Jan 28,2021 07:39

దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఓవైపు కార్పొరేట్‌ కంపెనీల లాభాలు అమాంతం పెరిగిపోతుంటే...మరోవైపు బ్యాంకులలో పారిశ్రామికవేత్తలు, సంపన్నుల మొండి బకాయిలు సైతం వాటితో పోటీ పడుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ అభియాన్‌ ప్యాకేజీ కార్పొరేట్‌ కంపెనీలకు మరిన్ని రాయితీలు ఇచ్చి వాటి సంపద, లాభాలు మరింత పెంపొందడానికి తోడ్పడిందే కానీ...వాటి నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు రావలసిన మొండి బకాయిలను రాబట్టడానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇటీవల విడుదల చేసిన రిజర్వ్‌ బ్యాంకు నివేదిక ఆందోళనకరమైన విషయాలను బయటపెట్టింది. యుపిఎ (2008 నుంచి 2014 వరకు), ఎన్‌డిఎ (2014 నుంచి 2020 వరకు) హయాంలో మొత్తం 12 సంవత్సరాల కాలానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్‌పిఎ లు) గణాంకాలను ఆర్‌బిఐ విశ్లేషించింది. బిజెపి ఆరేళ్ల పాలనా కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులలో మొండి బకాయిలు (ఎన్‌పిఎ) 365 శాతం పెరిగాయని ఆర్‌బిఐ గణాంకాలు నిగ్గుతేల్చాయి. యుపిఎ పాలనాకాలంలో మొండి బకాయిల రద్దుతో పోల్చితే మోడీ హయాంలో ఏకంగా ఇరవై ఒక్క రెట్లు బడా కార్పొరేట్లు, అత్యంత సంపన్నుల బ్యాంకు రుణాలు రద్దు కావడం నివ్వెరపరిచే పరిణామం.
రుణాలు తీసుకున్న కంపెనీలు, వ్యక్తులు ఆ రుణాలను తిరిగి చెల్లించకపోతే వాటిని బ్యాంకులు మొండి బకాయిలు (స్థూల ఎన్‌పిఎ లు)గా మార్చుతాయి. వీటిని నిరర్ధక రుణాలుగా వర్గీకరిస్తాయి. నాలుగేళ్ల కాలవ్యవధి దాటిన ఎన్‌పిఎ లను బ్యాంకులు రద్దు చేసి బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్ల నుంచి తీసి వేస్తాయి. యుపిఎ హయాంలో 2008-2009 నుంచి 2013-14 వరకు ఆరు ఆర్థిక సంవత్సరాలలో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు (జిఎన్‌పిఎ) రూ. 5,04,021 కోట్లుగా నమోదు కాగా, 32,109 కోట్ల రూపాయలను యుపిఎ ప్రభుత్వం మొండి బకాయిల కింద రద్దు చేసింది. 2014లో బిజెపి అధికారం లోకి వచ్చిన తర్వాత 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి ఆరేళ్లలో అనూహ్యంగా 18,28,584 కోట్ల రూపాయలు మొండి బకాయిలు (ఎన్‌పిఎ లు) పెరిగిపోయాయి. గత ఆరేళ్ల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులలో మొండి బకాయిలు పెద్ద మొత్తంలో పెరుగుతూనే ఉన్నాయి. 2014-15లో రూ.1,77,860 కోట్ల నుంచి 2015-16 నాటికి రూ.3,85,961 కోట్లకు మొండి బకాయిలు చేరుకున్నాయి. 2016-17లో ఎన్‌పిఎ లు రూ.3,27,593 కోట్లుగా నమోదై స్వల్పంగా తగ్గినప్పటికి 2017-18లో 4,88,175 కోట్లకు పెరిగాయి. 2018-19లో 2,10,531 కోట్లుగా ఉన్న మొండి బకాయిలు 2019-20 నాటికి రూ.2,38,464 కోట్లకు పెరిగి మొత్తం మోడీ పరిపాలనలో రూ.18,28,584 కోట్లకు ఎన్‌పిఎ లు పెరిగాయి. యుపిఎ పరిపాలన కాలంలో 2008-14 వరకు రూ. 32,109 కోట్ల ఎన్‌పిఎ ల రద్దు జరిగితే, బిజెపి ప్రభుత్వం 2014-20 వరకు రూ. 