May 07,2023 00:50

ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న పిఒడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి

ప్రజాశక్తి-కంచరపాలెం : ఆర్‌ అండ్‌ బి మర్రిపాలెం ఏరియాలోని ఆర్‌టిఒ కార్యాలయం రోడ్డులో 30 ఏళ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారి బడ్డీలు, తోపుడు బళ్లను యథాస్థానంలోనే ఉంచాలని కోరుతూ శుక్రవారం రాత్రి 11గంటల నుంచి శనివారం ఉదయం 11గంటల వరకు తొలగించిన ప్రాంతంలో బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ, జి 20 సదస్సు నేపథ్యంలో వాటిని తాత్కాలికంగా ఆర్‌టిఎ ఆఫీసులోకి మార్చారని, సదస్సు తర్వాత వాటిని యథాస్థానంలో పెడతామని హామీ ఇచ్చినా నేటికీ మార్చకపోవడం తగదన్నారు. ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, జోనల్‌ కమిషనర్‌, పోలీసు అధికారులు అందరూ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. హామీ ఇచ్చిన నాయకులు, అధికారులు స్పందించి సోమవారం నాటికల్లా వారివారి పాత స్థానాల్లో ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియు జాతీయ కమిటీ సభ్యులు ఎం.వెంకటేశ్వర్లు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కె.నిర్మల, జిల్లా అధ్యక్షులు ఎస్‌.వెంకటలక్ష్మి పాల్గొన్నారు.