
ప్రతి మనిషి జీవితానికి బాల్యం తొలిపొద్దులాంటిదే. ఆ పసి మనసులో పడే ముద్రలే భవితకు బాటలు వేస్తాయి. నిర్మలమైన ఆ బాల్యం ఓ అద్భుత దశ. కానీ అలాంటి బాల్యం 17 నెలలుగా చిన్నారులకు దూరమైంది. కరోనా వైరస్ వారి జీవితాలను మార్చేసింది. ఈ కాలంలో పిల్లలు నాలుగు గోడలకే పరిమితమై పంజరంలో బంధించిన పక్షుల్లా విలవిల్లాడిపోయారు. ఎట్టకేలకు బడులు తెరుచుకున్నాయి. చిన్నారుల ముఖాలు పువ్వుల్లా విప్పార్చుకున్నాయి. కొందరు చిన్నారులు మాత్రం బడికి పోవాలంటే మారాం చేశారు. కానీ ఎక్కువమంది పిల్లలు జింక పిల్లల్లా గంతులు వేసుకుంటూ బడివైపు పరుగులు తీశారు. కొన్నిచోట్ల కొందరు చిన్నారులకు కోవిడ్ రావడంతో ఆ తరగతి వరకూ.. ఎక్కువ తరగతుల్లో వస్తే ఆ స్కూళ్ల వరకూ కొన్నిరోజులు మూసేయాలని నిర్ణయించారు. కానీ ఇన్నాళ్లు వాళ్లు కోల్పోయిన బాల్యాన్ని ఎవరు తిరిగిస్తారు? సిలబస్‌లు, ర్యాంకులు నేపథ్యంలో ఉపాధ్యాయుల, విద్యార్థుల పరిస్థితి. కోవిడ్ వేళ పిల్లల భవితపై తల్లిదండ్రుల ఆందోళన ఏమిటి? వీటిపైనే ఈ ప్రత్యేక కథనం..
చిన్నారులు మంచి పౌరులుగా ఎదగాలంటే బాల్యదశలోనే వారికి విలువలతో ధైర్యాన్నీ ఇవ్వాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రధాన భూమిక పోషించాలి. కానీ నేడు పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రులకు పెను సవాల్‌గా మారింది. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. పిల్లల్లో తెలియని భయాన్ని నింపింది. వ్యాపార సంస్థలతో పాటు పాఠశాలలూ మూతపడ్డాయి. 17 నెలల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి. నేటి పాఠశాలల పరిస్థితి అందుకు అనుగుణంగా ఉందా అంటే.. ఎక్కువ శాతం లేదనే చెప్పాలి.
ఎంత మార్పో...
కరోనాకు మునుపు పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇల్లంతా సందడిగా ఉండేది. వారు చేసే అల్లరి చూడముచ్చటగా ఉండేది. కరోనా వైరస్ వ్యాపించింది అని తెలియగానే తప్పనిసరి పరిస్థితుల్లో పెద్దలే పిల్లల కాళ్లూ, చేతులకు సంకెళ్లు వేసేశారు. ఎవరి దగ్గరకు వెళ్లకూడదు. ఎవరితోనూ మాట్లాడకూడదు. ఎవరేమిచ్చినా తీసుకోకూడదు, తినకూడదు. చివరకు ఇంటి ముందైనా నిలబడకూడదు. ఇలా ఒకటేమిటి బోలెడన్ని షరతులతో చిన్నారుల స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు పెద్దలు. ఇంటి నాలుగు గోడలకే పరిమితమయ్యేలా చేశారు. అలా నవ్వులు చిందాల్సిన బాల్యం మొగ్గలోనే వసివాడిపోయింది. కరోనా భయం వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంటినే జైలులా భావించడం మొదలెట్టారు. తమలో తాము నరకయాతన అనుభవించారు. నోరువిప్పి మాట్లాడాలంటే అమ్మానాన్న తప్ప వేరే ముఖాల్ని చూసే ధైర్యమూ చేయలేకపోయారు. మూడో వ్యక్తి కనబడక మానసికంగా కుంగిపోయారు. వారెంతో ఇష్టంగా ఆడే ఇరుగుపొరుగు పిల్లలతో ఆటలాడటం కాదు కదా, కనీసం వారిని చూడటానికీ అవకాశం లేక అల్లాడిపోయారు.
