Jun 22,2023 01:01

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఇంట్లో పేదరికం వల్ల బడికి వెళ్లి చదువుకుంటూ ఆటపాటలతో గడపాల్సిన బాలబాలికలు పనులకు వెళుతున్నారు. చదువుపై తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో పిల్లల్ని బడులకు పంపలేకపోతున్నారు.తక్కువ కూలీ, అరకొర వేతనం ఇచ్చి ఎక్కువగా పని చేయించుకోవచ్చునని కొందరు యజమానులు తమ వద్ద చిన్నారులను పనులకు పెట్టుకుంటున్నారు. ఇలా కారణం ఏదైతేనే పలకా బలపం పట్టాల్సిన చిట్టి చేతులు పలుగు పారలు పడుతున్నాయి. పరిశ్రమలు, బట్టీలు, బార్లు, పాన్‌ షాపులు, హోటళ్లలో పని చేయాల్సి వస్తోంది. కడుపు నింపుకునేందుకు చిట్టి చేతులు పెద్ద పనులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
జిల్లాలో ఎక్కడ చూసినా వందల సంఖ్యలో బాల కార్మికులు దర్శనమిస్తున్నారు. అన్ని పట్టణాలు, గ్రామాల్లో పలువురు బాల కార్మికులు పని చేస్తూ కనిపిస్తున్నారు. ముఖ్యంగా మెకానిక్‌ షెడ్లు, హోటళ్లు, పాన్‌ షాపులు, ఇటుక బట్టీలతో పాటు మద్యం దుకాణాల్లో కూడా బాలకార్మికులు కనిపిస్తారు. చివరకు అధికారులు, ప్రజా ప్రతినిధుల ఇళ్లల్లో బాలకార్మికులు పని చేస్తున్నట్టు అనేక సంఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇలా జిల్లావ్యాప్తంగా వేలాది మంది బాల కార్మికులు పనుల్లో ఉన్నారు.
వలస కార్మికుల కుటుంబాల్లో పెరుగుతున్న సంఖ్య
వలస కార్మికుల సంఖ్య జిల్లాలో ఏటా పెరుగుతోంది. కాకినాడ పారిశ్రామిక ప్రాంతం, ఆక్వా చెరువులు, ఇటుక బట్టీల వద్ద వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వలసలు వస్తున్నారు. అలాంటి కుటుంబాల్లో పిల్లలు బడికి దూరంగా ఉంటూ, వెట్టిచాకిరితో నెట్టుకొస్తున్నారు. పట్టణాల్లో మెటార్‌ మెకానిక్‌ షెడ్లలో చాలాచోట్ల బాలకార్మికులు పని చేస్తున్నారు. హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలో కూడా ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. కాకినాడ పిఆర్‌ కళాశాల వద్ద ఉన్న ఈట్‌ స్ట్రీట్‌లో బాల కార్మికులు ఎక్కువగా పని చేస్తున్నారు. వారిని అడ్డుకోవడానికి వివిధ డ్రైవ్‌లు నిర్వహించినా మార్పు కనిపించడం లేదు. కొందరిని పని మాన్పించి, బడిలో చేర్చారు. అయినా ఇంకా అనేక మంది బాల కార్మికులుగానే సాగుతున్నారు. బడిలో చేర్చిన వారిలో కూడా కొందరు మళ్లీ పనిబాట పట్టిన దాఖలాలున్నాయి. కుటుంబాల ఆర్థిక అవసరాలు, ఇతర అనేక కారణాలతో బాలకార్మికులుగా పనిచేసుకోవాల్సిన దుస్థితి కనిపిస్తోంది.
అరకొర చర్యలకే యంత్రాంగం పరిమితం
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నామని అధికారులు చెప్పుకొస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం బాల కార్మికులను గుర్తించి వారిని బడికి పంపాలన్న ఆలోచన చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక లెక్కల్లో మాత్రం బాలకార్మికుల సంఖ్యను నామమాత్రంగానే చూపుతున్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్ములనకు చట్టాలు ఉన్నా అవి సక్రమంగా అమలు కాకపోవడం లేదు. దీంతో రేపటి భావి భారత పౌరుల పరిస్థితి హీనంగా మారిపోయింది. అమలు చేయాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తిపడి చట్టాలను అపహాస్యం చేస్తున్నారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ నెల 1 నుంచి 30 వరకు కార్మిక శాఖ తోపాటు స్త్రీ, శిశు సంక్షేమ, విద్యా, పోలీస్‌, సోషల్‌ వెల్ఫేర్‌, ఎన్‌జిఒ సంఘాల ప్రతినిధులు కలిపి కాకినాడ, డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆరు బందాలు బాల కార్మికులను గుర్తించడానికి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. బాల కార్మికుల గుర్తింపు మాత్రం నామమాత్రంగానే కనిపిస్తోంది. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 22 మందిని మాత్రమే గుర్తించారు. కాకినాడలో ఆరుగురు, పెద్దాపురంలో ఏడుగురు, పిఠాపురంలో ఆరుగురు, తునిలో ఒకరు, ఏలేశ్వరంలో ఇద్దరిని మాత్రమే గుర్తించగలిగారు.