
రాష్ట్రవ్యాప్తంగా 9,771 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను వాటికి ఒక కిలోమీటరు దూరంలోవున్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అమలులో ప్రతికూల ప్రభావాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో 35,197 ప్రాథమిక పాఠశాలలు, 4,563 ప్రాథమికోన్నత పాఠశాలలుండగా వాటిలో దాదాపు నాలుగోవంతు పాఠశాలలు తొలి దశలోనే విలీన ప్రక్రియకు గురవుతున్నాయంటే ప్రభావ తీవ్రత ఎంతలా ఉంటుందో విదితమవుతుంది. 3,4,5 తరగతులు చదివే చిన్నారులు ఇకపై పాఠశాలకు వెళ్లాలంటే ప్రతి రోజూ పోను, రాను కనీసం రెండు కిలోమీటర్ల దూరం అదనంగా నడవాలి. ఇప్పటికే చదువుతున్న ప్రాథమిక పాఠశాలకు దూరంగా నివసిస్తున్న పిల్లవాళ్లకు మరింత కష్టమవుతుంది. దీంతో చిన్నారులకు చదువు గండం తప్పదన్నమాట. మరోవైపు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్‌గా మార్చడంవల్ల ఇంకొన్ని కొత్త సమస్యలు తలెత్తుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానం (2020)ని దేశంలో అన్ని రాష్ట్రాలకంటె ముందుగా మన రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వం అటు ప్రాథమిక విద్య, ఇటు అంగన్‌వాడీ వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తోంది.
రుణమిచ్చిన ప్రపంచ బ్యాంకు ఒత్తిడితోనో లేక మరే కారణాలవల్లనో విలీన ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికార్లు ఆతృత పడుతున్నారు. అందువల్లనే ఇటీవల కిలోమీటరు దూరం (రేడియల్ డిస్టెన్స్) మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని రాష్ట్రమంతటా ఏయే పాఠశాలలను విలీనం చేయాలో ఆ జాబితాను జిల్లాలకు పంపారు. ఈ నెల 13న ఆన్‌లైన్ సమావేశంలో వాటిపై గడువులు, లక్ష్యాలనూ నిర్ణయించారు. అయితే క్షేత్రస్థాయి ఇబ్బందులు కిందినుండి వెల్లువెత్తడంతో పాఠశాలల విలీనానికి సహజ అడ్డంకులు ఉంటే వాటిని మినహాయించాలని ఐదు రోజుల వ్యవధిలోనే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సవరణ ఆదేశాలు జారీ చేయవలసివచ్చింది. విద్యార్థులు జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్‌లు, నదులు దాటి రావాల్సివస్తే అలాంటి చోట్ల విలీనం చేయవద్దని సూచించారు. అధికారులు రేడియల్ డిస్టెన్స్ ప్రాతిపదికగా తీసుకున్నందున రోడ్డు మార్గం అంతకన్నా ఎక్కువ దూరమే ఉంటుంది. ఇలాంటి సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఉర్దూ, తమిళం, కన్నడ, ఒడియా వంటివి ప్రథమ భాషగా ఉన్న ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయాలంటే విలీనం చేసుకునే పాఠశాలల్లో ఆయా భాషలుంటేనే చేయాలని, లేదంటే వీటిని విలీనం చేయొద్దని తెలిపారు. భాషా పరమైన మైనార్టీలకు చెందిన విద్యార్థులు, వారి పాఠశాలల గురించి ఉన్నతాధికార్లు తొలుత పట్టించుకోలేదన్నది స్పష్టమవుతోంది.
తాజాగా సవరణ ఆదేశాలిచ్చినా కిలోమీటర్ దూరంలోనున్న పాఠశాలల విలీనం చేయాలన్న ఉన్నతాధికార్ల 'డ్రైవ్' గట్టిగా పని చేస్తే భాషాపరమైన మైనార్టీ విద్యార్థులకు ఇక అంతే సంగతి అవుతుంది. తగినన్ని గదులు లేకపోయినా విలీనం చెయొద్దని కూడా తాజా ఉత్తర్వుల్లో ఆదేశించడం గమనార్హం. కాబట్టి విలీనానికి సంబంధించిన లెక్కలు కాగితాలపైన, కంప్యూటర్లలోనూ వేసుకోవడంతప్ప వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విదితమవుతోంది. కాబట్టి క్షేత్ర స్థాయి ఇబ్బందులను గుర్తించి, పరిస్థితిని చక్కదిద్దడానికి జిల్లా, మండల అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయకపోతే విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుంది. పాఠశాలల విలీనానికి సంబంధించిన ఇబ్బందులు ఇవి కొన్ని మాత్రమే! ఆచరణలో మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి కష్టాలే అంగన్‌వాడీ కేంద్రాల విషయంలోనూ తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం హడావుడి విలీన ప్రక్రియను నిలుపుదల చేసి ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎంఎల్సీలతో కూలంకషంగా చర్చించాలి. అందరి అభిప్రాయాలు తెలుసుకొని, వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఎవరి చదువుకూ ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన జరిపి ప్రపంచ బ్యాంకు రుణంతో నెత్తికెత్తుకున్న 'సాల్ట్' ప్రాజెక్టును విరమించుకోవడం శ్రేయస్కరం.