ఉపాధ్యాయులకూ ఒత్తిడే...
కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంది ఉపాధ్యాయులే. ఎందరో ఉద్యోగాలను కోల్పోయి, రోడ్డున పడ్డారు. ఆకలితో అలమటించారు. భేషజాలను పక్కన పెట్టి కూలీనాలీ చేశారు. సెకండ్ వేవ్‌లో అయితే ఎన్నికల డ్యూటీలతో ఎక్కువమంది ఉపాధ్యాయులు ప్రాణాలనే కోల్పోయారు. ఎట్టకేలకు పాఠశాలలు తెరిచారు. తమకు మంచి రోజులొచ్చాయని సంతోషపడ్డారు ఉపాధ్యాయులు. కానీ కార్పొరేట్ యాజమాన్యాలు కొందరిని మాత్రమే తిరిగి పిలిచాయి. ఆన్‌లైన్ క్లాసుల్లో ఎక్కడ నుంచి సిలబస్‌లు ఆపేశారో అక్కడి నుంచే మొదలెట్టాలని ఉపాధ్యాయులను పురమాయించాయి. దాంతో సిలబస్‌లు త్వరగా ముగించాలని, క్లాసు రూముల్లోనే ఉరుకులు పరుగులు తీస్తున్నారు టీచర్లు. బయట ప్రపంచంలో ఏమి జరిగిందో, దాని పర్యవసానాలు ఏమిటో వాటితో నిమిత్తం లేకుండా సిలబస్ ముగించాలనే ఉద్దేశ్యంతోనే ఉన్నారు. విద్యార్థులకు పరీక్షల్లో వచ్చే మార్కులే వారి విజయానికి కొలబద్ధ అంటున్నారు. తెలిసిన జ్ఞానమంతా విద్యార్థులపై రుద్దే ప్రయత్నంలో మునిగి తేలుతున్నారు మరికొందరు. అలాగని గొప్ప ఉపాధ్యాయులు లేరని కాదు. విద్య అంటే సిలబస్‌లు పూర్తి చేసి, పరీక్షలకు సిద్ధం చేయడం మాత్రమే కాదని.. అంతకు మించి ఉందని భావించే ఉపాధ్యాయులూ ఉన్నారు. ఇన్నాళ్ల తర్వాత పాఠశాలలు తెరిచారు. ప్రస్తుతం పిల్లల మానసిక పరిస్థితికి తగ్గట్టు.. వారు తాము చెప్పే పాఠాలను అర్థం చేసుకోగలుగుతున్నదీ లేనిదీ గమనించుకుంటూ ఉన్నారు ఇంకొందరు ఉపాధ్యాయులు.
'మిడ్ డే మీల్స్' మాటేమిటి?
కరోనా సమయంలో పాఠశాలలు మూసేశారు. అంత వరకు సబబే. కానీ నిరుపేద విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కొన్ని రాష్ట్రాల్లో నిలిపేశారు. కరోనా కష్టకాలంలో ఎందరో తమ ఉపాధిని కోల్పోయారు. దాంతో పిల్లలకు మూడు పూటలా కడుపు నింపడమే తల్లిదండ్రులకు భారమైంది. ఇక పోషకాహారం ఎక్కడ నుంచి పెట్టగలరు? కరోనా కాలంలో పౌష్టికాహారం ఎంత ముఖ్యమో ప్రభుత్వాలకు తెలియదా? కేరళ రాష్ట్రంలో పాఠశాలలు మూసేసినప్పటికీ మధ్యాహ్న భోజనాన్ని ఇళ్లకు పంపించారు. అలాగే మన రాష్ట్రంలోనూ పదిరోజులకొకసారి విద్యార్థులకు సరుకులను ప్రభుత్వం అందించింది. ఇలా మిగతా రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోయాయి అనేది అందరి ముందున్న ప్రశ్న.
