Sep 18,2020 07:15

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14 నుండి ఉల్లిపాయల ఎగుమతులను నిషేధించటంతో... ఉల్లిపాయలను ఉత్పత్తి చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. దేశంలో సామాన్యుల నుండి అత్యంత ధనికుల వరకు ఉల్లిపాయలను నిత్యం ఆహారంలో వినియోగిస్తారు. సామాన్యుల ఆహారంలో ముఖ్యమైన భాగం కాబట్టి ఉల్లి ధరలను అదుపులో ఉంచటం అవసరమే. కాని ఎగుమతులను నిషేధిస్తున్న ప్రభుత్వం వినియోగదారులకు తక్కువ ధరలకు సరఫరా చేస్తామని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ధరల పెరుగుదల పేరుతో ఎగుమతులను నిషేధించటం రైతులు తీవ్రంగా నష్టపోవటానికి, బడా వ్యాపారులు కోట్ల రూపాయల లాభాలను అక్రమంగా సంపాదించుకోవటానికి దారితీస్తుంది. కాని వినియోగదారులకు మాత్రం తక్కువ ధరలకు ఉల్లిపాయలు దొరకవు.
రైతులు, వినియోగదారులకు నష్టం
ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతులు, వినియోగదారులు ఉభయులు నష్టపోవటానికి దారి తీస్తున్నాయి. ఉల్లిపాయల పంట మార్కెట్‌ లోకి వస్తున్న తరుణంలో వ్యాపారులు ధరలను పూర్తిగా తగ్గిస్తున్నారు. ప్రతి సంవత్సరం పంట మార్కెట్‌ లోకి వచ్చినపుడు ఎక్కువ మంది రైతాంగానికి కిలోకు 2 నుండి 7 రూపాయలకు మించి ధర రావటం లేదు. ఫలితంగా రైతాంగానికి పంట ఉత్పత్తి చేయటం కోసం పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదు. దానితో రైతాంగానికి గిట్టుబాటు ధరలు రాక తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు. సరుకు వ్యాపారుల చేతుల్లోకి చేరిన తర్వాత ధరలను విపరీతంగా పెంచి, వినియోగదారులను దోపిడి చేస్తున్నారు.
రైతాంగాన్ని దివాళా తీయించటానికి, కార్పొరేట్లు, బహుళజాతి సంస్థలకు వ్యవసాయ రంగాన్ని అప్పగించటానికి అవసరమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకొంటున్నది. అందులో భాగంగానే కోవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కోవటానికంటూ ప్రకటించిన ప్యాకేజిలో...వ్యవసాయ రంగంపై కార్పొరేట్లు, బహుళజాతి సంస్థలు ఆధిపత్యం చెలాయించే విధానాలను ప్రకటించింది. వాటిని అమలు చేయటం కోసం ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. వాటిలో నిత్యావసర సరుకుల చట్టాన్ని సవరించి, నిత్యావసర సరుకులను నిల్వ చేయటంపై ఉన్న ఆంక్షలను తొలగిస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా తమకున్న మందబలంతో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో ఆర్డినెన్స్‌ను చట్టంగా ఆమోదింపజేసుకున్నారు. నిత్యావసర సరుకుల చట్టానికి చేసిన సవరణలతో ఉల్లిపాయలతో పాటు ముతక ధాన్యాలు, పప్పులు, నూనెగింజలు, వంట నూనెలు, బంగాళాదుంపలను నిత్యావసర సరుకుల జాబితా నుండి తొలగించారు. ఈ సరుకుల నిల్వలపై ఉన్న పరిమితులను కూడా ఎత్తివేశారు. దానితో వ్యాపారులు తమ ఇష్టం వచ్చినంత సరుకును కొని నిల్వ చేసుకోవటానికి ఉన్న అభ్యంతరాలు రద్దయ్యాయి. నిత్యావసరాలుగా ఉన్నపుడే చట్టాలను పక్కన పెట్టి తమ ఇష్టం వచ్చినంత సరుకును నిల్వ చేసుకొనే బడా వ్యాపారులు ఈ సరుకులను నిత్యావసరాల జాబితా నుండి తొలగించిన తర్వాత వారు చేసే నిల్వలకు ఎటువంటి పరిమితి ఉండదు. ఈ విధానం వినియోగదారులకు శరాఘాతంగా పరిణమిస్తుంది. పంటలు బాగా పండి, దేశ ప్రజలకు సరిపోనూ ఉత్పత్తి అయిన సంవత్సరాలలో కూడా ముందుగానే రైతుల నుండి పంటను కొని, నిల్వ చేసి, మార్కెట్‌లో కృత్రిమ కొరతను సృష్టించి, అత్యధిక ధరలకు వినియోగదారులకు అమ్మి అత్యధిక లాభాలను సంపాదించుకోవటానికి ఈ విధానం దోహదం చేస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ఎగుమతులపై కూడా నిషేధాన్ని విధిస్తే దేశంలోని రైతాంగానికి శాపంగా, బడా వ్యాపారులకు వరంగా మారుతుంది. బడా పెట్టుబడిదారులను బలపరిచేవారు ఎగుమతులకు అనుమతిస్తే ధరలు పెరిగి, వినియోగదారులకు నష్టం జరుగుతుందని కపట వాదనలు చేస్తుంటారు. కాని పంట కొనుగోలు, అమ్మకంలో కార్పొరేట్ల మోసాలను గురించి ప్రస్తావించరు. కార్పొరేట్‌ సంస్థలను బలపరిచే ఇటువంటి వారి వాదనలకు ఏ మాత్రం విలువ లేదు. ఒక పంటను ఎగుమతి చేయాలా, దిగుమతి చేసుకోవాలా అనేది రైతులు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేయాలి. దానిని కార్పొరేట్లు, వ్యాపారులకు వదిలితే తమ లాభాల కోసం రైతులు, వినియోగదారులను నష్టపెట్టే విధంగా వ్యవహరిస్తారు.
