తల్లిదండ్రులతో మాట్లాడుతున్న ఉపాధ్యాయులు
బడి బయట పిల్లలను స్కూళ్లకు పంపాలి
కొడవలూరు:డ్రాపొట్స్(బడి బయట పిల్లల)పై సమగ్ర శిక్ష అధికారులు ప్రత్యేక దష్టిసారించారు. మండలంలోని గుండాలమ్మపాలెం మజరా నీలగిరి సంఘం గిరిజన కాలనీలో డ్రాపౌట్స్ విద్యార్థులున్నారన్న సమాచారం పై సమగ్ర శిక్ష ఎఎంఒ జి.సుధీర్‌బాబు, సిఎంఒ కె.పెంచలయ్యలు మంగళవారం కాలనీని సందర్శించారు. ఇక్కడ వివిధ తరగతుల వయస్సు కలిగిన ఏడుగురు విద్యార్థులు డ్రాపౌట్స్ ఉన్నట్లు గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో చేర్చడం వల్ల ప్రభుత్వమే అన్నీ సమకూర్చడంతోపాటు అమ్మ ఒడి నగదు మంజూరు చేస్తుందన్నారు. విద్యార్థుల బంగారు భవితకు బాట వేస్తుందని చెప్పారు. పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు అంగీకరించినప్పటికీ కొడవలూరు హైస్కూల్ దూరమైనందున వెళ్లడం కష్టంగా ఉంటుందని వారు అధికారులకు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన సమగ్ర శిక్ష అధికారులు ప్రభుత్వం ద్వారా పాఠశాలకు వెళ్లి వచ్చేందుకు ఆటో సదుపాయం కల్పించేందుకు అంగీకరించారు. దీంతో బుధవారం నుంచి ఆ ఏడుగురు పిల్లలను కొడవలూరు హైస్కూల్ పంపేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. తొలుత కొడవలూరు హైస్కూల్లో జరిగిన పేరెంట్స్ కమిటీ సమావేశానికి వారు హాజరై పలు సూచనలు చేయడంతో పాటు మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించారు. వారి వెంట తహశీల్దార్ రమాదేవి, ఎంఇఒ జి.వసంతకుమారి, ఎంఇఒ2 ఎన్.అంకయ్య, హెచ్‌ఎంపి మంజువాణి, సిఆర్‌పిలు ఎం.దయాకర్, జి.పెంచలయ్య, టి. వెంకటసురేష్‌లున్నారు.