6,83,388 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే భారీ మొత్తంలో రూ.1,78,305 కోట్ల ఎన్‌పిఎ లను రద్దు చేసింది. యుపిఎ హయాంలో మొండి బాకీల రద్దుతో పోల్చితే బిజెపి పాలనలో మొండి బాకీల రద్దు 21 రెట్లు పెరగడం కార్పొరేట్‌ సంపన్నులపై బిజెపి ప్రభుత్వానికి ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. ఆర్‌బిఐ గణాంకాల ప్రకారం 2014 తర్వాత బడా కార్పొరేట్లు, అపర కుబేరులు బ్యాంకులకు రుణాలు భారీగా ఎగ్గొట్టడం స్పష్టంగా కనబడుతోంది. నీరవ్‌ మోడీ, విజరు మాల్యా, లలిత్‌ మోడీ, మొహిల్‌ చోక్సి వంటి బడా వ్యాపారులు బ్యాంకులను నిండా ముంచి విదేశాలకు పారిపోతున్న క్రమంలో ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించింది. వారిని తిరిగి దేశానికి రప్పించేందుకు చేపట్టిన చర్యలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయి. సామాన్య ప్రజల డబ్బు తోనే వ్యాపారం చేసే బ్యాంకులు వారికి రుణం కావాలంటే సవాలక్ష కాగితాలు, ష్యూరిటీలు అడిగి పలు పర్యాయాలు తమ చుట్టూ తిప్పుకుని కొందరికి కొద్దిపాటి రుణాలు మంజూరు చేస్తుంటాయి. అయితే దీనికి భిన్నంగా కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు రాజకీయ ప్రాబల్యంతో పిలిచి మరీ రుణాలు కట్టబెడుతున్నాయి. ఇవి సక్రమంగా వసూలు కాకపోవడంతో లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ అండదండలతో రద్దు చేస్తూ, వారి పేర్లను కనీసం బయట పెట్టలేకపోతున్నాయి. ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో బ్యాంకులు సేకరించిన డబ్బును ప్రభుత్వాలు కార్పొరేట్‌ వర్గాలకు పందేరం చేస్తూ... తిరిగి వాటిని వసూలు చేసుకోలేక రద్దు చేస్తుండటంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు బ్యాంకుల నుంచి తాము పొందే కొద్దో, గొప్పో రుణానికి సంబంధించిన ఒకటి, రెండు ఈఎంఐలు కట్టకపోతే వారి పేర్లను రచ్చ చేసి, ఏజెంట్లను ఇంటికి పంపి పరువు తీసే ప్రయత్నాలతో అనేకమంది బలవన్మరణాలకు పాలుపడ్డ సంఘటనలు కోకొల్లలు.
కార్పొరేట్‌ పెద్దమనుషుల మితిమీరిన మొండి బాకీల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు నేడు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. దేశం లోని ప్రభుత్వ రంగ బ్యాంకులలో మొండి బాకీలకు కారణమైన వ్యక్తుల, సంస్థల పేర్లతో నమోదైన మొత్తాలను ప్రకటించాలి. రద్దు చేసిన రుణాలకు సంబంధించిన బడా కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పౌర సమాజం ముందు బహిర్గతం చేయాలి. వాస్తవంగా వివిధ కంపెనీలు లాభాలు సాధిస్తున్నప్పటికీ దివాళా తీసినట్టు తమ ఖాతా పుస్తకాలలో చూపి బ్యాంకులకు రుణాలు ఎగ వేస్తూ, మరల కొత్త కంపెనీల పేరుతో వందల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నాయి. ఇలాంటి సంస్థలపై, వ్యక్తులపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాంకులలో మోసాలకు పాల్పడుతున్న మొండి బకాయిదారులను, సంస్థలను గుర్తించి వారు తీసుకున్న రుణాలను తిరిగి రికవరీ చేసినప్పుడే బ్యాంకులు పరిపుష్టమై సామాన్య ప్రజలు బ్యాంకులలో దాచుకున్న సొమ్ముకు భద్రత చేకూరుతుంది.
బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి