ప్రజాశక్తి - పర్చూరు
బడి బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో డ్రైవర్ మండలంలోని వెంపరాల గ్రామ సమీపంలో మృతి చెందారు. గత కొన్ని సంవత్సరాలుగా చైతన్య పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న గుర్రాల ఏడుకొండలు(55) పట్టణంలోని జూనియర్ కళాశాల సమీపంలో నివాసం ఉంటున్నారు. ఎప్పటిలాగానే బుధవారం వెంపరాల రూటులోని గ్రామాల విద్యార్థులను ఎక్కించుకొని పాఠశాలకు వస్తుండగా వెంపరాల సమీపంలో ఏడుకొండలుకు ఒక్కసారిగా గుండెనొప్పి రావడంతో బస్సును మార్జిన్‌లో ఉంచారు. ఈ క్రమంలో విద్యార్థులు ఆందోళన చెంది. ఏమిటి అంకుల్ బస్సులు పక్కన ఉంచారని ప్రశ్నించగా గుండెలో నొప్పిగా ఉందని విద్యార్థులకు చెప్పారు. విద్యార్ధులు మంచినీరు తాగించారు. ఆ వెంటనే స్టీరింగ్ పైనే కుప్పకూలిపోయి మృతి చెందారని తెలిపారు. గ్రామస్తులు గమనించి డ్రైవర్‌ను కిందికి దించారు. అధికారులు వచ్చి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విద్యార్థులను అదే బస్సులో మరో డ్రైవర్ సాయంతో అద్దంకికి చేర్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