ఇదీ మంచిదే...
మామూలు రోజుల్లో పాఠశాల, హోం వర్క్, ట్యూషన్‌లంటూ పిల్లలు ఎప్పుడూ బిజీగా ఉంటారు. వారికిష్టమైన లలిత కళలకు సమయం ఉండేది కాదు. కరోనా సమయాన్ని కొందరు విద్యార్థులు బాగా ఉపయోగించుకున్నారు. సంగీతం, పెయింటింగ్, నాటకాలు, డ్యాన్సులు, కథలు రాయడంలాంటి ఎన్నో విషయాల్లో నైపుణ్యాన్ని సాధించారు.
నష్టాలూ ఉన్నాయి
ఆన్‌లైన్ క్లాసులు కరోనా సమయంలో కొంతవరకు మాత్రమే మేలు చేయగలిగాయి అనేది వాస్తవం. క్లాసులు జరిగే సమయంలో టెక్నాలజీ పరంగా విద్యార్థులూ, ఉపాధ్యాయులూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదాహరణకు ఒక విద్యార్థి పాఠాన్ని సీరియస్‌గా వింటూ ఉన్న సమయంలో అనుకోకుండా నెెట్ కనెక్షన్ కట్ అయింది అనుకుందాం. ఆ విద్యార్థి దాన్ని సరిచేసుకుని, మరలా కొంత సమయం తర్వాత జాయినవుతాడు. ఏ పాఠం అయినా దాదాపు లింకులతో ఉంటుంది. అంటే ముందు విషయం తెలిస్తేనే తర్వాత విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాము. విద్యార్థి మొత్తానికి పాఠంలో ఎక్కడో లింక్ మిస్ అవుతాడు. దాంతో చెప్పే విషయం దేనికి సంబంధించిందో తెలియక తికమక పడతాడు. ఆ సమయంలో పాఠాన్ని ఆపి మరీ ఉపాధ్యాయులను అడగలేరు. దాంతో ఆ అనుమానం ఎప్పటికీ నివృత్తికాక అలాగే ఉండిపోతుంది.
'విద్యార్థుల్లో బద్ధకం బాగా పెరిగింది. రోజంతా కూర్చుని పాఠాలు వినడమూ కష్టంగా ఉంది. లేటెస్ట్ టెక్నాలజీకి అలవాటుపడ్డారు. ఆన్‌లైన్ క్లాసుల్లో ఒకవైపు పాఠం వింటూనే మరోవైపు వీడియో గేమ్స్ ఆడే విద్యార్థులను గమనించా. గతంలో ఏదైనా ప్రశ్న అడిగితే వెంటనే నేర్చుకుని చెప్పేవారు. నేడు అలాంటి పరిస్థితులు లేవు. నేర్చుకోవడం సంగతి పక్కన ఉంచండి. కనీసం చూసైనా చదవలేకపోతున్నారు. పిల్లలు ఈ 17 నెలల్లో చాలా వరకు ఎడ్యుకేషన్ స్కిల్స్‌ను కోల్పోయారు' అంటున్నారు విజయవాడలో ప్రైవేట్ టీచర్‌గా పనిచేసే సురేష్‌కుమార్. 'మా స్కూల్లో విద్యార్థుల సంఖ్య అధికం. సిబ్బంది కొరతా ఉంది. దాంతో పిల్లల మధ్య భౌతిక దూరం పాటిస్తూ పాఠాలు చెప్పడం అంటే కష్టం. కిక్కిరిసిన గదుల మధ్యలోనే పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి. అందుకే కొన్ని తరగతులకు వారానికి మూడు రోజులే పాఠశాల జరుపుతున్నాం. ఆన్‌లైన్ క్లాసుల వల్ల పెద్దగా ఉపయోగం లేదనేది నా అభిప్రాయం. విద్యార్థికి ఏదైనా సందేహం వచ్చినా క్లాసులో నివృత్తి చేసుకోలేకపోయేవారు. క్లాసు అయిన