Oct 12,2023 21:18

బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలి
నాడు- నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయండి : కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌

బడిఈడు పిల్లలందరూ బడిలోనే ఉండేలా అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మండల విద్యాధికారులను జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులుతో కలిసి నాడు-నేడు పురోగతి, చైల్డ్‌ ఇన్ఫో లో నమోదు ప్రక్రియ, జిఈఎస్‌ సంబంధిత అంశాలపై సమగ్రశిక్ష ఏపిసి వెంకట రమణా రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయేంద్రరావులతో కలసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ మాట్లాడుతూ.. చైల్డ్‌ఇన్ఫోకు సంబంధించి వాలంటీర్ల సర్వే అయిన తర్వాత జిల్లాకు చెందిన వివరాల మేరకు బడిఈడి పిల్లలందరి వివరాలను క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే, పాఠశాలలో పూర్తిగా పరిశీలించిన అనంతరం పక్కాగా నమోదు చేయాలని తెలిపారు. చైల్డ్‌ఇన్ఫోలో నమోదైన వారిలో ఇప్పటి వరకు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్న వారు ఒక కేటగిరీ కాగా... చైల్డ్‌ఇన్ఫోలో నమోదు అయి పాఠశాలకు హాజరు కాని వారు మరొక కేటగిరీ కింద గుర్తించి పాఠశాలలకు రాని వారి పూర్తివివరాల నుసేకరించాలన్నారు. నాడు- నేడుకు సంబంధించిన పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది విధిగా పాఠశాలలను తనిఖీ చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. జిఈఆర్‌ (గ్రాస్‌ ఎన్రోల్మెంట్‌ రేషియా) లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలన్నారు.