ఉల్లి ఉత్పత్తి-ఎగుమతులు
దేశంలో 2.2 కోట్ల టన్నుల ఉల్లిపాయలు ఉత్పత్తి అవుతున్నాయి. ఉల్లిపాయల ఉత్పత్తిలో దేశంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో, మధ్యప్రదేశ్‌ రెండు, కర్ణాటక మూడవ స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఆరవ స్థానంలో ఉన్నది. ఉల్లిపాయల కొరతతో 2015లో వ్యాపారులు ధరలను విపరీతంగా పెంచారు. కిలో 10 రూపాయలకు అమ్ముతున్న ఉల్లిపాయలు 100 రూపాయలకు మించి పెరిగాయి. కొరతను అధిగమించటం కోసం ప్రభుత్వం ఇతర దేశాల నుండి, ముఖ్యంగా పాకిస్థాన్‌ నుండి దిగుమతి చేసుకోవటం, కొన్ని రాష్ట్రాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయటం ద్వారా ధరలను అరికట్టటానికి ప్రయత్నించాయి. అయినప్పటికీ ధరల ఒడిదుడుకులు, వినియోగదారులు, ఉత్పత్తిదారులను దోపిడి చేయటంలో ఏ మాత్రం మార్పు రాలేదు.
ప్రపంచంలో వినియోగించే కూరగాయలలో ఉల్లిపాయలు మూడవ స్థానంలో ఉన్నాయి. ఉల్లిపాయల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో, భారతదేశం రెండవ స్థానంలో ఉండగా, తలసరి వినియోగంలో లిబియా 34 కిలోలతో మొదటి స్థానంలో, 33 కిలోలతో ఆల్బేనియా రెండవ స్థానంలో ఉన్నాయి. ప్రపంచంలో 8.47 కోట్ల టన్నుల ఉల్లిపాయలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచంలో 70 శాతానికి పైగా ఉల్లిపాయలు ఎనిమిది దేశాలలోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఉత్పత్తిలో అమెరికా, ఇరాన్‌, రష్యా, టర్కీ, ఈజిప్టు, పాకిస్థాన్‌లు చైనా, భారత్‌ల తర్వాతి స్థానాలలో ఉన్నాయి. ఎకరానికి దిగుబడిలో భారతదేశం ప్రపంచంలో అత్యంత దిగువ స్థానంలో ఉన్నది. మంచిరకం విత్తనాల ధరలు విపరీతంగా పెరగటం, తెగుళ్ళు ఎక్కువగా రావటం, ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగటం, సాగునీటి సదుపాయం లేకపోవటం, అధిక, అత్యల్ప వర్షాలు, రవాణా ఛార్జీల భారం, పండిన పంటను సక్రమంగా నిల్వ చేయకపోవటం, కార్పొరేట్‌, బడా వ్యాపారులు ధరలను అదుపు చేయటం వలన ధరలలో అధిక హెచ్చుతగ్గులు తదితర కారణాల వలన రైతులు నష్టపోతున్నారు. పంట దిగుబడులలో దిగువ స్థానంలో ఉండటంతో రైతులు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పోటి పడలేకపోతున్నారు. భారతదేశం సంవత్సరానికి 15 లక్షల టన్నుల వరకు ఉల్లిపాయలను ఎగుమతి చేస్తున్నది.
ఈ సంవత్సరం రెండు కోట్ల టన్నులకు పైగా ఉల్లిపాయలు ఉత్పత్తి కావచ్చునని అంచనా వేస్తున్నారు. ఉత్పత్తి అయిన ఉల్లిపాయలను ఎక్కువ మంది రైతులు పంట చేతికి రాగానే అమ్ముకుంటారు. ముఖ్యంగా కౌలురైతులు పంటను అమ్ముకోకుండా ఉండలేరు. అక్టోబరులో ఖరీఫ్‌ పంట చేతికి వస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఎగుమతులను నిషేధిస్తూ ప్రకటన చేయటం రైతాంగం కనీసధరలను పొందటాన్ని కూడా నిరోధిస్తుంది. బిజెపి ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బడాయి కబుర్లు చెబుతున్నది. ఆచరణలో రైతులు కనీస ఆదాయాన్ని పొందటాన్ని కూడా నిరోధిస్తున్నది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ద్వంద్వ విధానాలను ఎండగట్టి, రైతులు, వినియోగదారులను చైతన్యవంతం చేయాలి. ప్రభుత్వం తీసుకొనే చర్యలు రైతాంగానికి మద్దతు ధరలు దక్కే విధంగా, ప్రజలకు సరసమైన ధరలకు ఉల్లిపాయలు అందే విధంగా ఉండాలి. ఉల్లికి మద్దతు ధరలను ప్రకటించి, ఆ ధరల కన్నా తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నపుడు ప్రభుత్వమే మార్కెట్‌ లోకి వచ్చి కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కొనుగోలు చేసిన మద్దతు ధరలకు, వినియోగదారులకు సరఫరా చేస్తున్న ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సబ్సిడీ ఇవ్వటం ద్వారా ప్రభుత్వం భర్తీ చేయాలి.
                                                                                                                                                                                            * ఎ. కోటిరెడ్డి