వెంటనే ఫోన్‌లో అడగాలన్నా మేము వేరే క్లాసులో ఉన్నందు వల్ల వారికి అందుబాటులో ఉండేవాళ్లం కాదు. తర్వాత ఎప్పుడో అడిగినా సందేహాన్ని ఫోన్‌లో సరిగా చెప్పలేక ఇబ్బందిపడేవారు. ఒకవేళ చెప్పినా మా జవాబు ఫోన్‌లో వారికి అర్థమయ్యేది కాదు. అదీ తెలివైన విద్యార్థులు మాత్రమే అడిగేవారు' అంటున్నారు నెల్లూరులో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులు నరేంద్రబాబు. రోజంతా ఫోన్‌లోనే పాఠాలు వింటున్నందువల్ల కళ్లకు సంబంధించిన అనేక రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. ఫోన్ చేతిలో ఉందంటే ప్రపంచమే చేతిలో ఉన్నట్లు. దాంతో కొందరు విద్యార్థులు వీడియో గేమ్స్, చాటింగ్‌లాంటి వ్యసనాలకు అలవాటు పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు..
మరచిపోయారు..
'ఇల్లు అలుకుతూ ఈగ తన పేరు మరిచిపోయిందంటా!' అంటూ కథ చాలా మందిమి వినే ఉంటాం. ఇప్పుడు అదే పరిస్థితి మన పిల్లల్లో కనిపిస్తుందంటే.. వాళ్లెంతగా డిస్ట్రబ్ అయ్యారో కదా! మరి 17 నెలల తర్వాత పాఠశాలకు తిరిగొచ్చిన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే... 'గతంలో విద్యార్థుల మధ్య పోటీతత్వం ఉండేది. ఇప్పుడు అది కానరావడం లేదు. చాలా వరకు విద్యార్థులు బేసిక్స్ మరిచిపోయారు. 8, 9, 10వ తరగతి విద్యార్థుల్లోనూ కొందరైతే తమ పూర్తిపేరు రాయలేకపోవడం చూసి బాధేసింది. కరోనా భయం విద్యార్థుల్లో ఎక్కువగా ఉంది. మరలా వీరు చదువులో పడాలంటే కనీసం సంవత్సర కాలం పట్టొచ్చు' అంటున్నారు ఒంగోలులో పనిచేసే ప్రైవేట్ స్కూల్ టీచర్ శ్రీనివాసులు. చాలామంది విద్యార్థులు తమ పూర్తి పేరునూ రాయలేకపోతున్నారు అంటే ఏ స్థాయిలో తమ విద్యను కోల్పోయారో ఇట్టే అర్థమవుతోంది.
అలాగే గీత 5వ తరగతి చివరలో ఉండగా కరోనా కారణంగా పాఠశాల మూసేశారు. ఆమె ప్రస్తుతం 7వ తరగతి. 'గీతని రెండేళ్ల క్రితం నీవే క్లాసు?' అని అడిగితే దిక్కులు చూసే పరిస్థితి. ఎందుకంటే కరోనా కారణంగా 5వ తరగతి పరీక్షలు రాయకుండానే తర్వాత తరగతికి ప్రమోట్ అయ్యిందని గీతకి తెలియదు. అలాగే 6వ తరగతి ఒక్క రోజునూ పాఠశాలకు వెళ్లకుండానే పాస్ అయ్యి ప్రస్తుతం 7వ తరగతి తాను చదువుతున్నాననే విషయమూ ఇంకా నమ్మలేకపోతోంది. కాబట్టే ఎవరైనా అడిగితే తెల్లమొహం వేస్తోంది. ప్రతి పాఠశాలలోనూ ఇలాంటి విద్యార్థులు కోకొల్లలుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో!
