రాయచోటి టౌన్ : నియోజకవర్గంలో ప్రయివేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. పాఠశాలలకు విద్యార్థులను తరలించే విషయంలో ప్రయాణ ఛార్జీల పేరిట ఇష్టారాజ్యంగా డబ్బు వసూలు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి తమ పిల్లలను ఉన్నత చదువులు చదివి మంచి ప్రయోజకులు కావాలని ప్రయివేటు విద్యా సంస్థలకు పంపుతున్నారు. ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి విద్యార్థులను బస్సుల్లో తరలిస్తున్నారు.
యాజమాన్యాల కక్కుర్తి...
కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్ చేస్తున్న ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాల తీరుపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల మేరకు చిన్న బస్సు కెపాసిటీకి అనుగుణంగా 24 మంది, పెద్ద బస్సు కెపాసిటీకి సంబంధించి 55 మంది విద్యార్థులను ఎక్కించుకునేందుకు అనుమతి ఉంది. ఈ నిబంధనలు చిన్న బస్సుల్లో 40 నుంచి 50 మందిని, పెద్ద బస్సుల్లో 100కు పైగా విద్యార్థులను ఎక్కిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రవాణా శాఖ అధికారులు తరచుగా వాహనాలను తనిఖీ చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నా.. పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను పెడచెవిన పెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 154 ఫిట్ నెస్ లేని స్కూల్ బస్సులు ఉన్నాయని వాటిని వెంటనే ఫిట్‌నెస్ చేసుకోవాలని లేని పక్షంలో రవాణా శాఖ వారి దాడుల్లో పట్టు బడితే భారీ మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుంది.
నిబంధనలు ఇవే...
పాఠశాల బస్సుల్లో విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించాలి. కెపా సిటీని బట్టి నిబంధనల మేరకే పిల్లలకు పాఠశాలలకు తరలించాలి. 60 ఏళ్లు పైబడిన డ్రైవర్లను నియమించరాదు. బస్సుల్లో అగ్నిప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు పిల్లలు సురక్షి తంగా బయటపడానికి బస్సులకు అత్యవసర ద్వారాలు ఉండాలి. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు, ఐదేళ్ల అనుభవం ఉన్న వారినే బస్సు డ్రైవర్‌గా నియమించుకోవాలి. డ్రైవర్ ఆరోగ్య, మానసిక పరిస్థితులపై వైద్యులు పరీక్షలు చేసిన ధ్రువపత్రం ఉండాలి. బస్సుల్లో తప్పకుండా అటెండర్ ఉండాలి. విద్యా ర్థుల హాజరును తప్పక నమోదు చేయాలి. ప్రతి బస్సులోనూ ఫస్‌ఎయిడ్ బాక్సు అందుబాటులో ఉండాలి. పిల్లలు బస్సు ఎక్కడానికి అనువుగా మెట్లు ఉండాలి. పిల్లలను పాఠశాలలకు చేర్చేటప్పుడు గాని, లేదా ఇంటికి తరలించేటప్పుడు కాని టైర్లు పంక్చరైతే మార్చుకునేందుకు సేఫ్టీ టైర్లను సిద్ధంగా ఉంచుకోవాలి.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులను తరలించే బస్సులను కండీషన్‌లో ఉంచుకోవాలి. బస్సుల్లో సీటింగ్ కెపాసిటీ వరకే విద్యార్థులను ఎక్కించుకోవాలి. బస్సుల్లో ప్రతిరోజు విద్యార్థుల హాజరు శాతాన్ని నమోదు చేసేందుకు అటెండెన్స్ తప్పక నియమించాలి. 15 ఏళ్లు పైబడిన స్కూల్ బస్సులు నడపరాదు. ఈ నిబంధనలను పాటించని స్కూల్ బస్సులను సీజ్ చేస్తాం.
- పి.దినేష్ చంద్ర, డిటిఒ, రాయచోటి.










