ప్రజాశక్తి - పంగులూరు
బడి ఈడు పిల్లలంతా బడిలోనే ఉండాలని, పిల్లలంతా చదువుకోవాలని, ఆ విధంగా ఉపాధ్యాయులు, అధికారులు చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ పీడీ, మండల ప్రత్యేక అధికారి ప్రసాద్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో ఆయన మాట్లాడారు. ఆరు నుండి 18సంవత్సరాల వయసున్న పిల్లలను అందరినీ పాఠశాలలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. నూటికి నూరు శాతం పాఠశాలలో హాజరు ఉండాలని కోరారు. ఆ వయసు పిల్లలు ఎక్కడ, ఏ పాఠశాలకు వెళ్తున్నారా లేదా, వారి ఆధార్ నెంబర్లతో సహా సేకరించాలని ప్రధానోపాధ్యాయులను కోరారు. గ్రామాలలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 30 నుండి ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. ఎంపీడీవో రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, హెచ్‌ఎంలు, అందరూ సర్వే సక్రమంగాచేసి, డ్రాప్ అవుట్ లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎంఇఒ-2 జి వీరాంజనేయులు, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.