ఇలాంటి పరిస్థితుల్లో సిలబస్‌లు ముగించాలని ఉపాధ్యాయులు పరుగులు తీస్తుంటే విద్యార్థులు వారి వేగాన్ని అందుకోవడం అసాధ్యమే కదా! స్కూలుకి వస్తే ఏమౌతుందోనని అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు అనుకుంటున్న వాతావరణంలో పాత పరిస్థితులు వెంటనే పునరుద్ధరించాలని అనుకోవడం సరికాదు. విద్యార్థి ఏ పరిస్థితుల్లో ఉన్నారో గమనించకుండా ఈ మధ్య కాలంలో కోల్పోయినదంతా ఒకేసారి మెదడులోకి ఎక్కించాలంటే ఎలా కుదురుతుంది? వారి చిన్న మెదళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతాయన్న విషయం పెద్దలు ఆలోచించాలి. మరలా వారంతా పూర్వ పద్ధతికి రావడానికి కొంత సమయం పడుతుందన్న వాస్తవం గమనించాలి. ఆ విషయాన్ని మరచి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ర్యాంకులు, మార్కుల కోసం చిన్నారులను ఒత్తిడి చేయడం ముమ్మాటికి తప్పే. తమ పిల్లలు అంతా కోల్పోయారంటూ ట్యూషన్లు పెట్టించి మరీ ఒత్తిడికి గురిచేయడం కాకుండా.. మీకు మేమున్నాం అనే భరోసాను ఇవ్వాల్సిన అవసరం ఉందనేది పెద్దలు గుర్తిస్తే మంచిది.
బడి తెరిచినా..
మొదటిసారి బడిలో చేరే పిల్లలు తమ అందమైన బాల్యాన్ని కోల్పోయారు. పాఠశాలలు తెరిచినప్పటికీ చిన్నారులను స్కూలుకు పంపడానికి తల్లిదండ్రులు భయాందోళనలు చెందుతున్నారు. 'బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. 17 నెలల కాలాన్ని మాకు ఎవరు తిరిగిస్తారు? కరోనా వచ్చినప్పుడు నేను 8వ తరగతి చివరలో ఉన్నా. నిజానికి 8,9 తరగతుల్లో బాగా ఆడుకోవాలని అనుకున్నా. కరోనా కారణంగా ఇంట్లోనే బంధించేశారు. ఇప్పుడు ఆడుకోవడానికి వెళదామా? అంటే పదో తరగతి.. ఇప్పటి నుంచే సీరియస్‌గా చదవాలి అంటున్నారు. ఇప్పటికీ స్నేహితులతో సరదాగా ఉండటానికి లేదు. చాలా బాధగా ఉంది' అంటోంది విజయవాడలో పదోతరగతి చదివే ఇహశ్రీ. 'చాలా రోజుల తర్వాత స్కూలుకు వచ్చా. నా స్నేహితులను, మాస్టార్లను చూసేసరికి సంతోషంగా ఉంది. మా పాఠశాలను ఎంత మిస్ అయ్యానో అర్థమైంది. ఇప్పట్లో స్కూలుకు వస్తానని అనుకోలేదు. నా స్వేచ్ఛ నాకు తిరిగొచ్చినట్లు ఉంది' అంటోంది తొమ్మిదో తరగతి చదివే గుంటూరుజిల్లా పెనుమాకలో చదివే ప్రణతి. 'కరోనా సమయంలో ఇంటికే పరిమితమైనా డ్రాయింగ్ వేయడం నేర్చుకున్నా. ఎప్పటికప్పుడు వేసిన బొమ్మలను టీచర్ల సెల్‌కు పంపేవాడిని. వారెంతో ప్రోత్సహించారు. బడి తెరవగానే నేను వేసిన బొమ్మలను చూసి నన్నెంతో మెచ్చుకున్నారు' అంటున్నాడు గుంటూరుజిల్లా పెనుమాకలో 8వ తరగతి చదివే మొహమ్మద్ ఆలీ. 'కరోనా భయంతో క్లాసుల్లో రోజంతా మాస్కులు పెట్టుకుని ఉండాల్సి వస్తోంది. దాంతో ముఖం మీద అలర్జీ వచ్చి, దద్దులు వస్తున్నాయి. సిలబస్ పూర్తిచేయాలని ఉపాధ్యాయులు వేగంగా పాఠాలు చెబుతుంటే కొన్ని అర్థం కావడం లేదు. అయినా స్కూలుకు వచ్చామనే సంతోషం ముందు ఇవేమీ బాధగా లేవు' అంటున్నాడు నెల్లూరులో పదో తరగతి చదివే జీవన్‌కుమార్.
