిన్సిపాళ్లు, విద్యాశాఖ అధికారులు అడ్మిషన్ల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. జాయినైన విద్యార్థుల వివరాలను తప్పక చైల్డ్ ఇన్ఫో డాట్ కాంలో నమోదు చేయాలన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం పూర్తయిన తర్వాత ఇంకా మిగిలి ఉన్న విద్యార్థుల మీద దష్టి పెట్టి వారి తల్లిదండ్రులతో మాట్లాడి కళాశాలలో విద్యార్థులు చేరే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో డిఇఒ పురుషోత్తం, ల్యాండ్ అండ్‌హొసర్వే ఎడి జయరాజ్, ఎంఇఒ సురేంద్రబాబు, తహశీల్దార్ ఖాజాభి, ఎంపిడిఒ వెంకటేశులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










