ప్రజాశక్తి-రాజవొమ్మంగి : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఉప ప్రధాని, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు మండలంలోని స్థానిక ఎమ్మార్పీఎస్ కమిటీ సమావేశ మందిరం నందు మాదిగ పోరాట సమితి అధ్యక్షులు మోర్త బుజ్జిబాబు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలిత జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు ఎం బుజ్జిబాబు, పిల్లి కిరణ్, పెద్దాడ నూకరాజు, తదితరులు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మరువలేనిదన్నారు, స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాదిగ పోరాట సమితి మండల నాయకులు బాడపాటి కామరాజు, అయినవిల్లి యెహోను గండేపల్లి చిన్నఆప్పారావు, గండేపల్లి జీవరత్నం, అయినవిల్లి కొండబాబు,కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