ఎంత వరకు నిజమో!
చాలామంది చిన్న పిల్లలను ఇప్పుడు స్కూల్లో చేర్చడం లేదు. త్వరలో థర్డ్ వేవ్ వస్తుందని, అదీ పిల్లలకే అని బాగా ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల కోవిడ్ ప్రభావం పడి, తరగతులు, స్కూల్స్ మళ్లీ మూతపడ్డాయి మరీ. చదువు ముఖ్యమా? పిల్లల ప్రాణాలు ముఖ్యమా? అంటే ప్రాణాలే ముఖ్యం. ఈ సమయంలో పిల్లలను బడికి పంపడమంటే సాహసమే! 'స్కూల్ తెరిచిన చాలా రోజుల వరకూ మా పిల్లలను బడికి పంపడానికి నేను ఒప్పుకోలేదు. కానీ ఎంతకాలమని ఇంట్లోనే ఉంచుతాం. బేసిక్స్ అన్నీ మరచిపోయారు. పిల్లలు నా మాట వినడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బడికి పంపుతున్నా' అంటోంది నరసారావుపేటకు చెందిన రాధికా అనే పేరెంట్.
'పిల్లలను మొదట్లో స్కూలుకు పంపాలంటే చాలా సందేహించా. తోటి పిల్లలంతా వెళుతున్నారు.. మేమూ వెళతాం అంటూ పిల్లలు ఒకటే గోల. వాళ్లు స్కూలుకు వెళ్లి వచ్చే వరకు ఎంత టెన్షన్‌గా ఉంటోంది' అంటోంది విజయవాడకు చెందిన శిరీష అనే పేరెంట్. 'ఇంతకాలం తర్వాత స్కూల్స్ తెరిచి, సిలబస్ కాలేదని త్వరత్వరగా పాఠాలు చెబితే పిల్లలకు ఎలా అర్థమవుతాయి. ప్రభుత్వం కొంత సిలబస్ తగ్గించాలి. అప్పుడు పిల్లలకూ బాగా అర్థమవుతుంది' అంటున్నారు ఒంగోలుకు చెందిన కొండలరావు అనే పేరెంట్.
ఇదండీ బడి తెరిచాక పిల్లలూ, ఉపాధ్యాయులూ, తల్లిదండ్రుల మాటలు. ఏది ఏమైనా ఇప్పుడు చిన్నారుల ముఖాలు చిరునవ్వులతో వెలిగిపోతున్నాయి. త్వరలోనే ఈ మాస్కులు, శానిటైజర్ల వాడకం మానేసి.. పూర్వంలా చిన్నారులు గంతులేసే రోజులు రావాలని మనమంతా కోరుకుందాం.
- స్వర్ణలత నూకరాజు